ఇతిహాసములు ఉత్తరరామాయణము బలిచక్రవర్తి రావణునకు విష్ణుప్రభావంబు సెప్పుట
బలిచక్రవర్తి రావణునకు విష్ణుప్రభావంబు సెప్పుట
కం.కడపటివాకిట నీవి
ప్పుడుగని మాటాడినట్టి పురుషుఁడె విష్ణుం
డుడుగక యొకచో నుండియు
నడఁగక యెల్లెడలఁ దోఁచు నతఁ డసురేంద్రా!
19
మ.మును నారాయణుఁ డేడనుండు? నని మా ముత్తాత యాత్మీయపు
త్త్రుని వేధింపఁగ నాతఁ డెల్లయెడలందుం బూర్ణుఁడై యుండు నం
చన నాతీరున నుండి కోరిన తదీయాస్థానగస్తంభసీ
మ నృసింహాకృతి నుద్భవించి విమతున్‌ మర్దింపఁడే రావణా!
20
మ.విను మవ్విష్ణునిచేతఁగాదె శుకుఁడున్‌ వృత్రుండు సంహ్లాదుఁడున్‌
దనువున్‌ శుంభనిశుంభశంఖముచుకుంద వ్యోమధూమామళా
ర్జున వైరోచన కాలనేమి కనకాక్షుల్‌ గూలుటల్‌ కాలకే
య నిశాటుల్‌ మధుకైటభాదికులు నుగ్గౌటల్‌ సురారీశ్వరా!
21
కం.మనవంటి దైత్యులెందఱు
వనజాక్షునితోడ నిటులు వైరముగావిం
చినవా రవ్విభుచే నొచ్చినవా
రును బలియుఁ దొడరి చెడ మనకేలా?
22
తే.గీ.నన్నొకని శౌరి బంధించినాఁ డటంచు
నెంచెదవుగాని తెలియలే వెల్లజనులఁ
జటుల సంసారమోహ పాశమునఁగట్టి
ప్రాభవంబున వెలయుట పంక్తివదన!
23
సీ.చెలఁగి ప్రపంచంబు సృజియించు నొకవేళ - నొకవేళ సృజియింప కూరకుండు
విభుఁడు దానై ప్రోఁచు విశ్వంబు నొకవేళ - నొకవేళ సాక్షియై యూరకుండు
నామరూపములతో నటియించు నొకవేళ - నొకవేళ నవి మాని యూరకుండు
దుష్టరాక్షసశిక్ష దొరఁకొను నొకవేళ - నొకవేళ సమబుద్ధి నూరకుండు
 
గీ.నెటులు తోఁచిన స్వేచ్ఛతో నటులయుండు
నెఱిఁగి భజియించువారల నెఱిఁగియుండు
నమ్మహాత్ముఁడు గట్టినయట్టికట్టు
లన్న! విడిపింప నీకు నా కలవియగునె?
24
చం.అని బలి దెల్పఁ బంక్తిముఖుఁడౌర! భయంకర మృత్యుయుక్తుఁడై
ఘనతరకాలదండమును గైకొని వచ్చు కృతాంతునంత వీ
రుని నొగిలించి వెండిమల రుద్రునితోఁ బెకలించి మించు నన్‌
జెనకఁగలాఁడె విష్ణుఁడు వచింపుఁ డతం డెటువంటివాఁ డనన్‌
25
మ.బలిదైత్యేంద్రుఁడు గ్రమ్మఱం బలికె నో పౌలస్త్య! వేదాంతవే
త్తలకుం గానబడం డనాదిలయుఁ డేతద్విశ్వ సృష్టి స్థితి
ప్రళయాపాదకుఁ డవ్విభుం డతఁడెపో బ్రహ్మాదిరూపంబుల
న్వెలయున్‌, దన్మహిమంబు లిట్టివని వర్ణింపన్‌ సమర్థుండనే?
26
సీ.యాగంబు యజ్వయు యాగైకఫలము న - య్యార్హమంత్రంబు లతఁడె సుమ్ము
దానంబు దాతయు దానసాధనము ల - ద్దానార్హకాలం బతండె సుమ్ము
యోగంబు యోగియు యోగోపదేష్ట యో - గానంద మహిమంబు లతఁడె సుమ్ము
ధ్యానంబు ధ్యాతయు ధ్యాననైశ్చల్య మా - ధ్యానార్హమూర్తియు నతఁడె సుమ్ము
 
గీ.తన్ను వినఁ దన్నుఁ బేర్కొనఁ దను నెఱిఁగిన
వారి యఘములు గడతేర్చు వాంఛితములు
గరుణ నొనగూర్చు బంధమోక్షముల కతఁడె
కర్తసు మ్మని బలిదైత్యభర్త యనిన
27
కం.వైరోచని మాటలు సెవి
దూఱక యరుదెంచి మున్ను తోఁచిన యల దౌ
వారికు నచ్చోఁ గానక
యౌరా! హరి యోడిపోయె నని గర్వమునన్‌
28
తే.గీ.అట్టహాసంబు సేయుచు నచట నిలక
పర్వతగుహాంతరము లెడఁబాసివచ్చు
కేసరివిధాన నవలి వాకిళ్ళు గడచి
పుష్పకం బెక్కి దైతేయపుంగవుండు
29
మ.బలి నిర్జించితి విష్ణుఁడున్‌ వెఱచె మద్బాహాబలస్ఫూర్తికిన్‌
బలియుం గన్గొన మీ స్థలంబున నికం బద్మాప్తపద్మారుల
న్గెలువం బోవలె నేఁగుదెం డనుచు మంత్రిశ్రేణితోఁ బల్కుచున్‌
బలుమాఱుం దనువారు ప్రస్తుతు లొనర్పన్‌ సంతసం బొందుచున్‌
30
వ.చని యుదగ్దిశాభిముఖుండై యద్దశముఖుండు హిమవద్గంధమాదన కైలాసాది పర్వతంబుల నతిక్రమించి యవ్వల31
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju