| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | నలకూబరుఁడు క్రుద్ధుఁడై రావణుని శపించుట |
| కం. | నలకూబరు బిగికౌఁగిట నలరుచు సుఖియించురంభయఁటె! యిరువది చే తుల రక్కసి బలుసందిటఁ గళవళ మందునఁటె! దైవగతి నే మందున్? | 232 |
| మ. | అనుమాటల్ విని, గుండె దిగ్గుమనఁగా నాస్యంబు కెందమ్మితో నెనఁగాఁ గన్నుల మంట లంటికొనఁగా నీర్ష్యాభిమానంబులన్ బెనుఁగాయంబుల నాత్మ నొప్పి కొనఁగాఁ బేరల్క శాంతిక్షమల్ సనఁగా నన్నలకూబరుండు దనుజున్ శాపింప నుద్యుక్తుఁడై | 233 |
| మ. | తనలో నొక్క ముహూర్త మయ్యసురకృత్యం బెల్లఁ జింతించి, వీ ని నిరోధించుట మంచి కార్యమనుచున్ నిష్కర్షఁ గావించి, ది గ్గనఁ బూఁబానుపుడిగ్గి దోయిటను గంగాతోయముల్ బూని బు ద్ధి నిరూఢస్థితి మించి రావణుని నుద్దేశించి సక్రోధుఁడై | 234 |
| ఉ. | ఈ దనుజుండు కోరిక వహింపని రంభను బల్మిఁ బట్టిన ట్టాదట నింక నొప్పని మృగాక్షుల బల్మిని బట్టెనేని స మ్మోదము దీఱ, నంత శిరముల్ పదియుం బదినూఱు వ్రక్కలై మేదినిఁ గూలుఁగావుత నిమేషములో భువనంబు మెచ్చఁగన్ | 235 |
| మ. | అని శాపోదకముల్ విసర్జనము సేయన్, దేవతల్ మెచ్చి బో రన వర్షించిరి పుష్పవర్షము లవార్యస్ఫారధారాధర స్వనగంభీర మృదంగఘోషముల దిక్చక్రంబు భేదిల్లె నం దునఁ గౌబేరి నుతించుచున్ సతులు సంతోషించి రెంతేనియున్ | 236 |
| కం. | ఆపౌలస్త్యకుమారుని శాపము విని పంక్తిముఖుఁడు సంతాపించెన్ బ్రాపించె నాఁటనుండియుఁ గోపనల మనోంబుజానుకూలత్వంబున్ | 237 |
| వ. | తత్సమయంబున | 238 |
| శా. | అన్నాళీకభవప్రదత్త వరమాహాత్మ్యంబునం గ్రూరుఁడై యెన్నం డెవ్వరి రావణుం డతనినేదుష్టేచ్ఛల్ నివారించె నేఁ డన్నన్నా! నలకూబరుండె ప్రబలుం డంచున్ సుధాంధుల్ నుతుల్ పన్నన్ సాగిరి కారలం బడిన బాలల్ వొంది రానందమున్ | 239 |
| కం. | అల ప్రియురాలికి నిటువలె నలకూబరుఁడుత్సవం బొనర్చి, తదీయా విలభావ మడఁచి యిచ్చకు వలసినటుల మెలఁగె రామవసుధాధీశా! | 240 |