| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | చంద్రికావర్ణనము |
| మ. | నవచంద్రాతపకాంతిలక్ష్మి దొలుతన్ రాణించె దిక్కుడ్యభా గవిరాజన్మృదు శోణమృత్కలన రంగచ్చక్రచక్రచ్ఛద చ్ఛవిదాయాద సమేధమానరుచిఁ జంచత్ఫుల్ల సౌగంధికా టవి సంబంధి విభాధురంధరపటిష్ఠత్వంబు వాటిల్లఁగన్ | 162 |
| వ. | ఈ క్రమంబునఁ గ్రమక్రమప్రవర్ధమానంబై నెగడు నయ్య గణితసాంద్ర చంద్రికానికరంబు హరిహరిదంతదంతావళ చతుర్దంత దంతుర ప్రభాసముల్లాసంబు నుల్లసించి, యుల్లసితగిరిమల్లికా ప్రసవవల్లికామతల్లికల మొల్లంపుఁగాంతు లెల్లంగొల్లలాడి, ప్రథమకుధరాధిత్యకాస్థలచరత్సటీశ్వర సటాచ్ఛటాస్వచ్ఛతర విభాగుళుచ్ఛంబుల నాచ్ఛాదించి, జల్లిమెకంబుల వెల్లజల్లులతో నల్లిబిల్లియై, భిల్లవల్లవాధరలు భల్లపరంపరలం బగిలించిన ముదురు వెదుళ్ళనుండి జల్లనరాలి నలుదెసల నెరసిన క్రొత్తముత్తెంపు మొత్తంబుపై నత్తమిల్లి, చిత్తజ క్రీడాయత్తచిత్తంబులతో నెత్తంబుపట్టుల హత్తి, మరులెత్తి, వేడుకకాండ్రతో గూడి క్రీడించు ఖచర మత్తకాశినుల బిత్తరంపుగుత్తంపు గబ్బిచన్నులపై జిక్కువడు వెలయెక్కుడు మగఱాలసరుల నిగన్నిగల కగపడి, విమానంబు లెక్కి యుప్పరంబునఁ దమ యిచ్చగాఁ దిరుగు నచ్చరయొప్పులాఁడుల కప్పుగొప్పులంజుట్టిన వేల్పుఁజెట్టుఁ బూదండల దండితనంబున మెండుకొని, పురోపవనసరోవర పరిసరంబుల నొప్పెడి పూపుప్పొడి దుమారంపుఁదిప్పల కుపనాథులం దెచ్చుకొని మచ్చికలఁగలసి మెలసి విహరించునెడఁ జీమ చిటుక్కు మన్నం గళవళించి, మోములు వెలువెలంబాఱ, బెదరి దరెడివారిం జూచి కిలకిల నవ్వు జవ్వనంపురవ్వలాఁడుల మవ్వంపు నవ్వులతోఁ జివ్వలకు నివ్వటిల్లి, యింటిముంగిళ్ళం దెల్లని చల్వపాన్పులపైఁ బవ్వళించి, పెందలకడనె వచ్చెద మని వాక్రుచ్చి ప్రొద్దువోయి వచ్చిన ననుపుకాండ్రఁ గటాక్షింపక, మొగంబు లవలంబెట్టుకొని నిట్టూర్పులు నిగిడించి మించిన వలపున నిట్టట్టననేరక యూరకయున్న నీ నేరంబు గావందగు నని తమ యడుగులపై వ్రాలిన గెరలి పదతాడనంబు గావించు కించువెలయాండ్ర చరణనఖకాంతులపై దొంతరలుగొని, యింతలింతలు బుడుతలతో నింతులతో బంతులు సాఁగి, పరమాన్నాదిపదార్థంబులు భుజియించు కలవారి వెండిపళ్ళెరంబులకు నించక నించిన సమంచితక్షీరధారాపూరంబై, కలధౌతమయసౌధోపరిపరిచిత మృదులశయ్యాతలంబులం బొరలు విరహిణీజనంబుల విరహపాండు శరీరంబులకుం బూయక పూసిన ఘనసారంబై, యుబుసుపోకలకు నెలదోఁటలో మెలంగు మెఱుంగుఁబోఁడులు చిన్ని పొన్నలంగన, పూవక పూచెనన, ననవింటి మన్నెవాని కీర్తి మూర్తీభవించి భువనంబుల వ్యాపించె నన, ముజ్జగంబులం బ్రవహించు గంగాతరంగిణీజలంబుల కెల్లఁ బావనత్వంబు సంఘటిల్ల, నొక్కటియై యిటువలె వెల్లివిరిసిన దన నక్షరనిరూపణ క్రియాధురీణం బై, ప్రజ్ఞానందకరంబగు సుజ్ఞానంబు తెఱంగునం జెలంగి యిల్లటపుటల్లుండై యెల్లప్పుడు రమావల్లభుండు దనలో నుల్లసిల్ల నతని సర్వవ్యాపకత్వంబు సత్త్వసమగ్రంబగుటఁ దానును వహించి పాలవెల్లి ప్రపంచంబునం దెల్ల వ్యాపించెనో యనఁ జకోరికానీకతృష్ణా తరంగంబుల కాకరంబై, కరంబు మెఱసి సితసరసీరుహముకుళంబుల వికలత్వంబు పరిహసించులీలన్ దొరసి మరాళకులాధ్యక్షవలక్షపక్షంబులకు వన్నియ పుట్టించి, గుహాకుహరంబులు వెడలి నిలువం దగుకోనలలోఁజెలువగుచలువఱాతిన్నియల నెలకొన్నతమవెనుకదిక్కుల కొదిఁగి, యేమఱించి కన్నులుమూసి పలుకకున్న నెచ్చెలులపేరులునొడివి, తముమెచ్చి చేమూఁతలు సడలించువారింబెఱమఱలిచూచి కెరలి నవ్వుచిలువ రాచపడుచులక్రే గన్నులతళుకులం దులకించి, కిలికించితవతు లగుయువతులం గలసి యలసిన కాముకులఘర్మకణజాలవిలాసంబుల నపహరించి హాలారసపానలీలామదలో లాత్మకత్వంబునం బరిత్యక్తచేలలై బయలుదేఱి, బహు వికారంబులం బొదలు శబరాభీరమ్లేచ్ఛాదిజాతులనెలఁ తలభ్రాంతిపరిధానధారణంబునకుఁ గారణం బగువైఖరి ధరించి, శరధితరంగ మాలికాడోలికాకేళికాలో లజల బాలికాపాలికల తనురుచులదండ నిండికొని పాండురడిండీరఖండంబుల మెండునన్ గండుమీఱి గండు మీలజరఠరవిశాల ధాళధళ్యప్రకాశంబులకు సంకాశం బగువిధం బావహించి, వేలావననవైలా లతామందిరాళిందంబుల నింపొందెడి గంధర్వమిథునంబు లొండొరులకు మొనపంటసగంబు గొఱికి యిచ్చు తెల్లనియాకుమడుపుల కనుంగువలెననంగి పెనంగి, సంక్రందనచందనగంధ్యలిక ఫలకంబునంగులుకు కర్పూర తిలకంబుతోఁదులఁదూఁగి వేఁడివేల్పువెలందిమిన్న వేనలి నలవరించుకొన్న సన్నజాజి విరులసరులసిరులంగడలుకొని, యంతకాంతః పురకాంతామణి సీమంత ముక్తామణీసంతతులకు వింతకాంతులు సతంరించి, పుణ్యజనాగ్రగణ్యలావణ్యవతీకరముకురదీధితి ప్రకరంబువలె సుకురంబగు తెఱంగుగైకొని రత్నాకరాధీశ్వరవధూభయపార్శ్వ ప్రద్యోతమానధవళ చామరద్యుతులకుఁ బెన్నుద్దిపద్దునం బెద్దయు రహించి, గంధవహ గంధసింధురగమనావతంసశ్రవణావతంసకైరవశ్రీలం గీలుకొని, ధననాయకనాయి కాంగుళీకలితవజ్రమణిముద్రికానుకారిత్వంబున డంబు మీఱి, కుమారజనకప్రియకామినీవక్షోరుహక్షౌమపటాంచితకంచుకచ్ఛాయల చాయల మెలంగి, యంగజభసితాంగరాగసంగతగంగాధరాంగరంగద్వి భావిభవంబుతో రవణంబు గని, శరవణస్ఫురణంబునం బొంపిరి వోవు కైలాసశైలంబుపై దండు విడిసిన దశముఖుని వీరభటుల చేతి విచ్చు కత్తులతళత్తళల హత్తుకొని, యతని వెలిగొడుగులపడగల బెడంగులను డుగని కడిమిందొడరి, ఘనసారవిభాసితంబుగా కుండియు ఘనసారవిభాసితంబై, తారకాభిఖ్యాభిరామంబుగాకుండియుఁదారకాభిఖ్యాభి రామంబై, చక్రరంజనకరంబు గాకుండియుఁ జక్రరంజనకరం బై, హంసప్రకాశ దూరంబు గా కుండియు, హంసప్రకాశదూరంబై, వదాన్యువదనంబువలె సుప్రసన్నతాసన్నంబై, కౌముదిగావున సకలపదార్థపరిజ్ఞానంబునకు నిదానంబయి యనూనం బయ్యెనయ్యెడ. | 163 |