| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవుండు మాంధాతతోఁబోరి సంధి సేయుట |
| మ. | అజభూమిత్రుఁడు వల్కె నీవు సననేలా? రాక్షసాధీశ! ది గ్విజయారంభముఁ బూని నేఁడిదె యుదగ్దేశంబుమీఁదన్ బహు ధ్వజినీసంగతి నేఁగుదెంచె క్షణమాత్రం బోర్చినన్ దద్ధరా భుజుతో నీకు రణంబు గల్గు నన నుప్పొంగెన్ దశగ్రీవుఁడున్ | 58 |
| ఉ. | అంతటఁ గొంత సేపటికి నచ్చటికిన్ వినవచ్చె ధారుణీ కాంతు రధాంతరస్ఫురిత కాంచన నిర్మిత ఘంటికాధ్వనుల్ స్వాంతమరుజ్జవప్రథితసైంధవమేదుర కింకిణీధ్వనుల్ దంతి ఘటాపరిప్రకటితధ్వజచిత్రపటీపటుధ్వనుల్ | 59 |
| కం. | ఆ రవములు విని దశముఖఁ డీరసమున నట్టెలేచి యిదె చనుదెంచెన్ ధీరుం డగు యువనాశ్వకు మారుండని వడి నెదిర్చె మంత్రులతోడన్ | 60 |
| చం. | ఎదురుగఁబోయి పంక్తిముఖుఁ డింపును సొంపును దెంపుఁబెంపుఁజ క్కఁదనము రాజసంబు భుజగర్వముఁ గల్గిన యా నృపాలునిన్ గదిసి నరేంద్ర! నేను దశకంఠుఁడ! సంగరకాంక్ష వచ్చితిన్ బెదరక నన్ను మార్కొనుము భీతుఁడవైనఁదొలంగు నావుడున్ | 61 |
| సీ. | నిడుదకన్నులక్రేవ నడరు కెంజిగి కర్ణ - సాంకవమదముతో సంధి సేయఁ గనుబొమల్ ముడినొందుకంటె ముందుగఁ గరం - బుననున్న చాపంబు గొనయ మెనయఁ బెనుగాడ్పు సోఁకఁ గంపించు కెంజిగురు నా - బెట్టు హుంక్రియలాని పెదవి యదర రమణీయరత్నహారచ్ఛలంబున మనః - ప్రకటరోషజ్వాల బయలుపడఁగఁ | |
| గీ. | జుఱుకు చుఱుకున దశకంఠుఁ జూచి యౌర! యోరి! పౌలస్త్య! నాతోడపౌరణంబు సేయవచ్చితి? మంచి దేమాయె? నెదుటఁ జక్కనై నిల్వరా యంచు జనవిభుండు | 62 |
| కం. | పిడుగులకుఁ దోడువోయిన కడిఁదిశరము లసురఱొమ్ము గాఁడఁగ నేయన్ జడియక యాయుఱుములకా పడె నిపు డీ చినుకు లనుచుఁ బంక్తిముఖుండున్ | 63 |
| మ. | పదికోదండము లొక్కసారి గొని దర్పం బొప్ప మాంధాతపైఁ బ్రదరాసారము నింపఁ దద్విశిఖవర్షంబున్ నివారించి తన్ గదియన్ వచ్చు నిశాటమంత్రిమణులం గారించి భూభర్త బె ట్టిదపుందూపుల నొంప నంతకునిమాడ్కిన్ రావణుం డుగ్రుఁడై | 64 |
| మ. | తన బల్జోదులనెల్ల నొక్కట నయోధ్యానాధు రోధింపఁ బం చిన వారందఱుఁ జుట్టు ముట్టుకొని యాక్షేపించి కోపించి మిం చి నిశాతాస్త్రపరంపరల్ గురిసినన్ సింగంబు మాతంగభం జనముం జేయఁ గడంగినట్లు నృపుఁ డుత్సాహంబు రెట్టింపఁగన్ | 65 |
| సీ. | శుకునిఁబండ్రెండు సాయకముల నొప్పించి - సారణునేడింట జడియనేసి ధూమ్రాక్షు నెనిమిది దూఁపుల నొగిలించి - మారీచునిఁ బదింట మదమడంచి జంబుమాలిని, మూఁడు శరముల బడలించి - యూపాక్షు నాల్గింట నుదుటు మాన్చి త్రిశిరునిఁ బదియేను తీవాస్త్రముల నొంచి - దుర్ముఖు నైదింటఁదూల నేసి | |
| గీ. | వెండియుఁ బ్రహస్తముఖుల నుద్దండచండ కాండముల భండనము సేయకుండఁ దఱిమి తరమె నను గెల్వ నీ కని దశముఖాసు రాగ్రగణ్యుని మాంధాత యపుడు పొదివి | 66 |
| ఉ. | క్రౌంచవిభేదశాలియగు స్కందుని చందముఁజెంది ముందె న క్తంచరరాజు పేరురము గాఁడఁగ ముద్గర మెత్తి వ్రేసి నొ ప్పించిన సొమ్మసిల్లి ధృతిపెంపునఁ దెప్పిఱి, వాఁడు రాజ! ని న్నంచెద నేఁడు దండికడకం చతిరోషకషాయితాక్షుఁడై | 67 |
| ఉ. | అక్కనకాద్రి బిట్టదర నంటి యదల్చి యెదిర్చి యవ్విభుం డెక్కిన తేఁరు సెక్కలుగఁ జేసి హయంబులఁ ద్రుంచి సారథిం దక్కక నొంచి కేతనము ధారుణిఁ గూల్చిన నాగ్రహించి వే ఱొక్క రథంబుపై రవికులోత్తముఁడెక్కి లయాంతకాకృతిన్ | 68 |
| చం. | పటుతర ఘంటికాక్వణన బంధురమౌ మహనీయశక్తి యొ క్కటిగొని పంక్తికంఠ! తుదిఁ గంటివి పొమ్మని యేసి యార్చినన్ దటుకునఁ గేలిశూలమున దాని నడంచి దశాననుండు భ్రూ కుటు లెసఁగన్ నృపాలు పయిఁ గుంతము లిర్వది పూన్చి వైచినన్ | 69 |
| మ. | అవి ఖండించి యఖండకాండములు చండాంశుప్రభోచ్చండముల్ యువనాశ్వప్రియసూతి యేయ దనుజవ్యూహంబు భేదిల్లె నం త వివస్వత్సు దత్త దివ్యశరమా దైత్యేశ్వరుం డేసినన్ వివశుం డయ్యె నరేశ్వరుండు దివిజుల్ విభ్రాంతిఁ జింతింపఁగన్ | 70 |
| వ. | తదనంతరంబు | 71 |
| చం. | నిముసములోపలం దెలిసి నీరజబంధుకులాగ్రగణ్యుఁ డ య్యమరవిరోధిమీఁద జలదాశుగమేసినవాఁడు మారుతా స్త్రమున నడంచె భూపతి గృశానుశరం బరివోసి వైచిన న్విమతుఁడు రౌద్ర బాణమున నిల్పెఁ దదీయశిఖాపరంపరల్ | 72 |
| శా. | మాంధాతృక్షితినాథుడున్ గెరలి భీమస్ఫూర్తి బ్రహ్మాస్త్రమున్ సంధించెం దనవింట రాక్షసభటుల్ సంత్రాసముం జెంద గ ర్వాంధుం డద్దివిజారి పాశుపత మేయం బూనె నయ్యుద్ధతిన్ గంధిశ్రేణి గలంగెఁ గ్రుంగె ధర యాకంపించె స్వర్ణాద్రియున్ | 73 |
| శా. | ఆ యుత్పాత మెఱింగి యాడకుఁ బులస్త్యబ్రహ్మ వేంచేసి, యే లా యీ యుద్ధము? దీన లోకములకెల్లన్ భీతివాటిల్లె మీ రాయుష్మంతులరై చెలంగఁగల రుగ్రాస్త్రోపసంహారముల్ సేయుండన్నఁ దదాజ్ఞఁజేసి రటులే చిత్తంబు లుప్పొంగఁగన్ | 74 |