ఇతిహాసములు ఉత్తరరామాయణము రంభారావణ సంవాదము
రంభారావణ సంవాదము
ఉ.ఎవ్వరిదానవే జలరుహేక్షణ! యెయ్యెది పేరు దెల్పవే
జవ్వని! యెవ్వనిం దలఁచి చయ్యనఁ బోయెదవే? మిటారి నీ
జవ్వనమున్‌ విలాసమును జక్కఁదనంబును నీటుఁ జూచినన్‌
బువ్విలుకానికైన బ్రమపుట్టుఁగదే భువనైక మోహినీ!
196
సీ.కురులు నున్నఁగ దువ్వి కొప్పుఁ బెట్టిన నీటుఁ - గనుగొన్న మోహాంధకార మొదవు
ఱవికలోఁ గులుకు తోరంపుగుబ్బల కుంకు - మపుఁ బూఁతఁ గనుగొన్న మలయు రక్తి
చెవిసంది హొయలుగాఁ జేర్చిన తొగరేకుఁ - దిలకింప నామోదములు జనించు
సొగసు కుచ్చెలముడి జోక శోభిలు నాభిఁ - జూచిన మరువడి సుళ్ళు వొడముఁ
 
గీ.గప్పురపురేఖఁదగు నెమ్మొగంబు చందు
రహి విలోకింప మది చందురా గరంగు
నింత సింగారమూని యీ యింతిఁగూడి
యెందుఁబోయెద వీ వేళయందు బాల!
197
సీ.దినము ఫలాహారమునఁ దపింపఁగఁ గదా - చిలుకలు నీలాగు పలుకనేర్చె
దలిరుటాకులు తిని తపమూనఁగాఁ గదా - పైకంబు నీ పాటి పాడనేర్చె
నలరు తేనియలాని యడవినుండఁగఁ గదా - యళులు నీ చూపుల ట్లలర నేర్చె
జలము గ్రోలి తటాకముల వసింపఁగఁగదా - యంచ నీ నడల సోయగము నేర్చె
 
గీ.నెలఁత! యిటువంటి నీ మాట నీదు పాట
నీ సొలపుఁ జూపు నీ నడల్‌ నెమ్మి వినఁగఁ
గనఁగ దొరకునె సామాన్యకాముకులకు?
బలు తపంబులు గావించి బడలకున్న
198
ఉ.కొప్పొకచేతఁ బట్టి మదిఁ గోరిక లీరిక లెత్తఁ దేనియల్‌
చిప్పిలు మోవిఁగ్రోలి నునుఁజెక్కిలి నొక్కుచు గుబ్బలంటుచున్‌
గప్పురవీఁడె మిచ్చి తమకంబున నీవి వదల్చి యంత నీ
గొప్ప పిఱుందుపై నొలసి కూడిన మేటికి స్వర్గమేటికిన్‌
199
చం.పలుకులు వేయునేల? విను బాల! కనుంగొనినంతనుండియున్‌
జిలుక పటాణిరౌతు త్వరసేసె నిఁకం దమి నిల్పఁజాల నీ
మొలక మిటారితేట నగు ముద్దుమొగం బొకయింత యెత్తి తొం
గలి నునుఱెప్ప లార్చి కడకంటఁ గనుంగొని కౌఁగిలింపవే
200
ఉ.లోకములేలు వేల్పుదొరలున్‌ సురలున్‌ నరులున్‌ భయస్థులై
చేకొను మంచు నన్ను నుతి సేయుచు మ్రొక్కుదు రట్టివాఁడ నే
నీకు నిజంబుగా వలచి నేఁడిదె యంజలి చేసి మ్రొక్కెదన్‌
జేకొని మోవితేనె దయసేయఁగదే తగదే కలంపఁగాన్‌
201
మ.అనుమానింపకు నన్ను వంటి పురుషుం డాసించినన్‌ ద్రోసిరా
జని వేఱొక్కని డాయ నాయమటె? నాయందున్‌ విమర్శించి చూ
చిన గోరంత కొఱంతయుంగలదె? నీ చెల్వంబు సాఫల్యముం
గన నా ముచ్చట దీర్చవే? యని బలాత్కారంబు గావించినన్‌
202
కం.గడగడ వడఁకుచు నుడువులు
తడఁబడ సిగ్గడర నెడఁద దడదడ మనఁగా
జడుపుం జెమ్మట నొడలుం
దడియ దశాస్యుఁగని రంభ తడయక పలికెన్‌
203
ఉ.వేడుకకాండ్రకై తిరుగు వేశ్యల నాడిన జాడ నన్ను ని
ట్లాడఁగఁ బాడి యౌనె? దనుజాధిప! మామవు నీవు నాకు నేఁ
గోడల వావి దప్పుదురె కోవిదు లన్యులు మోహదృష్టిఁపై
నాడిన మాన్చునీవె కలియం దమకించెద వేమి సేయుదున్‌
204
చం.పొలుపగు బ్రహ్మవంశమునఁ బుట్టి శ్రుతుల్‌ పఠియించి, ఘోరని
ష్టలఁ దపముల్‌ ఘటించి బహుసత్క్రియ లూఁదిన మిమ్మువంటి పె
ద్దలె తగువావియున్‌ వరుసఁదప్పి చరించిన నమ్మచెన్‌ల్లగా!
ఖలు లిఁకఁ బాయ నేరుతురె కాపథముల్‌? దనుజేంద్ర! నావుడున్‌
205
కం.పక పక నగి దశకంఠుఁడు
సకి నా తనుజునకు నీవు సతివై కోడం
డ్రిక మెపుడు చేసితివి? నీ
మొకమే నే నెఱుఁగఁ దెల్పుము నిజం బనినన్‌
206
శా.అంభోజానన పల్కెఁ దావకసుతుండౌనేకదా! యంచితా
రంభుం డా నలకూబరుం డతఁడు భార్యంగా ననుం జేకొనెన్‌
రంభానామముదానఁ గోడలిని గానా నీకు? నీ పట్టితో
సంభోగించినయప్పుడే తెలియు మీ చందంబు దైత్యేశ్వరా!
207
ఉ.నీ కొమరుండు మెచ్చుటకె నేఁడిటువంటి మనోజ్ఞవేషముం
జేకొని పోయెదన్‌ విడువు శీఘ్రమె పోవలె వేచియుండు నా
రాక కతండు విక్రమధురంధరుఁ డించుక యల్గెనేని చీ
కాకువడున్‌ జగంబు లదిగాక తపోధనవంతుఁ డారయన్‌
208
కం.నన్నుఁగని కోడ లనుచును
గన్నులఁ గప్పుకొని ప్రియము గావింతురు మీ
యన్నయు వదినెయు నటువలె
మన్నింపఁగఁ దగదె? నీవు మామవు గావే
209
చం.కొమిరెలు నీకు లేరె? పది కోటులు వత్తురు కోరితేని యీ
తమకము మేరగాదు సుతు దారనుబట్టి దశాస్యుఁడెంత య
క్రమ మొనరించెఁజూడు మనరా సరివా? రపకీర్తి హేతువౌ
నిమిషసుఖంబుఁ గోరి జననిందలఁ బొందుదురే భవాదృశుల్‌?
210
మ.తగదయ్యా! దశకంఠ! వంశగుణ విద్యా శ్రీలఁ బోకార్చుచేఁ
త గదయ్యా యిది, తాల్మి నన్‌ విడిచి పెద్దల్‌ సన్నత్రోవన్‌ మెలం
గి గురుత్వంబు వహింపవయ్య యని యగ్గీర్వాణి ప్రార్థింపఁగా
నగుచున్‌ దైత్యుఁడు రంభవా? తెలిసెఁ గాంతా! నీ తొడల్‌ సూచినన్‌
211
సీ.పౌండరీక నిరూఢిఁ బరఁగువారికిఁగాక - కలికి! నీ కనుదోయిఁ గాంచఁదరమె?
హరిమేథకలనఁ బాయని ధన్యులకు గాకఁ - పడఁతి నీ లేఁగౌను బట్టఁదరమె?
తెలికైదువులఁ దారసిలు శూరులకుఁగాక - చెలి! నీ కటాక్షంబుఁ జెందఁదరమె?
ధర్మసంగతి మీఱి తగు వీరులకుఁగాక - చెలియ! నీ కనుబొమల్‌ తెలియఁదరమె?
 
గీ.రాజసూయక్రియాలీల రహివహించు
సుగుణులకుఁగాక నీ ముద్దు మొగము దొరయఁ
దరమె యితరుల? కతనుండు తఱిమె నన్నుఁ
దర మెఱిఁగి చన్నుఁగవఁజేర్చి తరుణిప్రోవు
212
చం.కులిశముచేతఁ గానిపని కోమలి నీ నునుసోగకల్కివాల్‌
తళుకు మిటారి చూపులెకదా! నెరవేర్చు? బలారి కొల్వులోఁ
గల వెలయాంండకెల్లను శిఖామణి వీవెకదా! మఖక్రియల్‌
సలిపెడివారి కంచితఫలంబు గదా! నినుఁ గూడియుండుటల్‌
213
చం.వెడవిలుకాఁడు నన్‌ బరిభవించె నిఁకన్‌ నిను మానఁజాల నె
క్కడి పెడవావు లెన్నెదవు కామిని! యెక్కడి నేను మామ, నె
క్కడి కొడు కేటి కోడలవు కంటిమె యచ్చరమచ్చెకంటి కె
క్కడ నొకరుండె భర్త యనఁగా? వినియుంటిమె? తక్కులేటికిన్‌
214
మ.అలివేణీ! పదిలోపలం బదునొకండై యుండెనో లేదొ జ
క్కుల రేరాయల పట్టి యంతటనె నీకున్‌ వాఁడు నిక్కంబుగాఁ
జెలువుండేకద? నీకు మామనగుదున్‌? జేజేలకున్‌ నీకునుం
గలవే వావులు? నన్ను మాత్రము వితా కారింతురే మాటలన్‌
215
సీ.జనకుండు సుతుఁడును జన్నంబు సేసిన - వనిత! వారేమి కావలయు నీకు?
నన్నదమ్ములు సోమయాజులై వెలసిన - వనిత! వారేమి కావలయు నీకు?
బావయు మఱఁదియు బవరానఁగూలిన - వనిత! వారేమి కావలయు నీకు?
నల్లుండు మామయు ననిఁద్రెళ్ళి వచ్చిన - వనిత! వారేమి కావలయు నీకు?
 
గీ.వావి వరుసలు గణియింప వచ్చితేని
వనిత మాతోడ మాటాడవశమె నీకు?
చాలు నిఁకనేల? రమ్మని కేలువట్టి
బాలఁ గొనిపోయి చెంగల్వ పాన్పుఁ జేర్చి
216
సీ.తమకించి యొడినుంచి తమ్మిఁబోలిన మోము - జిగిదక్క మోమున చేర్చి చేర్చి
యెలతూండ్ల నగు బాహువులు గుంద బెడిదంబు - లగు సందిళులసంది నదిమి యదిమి
లవళీదళములట్ల సవరైన చెక్కులు - వాడువాఱఁగ ముద్దులాడియాడి
చిగురుఁ గేరెడిమోవి నొగిలించి పలుగెంపు - లడరఁజేయుచుఁ దేనె లానియాని
 
గీ.కుసుమమంజరు లన మించు గుబ్బచన్ను
లగడుపడ బిట్టు కరముల నలమి యలమి
నీవి సడలించి బడలించి నెలఁత నపుడు
కఠినరతుల నలంచె రాక్షసవిభుండు
217
మ.అకృతాశ్లేష మవీక్షితానన మయుక్తాలాప మవ్యంజిత
భ్రుకుటీకప్రణయం బకల్పిత సకృత్పుంభావ మవ్యక్త బం
ధకళామర్మ మలబ్ధకూజిత మసందష్టాధరం బయ్యు దై
త్యకులేంద్రున్‌ గరఁగించె దాని రత మాహా! వాని మేలెట్టిదో?
218
మ.కటిచక్రంబు చలించె హారగతముక్తా తారకల్‌ రాలె నం
తట మోమన్‌ తొగఱేనిఁ గుంతల విభాధ్వాంతంబు వ్యాపించె ను
త్కట వక్షోజగిరుల్‌ వడంకె, నవలగ్న వ్యోమమున్‌ మేఖలా
ర్భటి మ్రోసెన్‌ దనుజుండు బల్మిమెయి రంభం బట్టి భోగింపఁగన్‌
219
సీ.రాజహంస విహారరమణీయతార్హమౌ - కొలని లులాయంబు కలఁచినటులు
సింధునాయకు పొందు సేయఁ బోయెడితరం - గిణి మదేభము గలఁగించినటులు
పున్నాగ సంశ్లేషమున కెక్కు నెలతీఁగెఁ - జెనకి గాడ్పు చలింపఁ జేసినటులు
వలరాజుచే మించు వహిఁగాంచి తులకించు - నల యంచఁ గిటి నొంచి యలఁచినటులు
 
గీ.ధనవిభునిపట్టిఁ గనునట్టి తలఁపు వుట్టి
యేఁగురంభను బలిమిమై నిటులఁ బట్టి
బెట్టిదపుఁగేళి నలమటఁబెట్టి విడిచి
పెట్టె దశకంఠుఁ డా మేలు కట్టి పెట్టి
220
వ.ఇక్కైవడి నమ్మొక్కలివగ రక్కసిచుక్కలరాజుచేత నొక్కవడువున విడువంబడి, వెంబడింబడి నిబ్బరంబుగాఁ దఱుము గబ్బిబెబ్బులి వాతికిం జిక్కియుంజిక్కక మగిడిన హరిణికరణి, రాహుముఖగహ్వరంబునం బడి బయలుదేఱిన చంద్రకళ చందంబున, నుద్దండగృధ్రతుండాగ్రనిహతిఁ దప్పి వెలువడు చిలువచెలువ చెలువునఁ, జెదరిన ముంగురులతో, బెదరిన బెళుకుఁజూపులతోఁ బ్రిదిలిన నీవీబంధంబుతో, వదలిన కేశపాశంబుతోఁ బగిలిన బింబాధరంబుతో, నొగిలిన చెక్కుటద్దంబులతోఁ, గరఁగిన కపురంపుఁ దిలకంబుతో, బెరగిన తారహారంబులతో, బడలిన నెమ్మొగంబుతో, వెడలిన యశ్రుజలధారలతో, సొలసినకన్నుదామరలతో, వలసిన కోమలాంగంబులతో, వాడిన విరులసరులతో, వీడిన భూషణంబులతో, నసియాడు చిన్ని యడుగులతో, నసివాడు నెన్నడుముతో, నలఁగిన గబ్బిగుబ్బలతోఁ, గలఁగిన నెమ్మనంబుతో, గాసివడిన జఘనంబుతో, వాసిచెడిన తనుకాంతితోఁ, వ్రీలిన కంచుకంబుతో, రాలిన చేర్చుక్క ముత్యములతోఁ, బొలుపులేని యంగరాగంబుతోఁ దలఁపరాని దీనభావంబుతోఁ గసుగందిన బాహులతలతో, వెసఁ గుందిన పెందొడలతో, నెడలేని గోటి చెనకులతోఁ, గడలేని చింతాభరంబుతో, నాకారంబుఁ దాల్చిన శోకరసాథిదేవతవలె, నద్దైవత యువతీమణి త్రోవ కెదురువచ్చి యూఱడించి, మచ్చికమాటలాడు నెచ్చెలి కైదండఁగొని, యలయుచు సొలయుచు, నిట్టూర్పు నిగిడించుచుం జని చని.221
మ.అలకాపట్టణరాజమధ్యమున నీటౌ నీలపుం గోటలో
పలి బంగారు హజారమున్‌ గడచి నున్‌ బ్రాఁగెంపు ఱామేడలో
నలుకన్‌ గీల్జడగొట్టు కేళినికి జోహారిడ్డ కెందమ్మి బొం
దళపున్‌ రౌతును వ్రాసినట్టి పడుకింటన్‌ మించు పూఁబాన్పునన్‌
222
సీ.హెచ్చువాసన వక్కలిచ్చి చుట్టినయాకు - మడుపు లీఁదివిరెడు నడపదాని
వినికివేళ యిదంచు వీణె మెచ్చుగ మేళ - వించితెచ్చిన గానవిద్యదానిఁ
బొలివోని నేర్పుతో బూవుటెత్తులు గట్టి - వేడ్కఁ గానుకలిచ్చు విరులదానిఁ
బరిహాసకులు నటుల్‌ బయకాండ్రు మొగసాలఁ - గాచినారని తెల్పు కటికదానిఁ
 
గీ.నించుకయుఁ దేఱిచూడక నెందు మీఁది
హాళియును లేక యింత ప్రొద్దాయె రంభ
రాకయున్న దదేమి కారణమొ? యనుచుఁ
దలఁచు నలకూబరునిఁజేరి తలిరుఁబోఁడి
223
కం.అడలుచుఁ గాటుకకన్నీ
రుడుగక జడివట్టి కురియ నొడలు గడగడన్‌
వడకఁగ నిట్టూరుపు సెగ
లడరఁగ దీనగతి నతని యడుగుల వ్రాలెన్‌
224
వ.ఇవ్విధంబున225
చం.అడుగుల వ్రాలి యేడ్చు జవరాలి విరాళియు వింత తత్తఱం
బడరఁగ లేవనెత్తి యొడియందిడి చేలకొనం గనుంగవన్‌
జడిగొను నశ్రువుల్‌ దుడిచి జాఱెడిక్రొమ్ముడి చక్కఁబెట్టి యా
బిడ మొగ మట్టె కన్గొని కుబేరుని కూరిమిపట్టి యిట్లనున్‌
226
సీ.కవజక్కవల టెక్కుఁ గాంచు నీ చనుదోయి - కలికి! యే కఠినుండు గాసి పఱిచె?
కొదమతుమ్మెదలట్లు పొదలు నీ నెఱికురుల్‌ - చెలియ! యే మలినుండు చిక్కువఱిచె?
వెలలేని కళలతో వెలయు నీ నెమ్మోము - వనిత! యే వికలుండు వాడుపఱిచె?
అంటినఁగందు పూవంటి నీ నునుమేను - మగువ! యే దుర్జాతి యగడుపఱిచె?
 
గీ.నెలఁత యే చలచిత్తుండు నీ పిసాళి
కలికి వాల్గన్నులను నీరుఁ గ్రమ్మఁజేసె?
తరుణి! వివరింపు మే నీచతముఁడు మీఁది
చే టెఱుంగక నిన్నింతఁ జేసెననిన
227
ఉ.కోమలి వంత నుస్సురని కుందుచు మేను సెమర్పఁగేలుకెం
దామరదోయి మోడ్చి ధననాయకనందనుఁ జూచి పల్కె నో
స్వామి! నినుం గనుంగొనెడి వాంఛ దివంబున నుండి యీ వయ
స్యామణితోడఁగూడుకొని చయ్యన నేనిట కేఁగుదేరఁగన్‌
228
మ.ననుఁ ద్రోవం దిలకించి పంక్తిముఖుఁ డన్యాయ్యంబునం గేలు ప
ట్టినచోఁ బట్టి రమించినట్టి తెలిగంటిన్‌ బట్టి భోగింప వ
చ్చునె? మామా! తగదంచుఁ గోడల నటంచున్‌ జాలఁ బ్రార్థించినన్‌
వినఁ డద్దుష్టుఁడు బల్మిఁబట్టి చెఱిచెన్‌ వేమాట లింకేటికిన్‌?
229
చం.తగవును ధర్మ మూఁకొనని దైత్యునికిన్‌ బలు కాన దిక్కులే
కగపడి గాసిఁబొందుమని యంబుజగర్భుఁడు వ్రాసి యుండఁగా
వగ లిఁకనేల? యైన బలవంతుఁ డొకండిటు చేసెనంచు నీ
మొగమునఁ దెల్పి నీ హృదయమున్‌ నొగిలించుట కార్తిఁ జెందెదన్‌
230
చం.అగముల వ్రక్కలించు కులిశాయుధునంతటి వాని వీటిపై
జగడము సేయఁబోవు నెఱ సాహసి పట్టిన నాఁడుదాన నే
వగ విడిపించుకోఁగల? నవారణ మానము పోకముందరన్‌
దెగువకుఁ జొత్తు నన్నఁ గువిధిన్‌ విధి చేసె నమర్త్యకాంతఁగాన్‌
231
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju