ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు పర్వతునిచేఁ దపః ఫలభోక్తల నెఱుఁగుట
రావణుఁడు పర్వతునిచేఁ దపః ఫలభోక్తల నెఱుఁగుట
సీ.తిలకంబు దిద్దు ముద్దులగుమ్మ యద్దంపు - నిద్దంపుఁజెక్కుల నీడఁగనుచు
నలరుదండలఁజుట్టు చెలి లేనగవుఁ జూచి - యీ వింత పూదండ యేడ దనుచుఁ
గలపంబు పూయు తొయ్యలి మేని కమ్మవా - సనలు పైఁ బొలయ మూర్కొని యలరుచుఁ
గపురంపు విడె మిచ్చు కలికిముచ్చట విన - వేడ్కయై మాటాడ వేఁడుకొనుచు
 
గీ.నింద్రభోగంబు పరిపూర్ణ చంద్రకాంతి
వెలయ, బంగారుఁ దే రెక్కి వేలసంఖ్య
లచ్చరలు గొల్వఁ దన మ్రోల నరుగునొక్క
దివ్యపురుషునిఁ జూచి దైతేయ విభుఁడు
48
తే.గీ.చూచి, తను లెక్కసేయక సొగసుమీఱి
పొలఁతులనుగూడిపోవు నిప్పురుషుఁడెవ్వఁ
డమరమునిచంద్ర! వివరింపు మనిన దనుజ
పట్టబద్ధున కనియె నప్పర్వతుండు
49
సీ.ఒకనాఁడు జలపాన మొనరించి బహుకాల - ముపవసించిన మేటి తపసి యితఁడు
దళ మొకించుక మెక్కి తలఁకక పెక్కేండ్లు - జపముసేసిన క్షమాశాలి యితఁడు
దిగువరాలినపండ్లు దిని యనేకాబ్దముల్‌ - ధ్యానంబు సేసిన ధన్యుఁ డితఁడు
అనిల భక్షణసేసి యమితవత్సరము లు - గ్రసమాధిఁ బూనిన ఘనుం డితండు
 
గీ.దనుజవర! యీతఁ డమృతంబు ద్రావి కల్ప
వృక్షముల నీడ నీ వేల్పువెలఁది మంది
యధరములు నొక్కుకొనుచుఁ జిరాయు వంది
వెలయఁబోయెడు నితనిపై నలుగవలదు
50
మ.అని యమ్మౌని గణింపఁగా వినుచునున్నంతన్‌ మణిస్యందనం
బునఁ జండాంశుసమప్రచండరుచి వేల్పుం గొమ్మలుం గొల్వఁగాఁ
జను వే ఱొక్కనిఁజూచి యెవ్వఁ డితఁ డో సన్మౌని నా సంగరో
ర్విని స్వామిప్రియకాంక్షఁ గూలిన మహావీరుండు దైత్యాగ్రణీ!
51
వ.అని కొండపేరిపాఱుండు నుడివిన నూఁకొనుచు నయ్యసుర మండలాఖండలుండు వెండియు నిజాగ్రభాగంబున52
సీ.ఉభయభాగముల యందుండి కొమ్మలు వీచు - వెలిచామరములు వెన్నెలలుగాయఁ
బద్మరాగవిమాన భాసమానద్యుతుల్‌ - గపటసంధ్యారాగకాంతి నింప
వీణెలు వాయించు వెలఁదుల గాంధర్వ - కలనఁ జట్టుల నెల్లఁ గరఁగఁజేయ
హైమకుండలకిరీటాదిభూషణరుచుల్‌ - నింగికి బంగారు నీరు వోయఁ
 
గీ.దనువు దాల్చిన మరుని చందమున నంద
మొంది యుడువీథిఁ జనుచున్న యొక్క పురుషుఁ
గాంచి వీఁ డెవ్వఁ డనఁ బాత్రకనకదాత
యితఁ డని తపస్వి దెలుప దైత్యేశ్వరుండు
53
కం.ఆ ఋషిఁగని యతిశేఖర
వీరలలో నెవ్వరైన విసువక నాతోఁ
బోరాడఁగఁగలవారు గ
లారె? తెలుపు మనఁగ నతఁడు లలితోక్తి ననున్‌
54
ఉ.ఆయతధర్మకర్మ జనితాంచిత సౌఖ్య రసానుభూతికై
పోయెడువారు వీర సురపుంగవ! వీరల డాసి కయ్యముల్‌
సేయఁగరాదు వీరు నని సేయఁగరారు కృతార్థు లౌట నీ
కీ యెడఁ బోరఁగావలసెనేని గణించెద నొక్కశూరునిన్‌
55
మ.అతఁ డెవ్వాఁడని యంటివే విను మయోధ్యాపత్తనాధ్యాసియై
చతురంభోధిపరీత భూభరణ దీక్షాదక్ష బాహాబలో
న్నతి మించున్‌ యువనాశ్వనందనుఁడు మాంధాతృక్షితీశుండు నీ
ప్రతియౌ వీరుఁడు నిక్క మిప్పటి నరేంద్రశ్రేణిలో రావణా!
56
కం.నా విని రావణుఁ డౌనౌ
నీ వెఱిఁగి చినటు లంద ఱెంచెద రతనిన్‌
దేవర్షీశ్వర! యిపుడ
భ్భూవరుఁ డెందుండు నిపుడ పోయెద ననినన్‌
57
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju