ఇతిహాసములు ఉత్తరరామాయణము ప్రాతఃకాల వర్ణనము
ప్రాతఃకాల వర్ణనము
వ.అని వల్కి యగస్త్య మహామునిచంద్రుండు వెండియు రామచంద్రున కిట్లనియె241
సీ.పౌండరీక సమృద్ధిఁ బాపఁగా శశికీర్తి - మలఁగె నా వెన్నెలల్‌ కలఁకఁబాఱెఁ
బతివివర్ణత స్రుక్కు సతుల కన్నుల పోల్కి - రాజు చెన్నఱఁ జకోరములు బడలెఁ
బద్మినుల్‌ వెతఁ జెందఁ బరిహసించిన దోష - మున నాఁగఁ గుముదినుల్‌ మురువుఁదొఱఁగెఁ
బాంథ సంహారపాపమున మూర్ఛిలె మారుఁ - డన రతికుచముల నలసి తూఁగె
 
గీ.నిదుర లుడిగి పునారతి కెదల వ్రాలు
వాలుగంటుల యాణిముత్యాల సరుల
శైత్యమున నుల్కిపడి రభసమున లేచు
తత్పతుల నవ్వె దీపికల్‌ ధవళరుచుల
242
ఉ.కంతురణాంతతాంత విటఘర్మకణాపనయ ప్రవీణ సౌ
ధాంతర భామినీ వ్యజనతాంచితవృత్తకుచోత్తరీయ చే
లాంతమృగీమదాగురు సితాభ్రపటీర విశేషవాసనా
క్రాంతములై దిగంతములఁ గ్రమ్మె నిశాంతమరుత్కిశోరముల్‌
243
కం.మునుకొని వేఁకువ దఱుగరి
దినమణిఁ గొనఁదివురు పూర్వదిశకుం గనఁ జూ
పిన ముంగరముత్తెమువలెఁ
గనఁబడియెన్‌ వేఁగుజుక్క కలధౌతరుచిన్‌
244
ఉ.కాయజు బారి కోడి మును గౌతమికై తమకోడి జాతివాఁ
డాయె సురేంద్రుఁ డట్టిదొర నాఁగి జయింప దశాస్యుఁడీ యెడం
బోయెడు నిత్తెఱంగు వినుప్రోలికిఁ దెల్పుద మంచు బెట్టుగాఁ
గూయిడుచున్నవో యనఁగఁ గుక్కుటముల్‌ రొదసేసె దిక్కులన్‌
245
కం.తమి విధుఁ గలిసిన యంబర
రమ పులకాంకుర పరంపరలు దోడ్తోఁద
త్సమయశిశిరానిలునిచే
సమసెనొయనఁ దారకావ్రజంబు లడంగెన్‌
246
కం.చెలిమికి నినుండు బలుకర
ములతోఁ జనుదేర మిన్నుముట్టిన యుదయా
చలపతికి వేళ వీచిన
తెలి వీచోపు జిగిఁ దూర్పు తెల తెల నయ్యెన్‌
247
తే.గీ.ఎందు ద్విజరాజు నా మించు చందమామ
మనల నిద్రాంధకారాబ్ధి మునుఁగఁజేసె
మేలుకొలిపె నినుండెంత మిత్త్రుఁడనెడి
భాతిఁ బులుఁగులు కలకల పలికె దిశల
248
చం.లలితమరందకాంక్ష ముకుళంబులఁ జిక్కిన కైతవంబునం
బిలుకల నాండ్రనున్‌ విడిచిపెట్టి నిశం బ్రతిపక్షబంధు లౌ
కలువలకొద్దికై యవియుఁ గందినఁ గ్రమ్మఱఁ జేరుతేఁటులన్‌
గలకల నవ్వెఁ బద్మినులు, కమ్రతరాచ్ఛవిభాచ్ఛలంబునన్‌
249
మ.గిరిభృద్వక్షముఁబాసి తావి కిరవౌ కెందమ్మిపూమించు టు
ప్పరిగన్‌ శ్రీ వెలయన్‌ సరోవరసభా భాగంబునన్‌ మించె బం
భరభామామృదుగానముల్‌ కవివర ప్రత్యగ్ర పద్యార్భటుల్‌
తరళోత్తుంగ తరంగరంగ విలసత్కాదంబినీలాస్యముల్‌
250
చం.అలయక యెల్లెడన్‌ మెలఁగి యందొకచో నితరేతరాననం
బులు దిలకించి యొండొకటి మూర్కొనుచుం దమిఁజేరి చంచువుల్‌
గళముల నుంచి నిల్చి యెఱకల్‌ తనువుల్‌ గదియించి చొక్కుచూ
డ్కులు నిగుడన్‌ బయోరుహకుడుంగములన్‌ విహరించె జక్కవల్‌
251
శా.ఆందోళింపఁగఁ జేసె ముందు రజతాహార్యంబు లంకేశ్వరుం
డెందుం దుర్జయుఁ డింద్రు వీ డొరయుచో నేమెంచునో? వాఁడు సొం
పొందం గానుక నిత్తునంచుఁ దొలిగ ట్టుత్కంఠతో నెత్తు మేల్‌
చందా కెంపు తెఱంగునన్‌ దనరె భాస్వద్బింబముం దూర్పునన్‌
252
శా.పగ్గంపుంబలు చిల్వరా పడగనున్‌ బ్రాగెంపుఱాచాయలన్‌
డిగ్గం ద్రావి నవారుణాబ్జగృహవాటీభాగ్రమాసంచలత్‌
దృగ్గాఢస్తనకుంకుమద్యుతులతో రెట్టించి భాసిల్లె ద
త్ప్రాగ్గిర్యాతత ధాతురాగరుచులన్‌ బాలార్కశోణాంశువుల్‌
253
ఉ.అంతకుమున్నె రావణనిశాటకులేంద్రుఁడు వీతనిద్రుఁడై
యంతికవాహినిన్‌ వలయు నాహ్నికకృత్యము లాచరించి దు
ర్దాంతరణోత్సవంబునఁ బ్రధాన సహోదరపుత్త్రమిత్త్ర సా
మంత సుహృద్భటోత్తముల మన్ననఁ దోడ్కొని సేనలుబ్బఁగన్‌
254
స్రగ్ధరకదలెన్‌ గంఖాణ రింఖాగ్ర నిహతరజత గ్రావపాదాళి నుగ్గై
చెదరన్‌ హస్తీంద్ర హస్తాంచితవమథుల జేజేల పెంద్రోవ లెల్లన్‌
జొదు గొందన్‌ స్యందనప్రస్ఫురితగతులచే క్షోణి వ్రీలం బతాకల్‌
గదియన్‌ వ్యాపించుబల్‌ చీఁకటుల రవిరథక్షత్త యంధత్వమూనన్‌
255
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju