ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుఁడు సూర్యలోకముపై దండెత్తుట
రావణుఁడు సూర్యలోకముపై దండెత్తుట
మ.అమరక్ష్మాధరతుంగశృంగగతదివ్యాధ్వంబునన్‌ వారివా
హమరుద్భూతనివాసముల్‌ గడచి, సాధ్యస్థానగంధ్వరలో
కములున్‌ సిద్ధపదంబు మున్నగు నెడల్‌ గన్గొంచుఁదల్లోకుల
న్సమరక్రీడకుఁ బిల్చుచున్‌ వెఱతుమన్నన్‌ వారి మన్నించుచున్‌
35
మ.దనుజగ్రామణి భీతిలేక యిటు లుద్యద్వేగియై లక్షయో
జనముల్‌ వోయి, ప్రభాకరార్చకులకున్‌ ఛాయాధినాధావలో
కనదీక్షాఢ్యుల కర్యమానతులకున్‌ గాలోచితార్ఘ్యాంబువ
ర్జనసంసక్తులకున్‌ నివాస మగు భాస్వల్లోకమున్‌ గన్గొనెన్‌
36
వ.కనుంగొని నిరవధికాలోకదురవలోకం బగు నాలోకలోచనలోకంబు దఱియం జొచ్చి యచ్చట37
సీ.అరుణచోదిత ఫణాధరబంధ బంధుర - చ్ఛందోమయాశ్వహేషలు సెలంగఁ
గనకదండోద్దండకరదండమాఠర - ప్రముఖసాహోవిరావము లెసంగ
వాలఖిల్యాదిక వ్రతిముఖ్య పఠిత - సౌగ్యజుషోక్తసౌరమంత్రార్భటిదగఁ
జామరగ్రాహిణీఛాయాసఖీమణీ - కరమణికంకణక్వణన మడర
 
గీ.నేకచక్రరథారూఢుఁడై కిరీట
హార కుండల కటక కేయూర ముద్రి
కాదిభూషణ ఘృణులతో నమరు నుగ్ర
భానుఁ గనుఁగొని పౌలస్త్యసూనుఁ డపుడు
38
శా.ఆరక్తాంబరగంధమాల్యములతో నత్యుష్ణతేజంబుతో
హైరణ్యాంగము చెల్వుతో యుగపదూర్ధ్వాధో -ఖిలాశాస్ఫుర
ద్ఘోరస్ఫారసహస్రభానువులతోఁ దోఁతెంచు నబ్భానునిన్‌
ధీరత్వంబున నింత గైకొనని పంక్తిగ్రీవుఁ డుగ్రాకృతిన్‌
39
మ.తన సేనాపతి మోముఁగన్గొని ప్రహస్తా! నీవు శీఘ్రంబె యీ
యనఁ జేరంజని పంక్తికంఠు డని సేయన్‌ వచ్చెఁ బోరాడ ర
మ్మనుచుం బిల్వుము భీతిఁజెందిన జితో-హం నూన మిత్యుక్తియై
నను వాక్రువ్వఁగఁజేసి రమ్మనిన నన్నాకారివాక్పద్ధతిన్‌
40
చం.అతఁడును బేర్చి చండకిరణావళి వేఁడిమికోర్చి పద్మినీ
పతినికటంబు సేరునెడఁ బార్మ్వగు లడ్డము సొచ్చి యేల వ
చ్చితివీట? కన్న రావణుఁడు సెప్పిన వాక్యము లెల్లఁజెప్పి మీ
పతి నిఁక మాపతిం దొడరఁ బంపుడు నా విని వారు చెచ్చెరన్‌
41
చం.తపనునిఁజేరి మ్రొక్కి యవధారు త్రయీమయదివ్యమూర్తి! శౌ
ర్యపరుఁడు రావణుండు సమరం బొనరింపఁగ వచ్చినాఁడు తో
రపు భుజశక్తి యొప్పసమరంబె యొనర్చెదరో యిదేల యం
చిపుడు ‘జితో-స్మి’ యంచు వచియించెదరో యిదియేమి నావుడున్‌
42
ఉ.ఆ హరిదశ్వుఁడిట్లను దశాస్యునితో మనకేటి పోరు? మం
దేహనిశాటులం దొడరి నిత్యముఁబోరెడు పోరు సాలదే?
యూహ లిఁకేల? యిప్పటికి నోడితి మన్నను దప్పుగాదు పొం
డాహవకేళి నోడె రవి యంచనుఁ డాయనతోడ నావుడున్‌
43
తే.గీ.వారిలో దండుఁడనువాఁడు వచ్చి పంక్తి
కంఠుని గని యయ్య! నిను డాసి కయ్య మీయఁ
జాల కోడితి నన్నాఁడు చండభానుఁ
డిచట నందఱి గెల్చితి వేఁగు మనిన
44
శా.ఆ దైతేయకులేశ్వరుం డపుడు బాహాస్ఫాలనధ్వాన మ
య్యాదిత్యానుచరాళి గుండియలు వ్రయ్యంజేయఁ గాలా భ్రమో
నా దిక్కుల్‌ వగులంగ నార్చుచుఁ బ్రధానశ్రేణి యాత్మప్రతా
పాదుల్‌ పేర్కొని యెంచఁ బుష్పకవిమానారూఢుఁడై యవ్వలన్‌
45
కం.తుహినాంశుని గెల్చెదనని
మిహిరోపరిలోకములు గ్రమించి రదీయమునన్‌
బహుయోజనముల పొడవగు
మిహిమల తుదఁజేరి విశ్రమించినయంతన్‌
46
కం.అచటికి వీణామౌనిస
హచరుండగు పర్వతాఖ్యుఁ డరుదెంచిన రా
త్రిచరేంద్రుఁ డుపచరించి స
ముచితస్థితి మాటలాడుచుండెడి వేళన్‌
47
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju