| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశవదనుండు దేవయక్షాది వనితలఁ జెఱలువట్టుట |
| సీ. | ముదిమి యెన్నఁడులేని కొదమప్రాయపుఁజెల్వు - నేర్పులు వేల్పుఁగన్నియల కమరు సొలపుల బెళుకుఁజూపుల తళ్కుఁజెక్కులొ - య్యారముల్ మనుజకన్యల కమరు నిడువాలుజడలు పెందొడ లంచనడలు నె - న్నడుములు నాగకన్యకల కమరుఁ బాటల మేలిమి మాటల తియ్యఁద - నంబు గంధర్వకన్యకల కమరు | |
| గీ. | మఱియుఁ దక్కిన జాతుల మందయాన లొఱపులు వహించియుందు రొక్కొక్కవగల వీరిలో మెచ్చు వచ్చినవారిఁబట్టి తేవలయునన్న నిందఱఁ దెత్తు ననుచు | 90 |
| స్రగ్ధర | కరుణావేశంబు ధర్మక్రమము గలుషశంకాకలంకంబు లాత్మన్ జొర నీ కమ్మూర్ఖుదేవాసురనరవరచక్షుస్‌శ్రవస్సాధ్యవిద్యా ధరసిద్ధాదిత్య రక్షోదనుజ గరుడ గంధర్వ యక్షాదికాంతః పురకాంతాశ్రేణి బల్మిన్ బొదివి బెదరి వాపోవఁగాఁబట్టితెచ్చెన్ | 91 |
| మహాస్రగ్ధర | చొచ్చున్ గేహాంతరంబుల్ సుడిసిన మగలన్ జుట్టలన్ బిట్టు పొట్టల్ వ్రచ్చున్ శాతాసిధారన్ వనితల తలల వ్యగ్రుఁడై పట్టి యీడ్చున్ దెచ్చున్ యానంబుఁజేరన్ దెససెడి తను నిందించినన్ బీరముల్ వా క్రుచ్చున్ సైరించి దన్నున్ గొలువుఁడెటకుఁబోఁగూడు మీ కంచు నవ్వున్ | 92 |
| సీ. | సీమంతమౌక్తికశ్రేణి జల్లున రాల - దట్టించి ముందలల్ వట్టి యీడ్చి వలుఁద చన్నుల హారవల్లికల్ దెగిపోవఁ - బయ్యెదల్ బలిమిమైఁబట్టి తివిచి కమ్మక్రొవ్విరి సరుల్ గాసియై యసియాడ - బలుకీలుఁ గొప్పులఁబట్టి యీడ్చి కడియముల్ గాజు లుంగరములు బిట్టూడఁ - బల్లవహస్తముల్ వట్టి తిగిచి | |
| గీ. | మూల మూలల నొదిఁగిన మ్రొక్కివేఁడు కొనిన మాయన్న కావవేయనిన వృద్ధ జనులమాటుల కేఁగిన సకియలెంత పొరలి యేడ్చినఁబోనీక చెఱలు వట్టె | 93 |
| వ. | మఱియు నగ్గుణహీనుండు, గుఱి మేర యెఱుంగక, తల్లిదండ్రుల మఱుంగులనున్న మెఱుంగుఁబోడుల, నత్తమామల క్రిందనున్న యుత్తమాంగనలఁ, దమ మగలతోఁ గలసి కాపురంబులు నేయు మహాపురంధ్రులఁ, బురోపవనంబులం దోడిచేడియలతోడం గూడి క్రీడించు కాంచనాంగుల, జలకేళిం దేలు బాలికల, ద్యూతాదివినోదక్రియలం జక్కిన చక్కెరబొమ్మలం, బెక్కునగల నలంకరించుకొను చంచలాక్షుల, విమానంబు లెక్కి హరిపదమధ్యంబున విహరించు హరి పద మధ్యల, గిరికందరంబుల యందు వేడుకలఁ జెందు కుందరదనల, సౌధమందిరాళిందంబులం దిరుగు మందగమనలఁ, బరాంగన లనక పతివ్రత లనక బాలిక లనక, (సుకుమార లనక, మహాపుణ్యాత్మ లనక, ముగ్ధలనక - అని అధిక పాఠము.) యెల్ల జాతుల నాతుల బలాత్కారంబునం బట్టి తెచ్చి, పుష్పకంబుపై నుంచునప్పుడు, హాహాకారంబులతో విలపించువారును, పలికినదె పలుకుచుఁ బలుమారు పరితపించువారును, నేమి సేయుదమని రోదనంబు సేయువారును, నింతదురవస్థ వచ్చెనేయని తల్లడించువారును, నానాగతులంబొగులుచుఁ గరంబులు బిసికికొనువారును, నుఱుమని పిడుగువలె నిచ్చెడు గెక్కడనుండి వచ్చె ననువారును, నిట్టికష్టునకు సృష్టికర్త యెట్టు వరంబులిచ్చె ననువారును, నింక నెక్కడి ధర్మంబు? లోకంబులన్నియు నధర్మోపహతంబులయి, చెడుకాలం బరుదెంచె ననువారును, అయ్యయ్యో! యింత యరాజకం బై దిక్కు లేకపోవునే యనువారును, ఓహో! యింద్ర చంద్రాదిదేవతలారా! మీరైన మా యాపద నివారింపరే యనువారును, నీ క్రూరుని చేతులు వెండికొండ క్రిందఁ జిక్కిననాఁడట్టె యడంగఁ ద్రొక్కి నుగ్గునూచంబుసేయక మరల వరంబులిచ్చి హరుండు దమ గోడుఁ బోసికొనె ననువారును, హరుండేమి సేయుఁ? దొలిపుట్టువుల నేమిపాపంబులు సేసితిమో యవి యనుభవింపకపోవునే యనువారును, జననీజనక గురుబాంధవ ప్రాణేశ్వరసఖీ ప్రముఖసుహృజ్జనంబులం దలంచికొని కన్నీరు నించువారును, నిట్టూర్పులు నిగిడించువారును వగలం బొగులువారును, రావణా! యింత దురాగతంబు గొఱగాదు. మది మది నుండి యిట్టిపాపంబుల కేల యొడిగట్టెద వనువారును, దమవారి నందఱం పట్టిసంబునం దెగగొట్టినట్టు మమ్ముం దిగగొట్టి పుణ్యంబుగట్టుకొమ్మనువారును, నాఁడువారియుసురుగొంచెంబుగాదు నిన్నును నీవారిని నీఱుగావించుఁజుమీ యనువారును, నిన్నివగలంబొగులు మగువలం బట్టి తెచ్చి, వీరివలననేమి సుఖం బనుభవించె దనువారును, బహుసంసారచ్ఛేదనంబులు సేసి యీసడియును దోసం బెన్నినాళ్ళకు వీడుకొనం గలవాఁడ వని వేమఱు వినన్ దిట్టువారునునై, వాని చుట్టును నెరసిన యపయశంబు గనిపింపఁ జేయుకై వడి, వీడిన కేశపాశంబులతో, వానికీర్తిప్రతాపంబులు విరూపంబు లయిపొడవడంగువడవునన్ దెగిపడు మౌక్తికహారమణి హారంబులతో, వానిపాలిటి రాక్షస సామ్రాజ్యలక్ష్మీ సౌమనస్యంబు వాడిన తెఱం గెఱింగించుభంగిన్ దుదిముట్టవాడిన ప్రసవదామంబులతో, వాని ముంచు కలుషజలరాశి యిట్టిదని తెల్పునట్టుల యిట్టలంబుగఁ బుట్టి ప్రవహించు నేత్రకజ్జల ప్రవాహంబుతో, వాఁ డెక్కిన విమానంబుతో, వాని భస్మంబు సేయం జాలు రోషజ్వాలికాభీలకటాక్ష జాలంబులతో, గడగడ వడంకుకౌనులతో, జడుపుఁజెమ్మటలు దొలంకుమేనులతో, నిట్టూర్పు సెగలన్ బొగులు వా తెరలతో, నశ్రుజలధారలన్ దేలు కన్నుఁదామరలతో, ముంగురులమొగిలు తెగల మఱంగుపడి మెఱుంగు దొఱంగు మోముఁజందురులతో, డెందంబుల సందడించుచింతాపరంపరలతోఁ, బొరలుచున్ దెరలుచు నలఁత నొందుచు వ్రాలుచు సోలుచు మూర్ఛిల్లుచుఁ గార్చిచ్చు సుట్టు ముట్టిన నొల్లంబోవులేళ్ళ వలె నప్పల్లవపాణులు వెల్లవెల్లనై, ధైర్యంబు పెల్లున నుల్లంబు లొక్కింతి సేసికొని తమయంతవట్టుం గూడుకొని, యేకవాక్యంబుగా రావణు నుద్దేశించి యిట్లని శపియించిరి. | 94 |