ఇతిహాసములు ఉత్తరరామాయణము దశగ్రీవుండు కైలాసోద్యానమందు విహరించుట
దశగ్రీవుండు కైలాసోద్యానమందు విహరించుట
తే.గీ.అట్టి వెన్నెల బయల దశాననుండు
తన బలంబుల కెడగాఁగఁ దలఁగి వెండి
కొండపై నొక్క సెలయేటిదండ నలరు
నలరుఁదోటఁ బ్రవేశించి యన్నెలవున
164
మ.అవలోకంబులకుం బ్రియం బడరఁ జేయన్‌ మల్లికామాధవీ
లవలీముఖ్య లతాగృహోజ్జ్వలరసాల ప్లక్ష జంబీరనిం
బవటాశ్వత్థకపిత్థ హేమకదళీ పాటల్యశోకాది భూ
జవిశేషంబుల డంబు మెచ్చుచు యథేచ్ఛన్‌ గ్రీడఁ గావింపఁగన్‌
165
శా.ఆ కప్రంపుటనంటి మూఁక నడిచాయన్‌ మించు పన్నీటికే
ళాకూళిం దిలకించి యాదరిని జెల్వంబైన చెంగల్వరా
ఱాకట్టుం దెలిచల్వ దిన్నెఁగని యౌరా! యెంత సౌఖ్యప్రదం
బై కన్పట్టిన దీస్థలం బనుచు దైత్యస్వామి యందుండఁగన్‌
166
సీ.గేదంగివాసనల్‌ గిలుబాడి నునుసుర - పొన్నపువ్వులవలపులు గ్రహించి
పొగడల పరిమళంబులు గొన్ని లంకించి - మొల్లల నెత్తావి కొల్లలాడి
పాటలీసుమ సౌరభముఁ జూఱఁగొని మల్లి - యల సుగంధశ్రీల నపహరించి
విరవాదుల నెసంగు సురభిళత్వముఁ గాంచి - చంపకామోద తస్కరత మించి
 
గీ.పరిసర సరశ్చరమరాళపక్షచలిత
లలిత జలబిందు బృందతుందిలతఁ జెంది
మెట్ట చెంగల్వపుప్పొడు ల్మెట్టి మెలఁగు
చలువ తెమ్మెర యమ్మేటి శ్రమము మాన్చె
167
శా.ఆ మందానిలు వెంబడిన్‌ స్మరధనుర్జ్యా బంధపుష్పంధయ
స్తోమధ్వానము మించె నంచితశుకీసూక్తుల్‌ రహించెన్‌ పిక
శ్యామాగానము మించె నంత నలకాసౌధాంతర స్త్రైణ వీ
ణామాధుర్య సువాద్యముల్‌ దశముఖానందం బొనర్చెం దగన్‌
168
వ.ఇవ్విధంబున169
మ.పలుతావుల్‌ వెదజల్లు తెమ్మెరలు పైపై డాయ! రేరాజు వె
న్నెల గాయన్‌ మధుపాళి మ్రోయ గలకంఠీపాళి గూయన్‌ మరు
ల్లలనల్‌ గానము సేయ నొంటి నిశివేళన్‌ దోఁటలో నైందవో
పలవేదిన్‌ వసియించు పాంథుని స్మరాపస్మారముల్‌ సేరవే!
170
ఉ.చక్కెరతిండి తత్తడి వెసన్‌ దుమికించుచుఁ బంక్తికంఠుఁడా!
చిక్కితి వంచు నించువిలు చేకొని యెక్కిడి కల్వతూపుచా
లెక్కుడు కిన్కతోఁదొడిగి యేసి మనోభవు డార్చె నందునన్‌
జిక్కని తాల్మికత్తళము చిన్గిన స్రుక్కి సురారి యాత్మలోన్‌
171
సీ.చక్కని చెలి చెక్కు నొక్కినప్పుడుగదా - యీ చందురాతిన్నె యింపొనర్చుఁ
గలికి పొక్కిలిసౌరుఁ గాంచునప్పుడు గదా - యీ పొన్న పూఁదోఁట యింపొనర్చుఁ
జాన వాతెఱతేనె లానునప్పుడుగదా - యీ తేనె సెలయేఱు లింపొనర్చుఁ
సుదతి ముచ్చట చెవిసోఁకునప్పుడుగదా - యీ చిల్కగుమి పల్కు లింపొనర్చుఁ
 
గీ.నతివ చిఱునవ్వు వీక్షించునప్పుడుకద
యీ శరచ్చంద్ర చంద్రిక లింపొనర్చుఁ
బెక్కు లేటికి? నిందొక్క టెక్కులాడి
యిపుడు దొరకినఁగద యిన్ని యింపొనర్చు
172
గీ.అని తలంచుచు నుస్సురు మనుచుఁబట్ట
పగలుగా వెన్నెలలు గాయఁ దొగలఱేని
నట్టె చూచుచు విరహార్త్తుఁడగుచు ముద్దు
గుమ్మ మొక్కతె రాఁగోరుకొనుచునుండె
173
వ.అయ్యవసరంబున174
సీ.కులిశాయుధుని నిండుకొలువులో గుజరాతి - మేలుకోపులఁగొంత మెప్పు వడసి
యని మొనఁదెగివచ్చునట్టివీరుల నెదు - ర్కొనఁ దోడిచేడెలఁ గూర్చి పనిచి
యిదిగొ మీ విడిదలకేన వచ్చెద నంచుఁ - దమకించు యజ్వలఁ దాళఁబలికి
చెలిమిచే వెంట వచ్చిన మేనకాదిపూ - ర్ణేందుబింబాస్యల నిండ్ల కనిచి
 
గీ.ప్రాణపదమైన ధనరాజు పట్టిమీఁది
బాళి త్వరసేయ రంభలోపలికిఁబోయి
కాసె చనుకట్టు బంగరు గజ్జెలాది
గా వదలి శీఘ్రమున జలకంబులాడి
175
సీ.ఎలమాదళపు మేలిజిలుగు పావడఁజూచి - వలదని చలువపావడ ధరించి
చంద్రిక పని వన్నెచేల యేలని హొన్ను - జిగిబురుసాపని చీరఁగట్టి
కస్తూరికాచర్చ సిస్తుగాదని నీటు - గాఁ దావి కుంకుమగంధ మలఁది
జంటముత్తెపుకుట్టు జంటఱవిక మాని - రహియించు మొగ్గల ఱవిక దొడిగి
 
గీ.కపురతిలకంబు ముత్యాలకమ్మదోయి
తారహారము మగరాలదండ రెంట
పేట పాపటబొట్టును నీటుగులుక
నాత్మకింపైన సింగార మవధరించి
176
కం.ఎడలేక కపుర వాసన
లడరెడి బాగాలు కొన్ని యాకుమడుపులున్‌
బడఁతుక యొడి నిడుకొని వెం
బడిఁ బడిరా రంభ సంభ్రమంబున వెడలెన్‌
177
వ.ఇవ్వడువున నిల్లు వెలువడి యప్పల్లవాధర నలకూబరోపగూహనోల్లాసంబునన్‌ బయలుదేఱి మేలివలిపె సరిగంచు చలువైన పైఠాణిసేలు మేలుముసుం గిడి, శరద్ఘనంబులో వెలింగెడు నెలరేఖం దృణీకరించి, మగరాల పంజరంబునం జెలరేఁగు వలరాయలపట్టంపురాచిల్క కనుంగుచుట్టంబై, దిట్టతనంబుతో నవనిధిపట్టభద్రునిపట్టణపథంబు పట్టి, పదంబులం బెట్టిన మెట్టియలు కటకంబులతో బిట్టుగా మొరయ, రజతగిరి కరుగుదెంచునట్టి సమయంబున178
కం.అరుదెంచి తోడి చేడియఁ
బరికించి సమీపమయ్యెఁ బడతిరొ యలకా!
పుర మిదె యదె యా చక్కని
దొర బంగరుమేడ యనుచు దొయ్యలి యవలన్‌
179
మ.కనియెన్‌ మత్తగజోత్కరోత్కరజఫూత్కారోత్కటాంభఃకణా
ర్ద్ర నభః ప్రాంచితతారమున్‌ సురనదీరంగత్తరంగాబ్జరం
గనటద్ధాతృ తురంగ సంఘఘనశంకాకృద్వినీలాంశుకే
తనదీవ్యద్రథఘోరమున్‌ దశముఖోద్యద్వాహినీవారమున్‌
180
కం.కని యివి రావణసైన్యము
లని తెలిసి వయస్యఁజూచి యసురులు మూర్ఖుల్‌
చనరా దీ తెరువున నిఁక
జనఁదగు గిరిమీఁద మనకు సకియరొ యనుచున్‌
181
కం.ఆ లలనామణి యసురుల
పాళెమునకుఁ గొంత తొలఁగి పావననందా
కూలంకష యవ్వలిదరి
కేళీవనిఁ జొచ్చె నిజసఖీరత్నముతోన్‌
182
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju