| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | చతురాననుండు చంద్రునిపై దండెత్తిన రావణుని వారించుట |
| తే.గీ. | వచ్చి యిదియేమి? వత్స! భవత్సమగ్ర బాహువిక్రమ మీ సితభానుమీఁదఁ జెల్లునే చూప? నీతఁడు చల్లనిదొర! వీ వల దగ్నిబాణముల్ విడువు మలుక | 80 |
| మ. | అని వారించి విధాత వెండియును వత్సా! నీ మహాసాహసం బునకే మెచ్చితి, మంత్ర మొక్కటి దయాపూర్వంబుగా నిచ్చెదన్ గొను మమ్మంత్ర జపంబు సాంగమయినన్ ఘోరాహవక్రీడ ని న్నెనయున్ గెల్పది విఘ్నమైన నశుభం బేతెంచు శీఘ్రంబునన్ | 81 |
| మ. | అది మృత్యుంజయ మాపదల్ వొడమి త్రోయన్ రానివేళన్ జపిం చఁదగున్ నీ కని శక్తి కీలక ఋషిచ్ఛందోధిదైవంబులున్ దుది హోమంబును దర్పణంబు విధియున్ దోడ్తో నెఱింగించి పూ ర్ణదయన్ మంత్ర మొసంగి వెండియును గీర్భామాధవం డిట్లనున్ | 82 |
| తే.గీ. | అసురవల్లభ! ప్రాణాత్యయంబునందు నీ శివాష్టోత్తరశతాఖ్య లేకతమున నే జనుఁ డవిఘ్నముగ జపియించు వాని కొదవు విజయంబు హానియౌఁ గొదవయైన | 83 |
| సీ. | దేవదేవుఁడు మహాదేవుఁ డీశుఁడు భూత - భావనుఁ డభవుఁడు భవుఁడు శివుఁడు భుజగభూషణుఁడు శంభుఁడు నీలలోహితుఁ - డక్షరుం డజుఁడు వైయాఘ్రచర్మ ధరుఁడు జగత్కర్త హరుఁడు లలాటాక్షుఁ - డంతకాంతకుఁడు యుగాంతకరుఁడు పశుపతి శూలి కపాలి కాలగ్రీవుఁ - డుగ్రుండు భీముఁ డాద్యుఁడు గిరీశుఁ | |
| గీ. | డతులుఁ డవ్యయుఁడకలంకుఁ డష్టమూర్తి యచ్యుతుఁ డనాదిలయుఁడు బ్రహ్మణ్యుఁ డచలుఁ డస్థిహారుండు హరిసభ్యుఁ డభ్రకేశుఁ డాశ్రితులఁ బ్రోచునని చెప్పి యజుఁడు సనిన | 84 |
| మ. | శశి నిర్జించితినంచు నన్నెలవునం జాటింపఁగాఁ బుచ్చి నల్ దిశలున్ ఘూర్ణిలఁ జేయు తూర్యములతో దేవాచలాధిత్యకా విశదేందూపలభూమికిన్ దిగి కడున్ విభ్రాంతితో నచ్చటన్ దశకంఠుండు వసించె నంబరసరిద్వాతంబు పైఁబాఱఁగన్ | 85 |
| వ. | ఇవ్విధంబున నాఁటిరేయి యెల్ల నచ్చోట విశ్రమించి మఱునాఁ డరుణోదయంబునఁ గాలోచిత కృత్యంబులు నిర్వర్తించి | 86 |
| కం. | అలరుచు లంకకు నిఁక బో వలయు నని యమాత్యభృత్యవర్గము వినఁగాఁ బలికి నలుగడల విడిసిన బలములఁ దివియించి దైత్యపతి పయనంబై | 87 |
| చం. | మణిమయదివ్య పుష్పక విమానరుచుల్ దివినిండ సైనికా గ్రణు లిరువంకలన్ భటపరంపరతో నడువన్ శుకుండు సా రణుఁడు ననేకభంగులను బ్రస్తుతి సేయఁగ బోవుచుండి రా వణుఁడొక దుర్విచార మొదవం దనవారలఁజూచి యిట్లనున్ | 88 |
| మ. | ఎలప్రాయంబులు చెల్వముల్ చతురతల్ హేలావిశేషంబులున్ గల కన్యామణు లెవ్వరొక్కొ? బలిమిన్ గాంక్షానుకూలంబుగాఁ బలుమందిం జెఱఁదెత్తు నా విని మహాపార్శ్వ ప్రహస్తాదిమూ ర్ఖులు మోముల్ వికసిల్ల నిట్లనిరి రక్షోనాథుఁ డింపొందఁగన్ | 89 |