| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుండు అమరావతీ పట్టణమును ముట్టడించుట |
| చం. | కదలి, దశాననుండు లయకాలఘనాఘనగర్జితభ్రమ ప్రదభట సింహగర్జన లపారగుహాకుహరంబు లానినన్ బదులుగ మ్రోయువేల్పు మల పజ్జకుఁబోయెఁ దదీయ పాదముల్ చిదురుపలై ధరంగలయఁ జేయుచు సేనలు గొల్వనుద్ధతిన్ | 256 |
| ఆ.వె. | పోయి తత్సమీపముననుఁగానఁగ వచ్చు వేల్పు పురము సూచి విస్మయపడి చేరి యుపవనముల సేనలు విడియించి యల ప్రహస్తుఁ గని దశాస్యుఁ డనియె | 257 |
| మ. | కనుఁగొంటే యమరావతీపురము! గంగాఖేయతోయావగా హనసక్తామరరాజితామరసపత్త్రాక్షీ విహారోత్‌క్షిప త్కనదంభఃకణ మాలికాతులిత ముక్తారత్నశిల్ప ప్రక ల్పన భాగ్యప్రవిభావలక్షిత నభోభాగంబు భాసిల్లెడిన్ | 258 |
| సీ. | ఈ పట్టణలలామమే కదా! శతమన్యు - రాజసం బొందించు రాజధాని యీ నగరీరత్న మేకదా! బహుపుణ్య - ములు సేయు ప్రజచేరు పుణ్యలోక మీ పుటభేదనం బేకదా! యెల్ల సౌ - ఖ్యములిచ్చు ననుఖ్యాతిఁగన్న పదవి యీ పురగ్రామణియేకదా! రణరంగ - హతులు ప్రాపించు ప్రాప్యస్థలంబు! | |
| గీ. | కల్పవృక్షము లున్న శృంగారవనము లీ నివాసంబుననె కదా! యెసక మెసఁగుఁ గామగవిఁ గట్ట నిదికదా గాడిపట్టు! దీని వర్ణింపఁ బరమేష్టికైనఁ దరమె? | 259 |
| సీ. | ఏ చాయఁగన్న రేరాచఱావాకిళ్ళఁ - గొమరు మీరిన దివ్య గోపురములె! యే వీథిఁగనుఁగొన్న హీరవారప్రభా - సాధారణోత్సేధ సౌధమణులె! యే తోట లరసినఁ గేతకీపున్నాగ - సుమనోమనోహర సురభిళములె! యే యిండ్లు సూచిన హేమతార చిరత్న - రత్న సంపన్నతారాజితములె! | |
| గీ. | యెందుఁ జూచినఁ బలుకోర్కు లిచ్చుతరులె! యేడఁ జూచిన వేడుక లిడుకొలఁకులె! యెచటఁ జూచినఁ బ్రతిలేని కృతకగిరులె! యిటులుగాకున్నఁ బ్రఖ్యాతి యెటులు గాంచు? | 260 |
| మ. | పరిఖాకార సురాపగాలహరికాపాండుద్యుతుల్ వజ్రభా స్వర వప్రాచ్ఛతరప్రభల్ విధుశిలా సౌధాంశుయూధంబు లి ప్పురిపైఁ గప్పినఁ జూడ నొప్పెఁ ద్రిజగత్పూర్వైభవంబుం జయిం ప రహిం బైకొను కీర్తి వైఖరిఁ బ్రహస్తా! చూచితే నావుడున్ | 261 |
| చం. | అది విని మంత్రి యిట్లను సురారికులేశ్వర! కీర్తిగాదుగా యిది భవదీయవిక్రమసమృద్ధి నిజేశ్వరు నేమి సేయునో? త్రిదశులకేమి చేటొ?యని దీనత వెల్వెల నౌపురీందిరా సుదతి వివర్ణభావ మనుచున్ గననయ్యెడు నాదు చూడ్కికిన్ | 262 |
| మ. | అసురాధీశ! భవత్ప్రతాపశిఖిపై వ్యాపించెనాఁ బద్మరా గసముజ్జృంభిత గోపురప్రభ లుదగ్రం బయ్యెఁ దద్ధూమజా ల సమగ్రశ్రీల విశాలనీలవలభుల్ గాన్పించెఁ దజ్జ్వాల ల ట్లెసఁగెన్ ద్వారకవాట విద్రుమరుచు ల్వీక్షింపు మీ ప్రోలునన్ | 263 |
| మ. | తను రోధింపగ నేఁగుదెంచిన మిమున్ దర్శించి ఖేదంబుఁ జెం దిన స్వర్లక్ష్మి దృగశ్రుతోయకణపంక్తిం బోలి కేళీసరః కనదాభీల మరాళపక్షయుగరుక్చంద్రాతపశ్రీద్రవ ద్ఘన చంద్రాశ్మ సువేశ్మజాలకగళ ద్వాఃపూరమొప్పారెడిన్ | 264 |
| ఉ. | ఈ వఱ కిప్పురిన్ దివిజులేలఁగఁ జూచినయట్టితప్పు చాల్ దేవర! నన్నుఁబంపు మవలీలఁ ద్రివిష్టప మాక్రమించి యై రావణదంతితోడ సురరాజును బల్విడిఁ బట్టి తెచ్చెదన్ నా విని రావణుండు చిఱునవ్వున నాతనిఁ జూచియిట్లనున్ | 265 |
| ఉ. | అంతటివాఁడ వౌదువెకదా! యయినన్ మధుమేఘనాదదే వాంతకకుంభకర్ణుల నరాంతకముఖ్యులఁగూడిలప్పురం బంతయు నాక్రమించి చతురధ్వము లానుక నిల్వుఁ డంత జం భాంతకుఁ డేమిసేయునొ? యటన్న హసాదని యా ప్రహస్తుఁడున్ | 266 |
| సీ. | కుంభనికుంభముఖ్యులతోడ నల కుంభ - కర్ణుండు దూరుపు గవనియందు మాల్యవంతుండు సుమాలియున్ బలయుక్తిఁ - దగ మేఘనాదుఁ డుత్తరమునందుఁ ధూమ్రాక్షరుధిరాక్షదుర్ముఖాదులఁగూడి - మధు నిశాటుఁడు పశ్చిమంబునందు మారీచముఖులతో నా రావణాసురా - గ్రణిఁ గొల్చి తాను దక్షిణమునందు | |
| గీ. | నిలుచునట్లుగ నియమించి నిఖిలబలము పంచి, యందందు విడియఁగఁ బంచి నాల్గు గడల నాల్గు సముద్రముల్ గ్రమ్మినటులు చెలఁగి పటువాద్యముల్ మ్రోయఁజేయుటయును | 267 |
| వ. | అప్పుడు | 268 |
| మాలిని | మురజపటహఢక్కాముఖ్య వాద్యస్వనంబుల్ వరదితిసుతసేనాపాళిఁ బల్మాఱు మించెన్ సురలు చెవుల సోఁకన్ స్రుక్కి భీతిల్లి రా స్వః పురి నలుదిశలందుం బుట్టె నుత్పాతకోటుల్ | 269 |
| సీ. | నిండిన గేహముల్ నిండినయట్లన యుంచి - బలు విమానము లెక్కి పఱచువారు, దన సువస్తువులతోఁ దమవారిఁగొని భీతి - నెగిరి, మహర్లోక మెక్కువారు నొకరితో నొకరు దెల్పక యథాతథలయి, - యేడకేడకొఁ బరువెత్తువారు నెందుఁబోఁ గాళ్ళాడ కిండ్లలో మూలమూ - లలఁజొచ్చి వడఁకుతో నలయువారు | |
| గీ. | నెచటఁజొచ్చినఁ బోనిత్తురే? నిశాటు లిదిగొ లగ్గలు వట్టి రిం కేటిస్వర్గ మనుచు స్వర్లోకమున సారె కఱచువారు నగుచు నడలొంది రమరాలయంబువారు | 270 |
| సీ. | రణశూరులకు నప్సరః స్త్రీలతోఁగూడి - వీథి సరాళంబు వెడలఁబాసె సోమయాజులకు రంభామేనకలఁ గూడి - శృంగారవనము వీక్షింపఁ బాసెఁ బరమధార్మికులకుఁ బసిఁడి మేడలనుండి - వెలఁదుల గానముల్ వినఁగఁబాసె సకల దివ్యోపపాదకులకు సఖులతో - నల దేవనది నీఁదులాడఁ బాసె | |
| గీ. | నున్న సురలకు నిండ్లలో నుండియైన సొంది నటునిక్కి తలలెత్తి చూడఁబాసె నల బలంబులతోఁగూడి యలబలంబు లమరపురిఁ జుట్టుకొనునట్టి యవసరమున | 271 |
| చం. | తలఁకునఁ గోటనల్గడలఁ దల్పులు వేల్పులు మూసి డాసి కొ త్తళములపై నలంగములఁ దార్కొని మార్కొని విక్రమింపఁగాఁ గలరణశూరు లైన యవికారుల వీరుల హెచ్చరించి పై బలములరాకఁ దెల్ప సురపాలకుపాలికిఁ బోయి యయ్యెడన్ | 272 |
| సీ. | శచి ముద్దుమోముఁజూచుచు నాగకన్యాన - వీనగానము విను వింతహొయలు వేల్పుల మనవులు వినుచు నచ్చరమచ్చె - కంటుల నటనంబుఁ గాంచు మురువు ధనదాదిహితమంత్రి జనులతోఁ బలుకుచు - మునుల వాదులకు నవ్వెనయు హరువు మ్రొక్కువారలకుఁగేల్ మోడ్చుచు గురుఁడాన - తిచ్చు యుక్తు లెఱుంగు హెచ్చరికయుఁ | |
| గీ. | దనకుఁజెల్లు ననంగ సంతసమెసంగ వైజయంతంబుపైఁ గొలువై జయంత ముఖులు బర్హిర్ముఖులు చంద్రముఖులు గొల్వ నిండుకొలువున్న దేవతానేతఁ గనిరి | 273 |
| మ. | కని జోహారిడ కోట నల్గవనులం గాపున్నవా రేఁగుదెం చినవారిం దవధారు దేవ! యనుచున్ జేమోడ్పుతోఁ గంచుకుల్ వినిపింపన్, దొలునాఁడె వేగరులచే విన్నటి వృత్తాంతమున్ దనలోఁదోఁచి బలారి మీర లిటకువ్రాఁగార్యమేమీ? యనన్ | 274 |
| ఉ. | వారు వినీతులై యనిరి స్వామి! దశాస్యుఁడు కుంభకర్ణదే వారియు మేఘనాదుఁడు ప్రహస్తమధుప్రముఖుల్ మహాచమూ వారము గొల్వవచ్చి యిదె స్వర్గము నల్గడ లావరించియు న్నారని విన్నవింప సురనాథుఁడు రోషకషాయితాక్షుఁడై | 275 |
| శా. | ఔరా! రావణుఁ డబ్జగర్భవరగర్వాయత్తుఁడై నా పురిం గారింపం జనుదెంచెనే? తన భుజాగర్వంబు నా చెంతనా? వారిన్ వీరిఁ దలంచినట్లనె ననున్ వాఁడెంచెఁ గాబోలు? గా నీ రక్షోబలవార్ధి నస్త్రబడబాగ్నిన్ నేఁడె యింకించెదన్ | 276 |
| వ. | అని పలికి, కొలువుఁ గలయం గనుంగొని | 277 |
| సీ. | కోటవాకిళ్ళు బల్ కొత్తళంబు లలంగ - ములు నేమఱక కాచి మోహరింప దారుశిలాయంత్రతతి కొమ్మ కొమ్మలఁ - దోరంబుగా నించి దురుసుసేయఁ దలబొమిడికము కత్తళము కేడెము కత్తి - యాదిగాఁగలవి ముస్తీదొనర్ప నరదముల్ ద్విరదంబు లర్వముల్ మొదలైన - సకలవాహనముల సంఘటింపఁ | |
| గీ. | దగినవారిని యోగించి తన సమీప మున వసించు పులోమజాముఖ్య సతుల మఱియుఁ జనువారిఁ బ్రచ్ఛన్న మార్గమునను స్వర్ణగిరి శృంగమున కంపి శతమఖుండు | 278 |
| ఉ. | కామగవీ సుధాకలశకల్పక దివ్యమణీ విభూషణ స్తోమము మాటు చేసి తనతోడిదె లోకముగాఁ జరించు సి ద్ధామర సాధ్య రుద్ర తుషితానిలభాస్వరముఖ్య దేవతా గ్రామణులన్ రణోత్సుకులుగా సెలవిచ్చి యొకండుఁ జెచ్చెరన్ | 279 |
| కమల విలసితము | వనజనయనుఁ గరివరదుని జేరం జని ముకుళితకరజలజయుగుండై తనువునఁ బులకలు తఱచుగ మించన్ వినయమునను సురవిభుఁడిటులెంచెన్ | 280 |
| కవిరాజవిరాజితము | జలజదళేక్షణ! శాత్రవశిక్షణ! శౌర్యవిచక్షణ! చక్రధరా! కలిత రవిగ్రహ! కాంతిసువిగ్రహ! కల్మషనిగ్రహ! కంబుకరా! విలసితకేతన! విశ్వ నికేతన! విస్మితచేతన! వేషయుతా! సలిలభవాసన! సమ్యగుపాసన! శార్‌ఙ్గశరాసన! సాధునుతా! | 281 |
| మ. | అవధారయ్య! దశాననుండు సబలుండై నేఁడు నా పట్టణం బవరోధించినవాఁడు తమ్ముఁడును దోడైనాఁడు తత్పుత్త్రకుం డు వృషాంక ప్రియహోమనిష్ఠల బలిష్ఠుండై విజృంభించినాఁ డు విశేషించి మధుండు బంధుఁడయి వాఁడుం గూడినాఁడియ్యెడన్ | 282 |
| ఉ. | ఇందుల కేమి బుద్ధి గణియించెదొ? వైరుల నె ట్లడంచెదో? ముందును వెన్కతోఁచక యమోఘదయానిది వంచుఁజేరితిన్ ముందు బలాదిశత్రు జయమున్ భవదుక్తిన కాదె కల్గె? గో వింద! ముకుంద! నీవు కదవే గతి వేగతులం దలంచినన్ | 283 |
| ఉ. | ఆరయ సర్వభూతముల కాప్తుఁడు వయ్యును, మమ్ముఁగూర్చి దై త్యారి సమాఖ్యఁగాంచితి తదాఖ్య యదార్థము సేయు మో దయా నీరధి! పాలముంచినను నీళ్ళనుముంచిన నీదె పెంపు నీ వారము నీదుచిత్త మను వాసవుఁజూచి జనార్దనుం డనున్. | 284 |
| చం. | అమరవరేణ్య! యిట్టి సమయంబున రావణకుంభకర్ణులన్ సమరములోపలన్ గెలువ శక్యముగాదు తదీయ నందనుం డమిత పరాక్రమక్రమసమగ్రుఁడజయ్యుఁడు, మీఁదఁగొంతకా లమునకు మానుషాకృతిఁజెలంగి వధించెద వారినందఱిన్. | 285 |
| చం. | హరి యరుదెంచి యూరక దశాస్యునిఁ దాఁకి వధింపలేక క్ర మ్మరె ననునట్టి లాఘవము మాత్రమె నే నిపు డేఁగుదెంచినన్ హరిహయ! నీవెపోయి, పలలాదుల మార్కొని తోఁచినట్టులన్ దురమొనరింపు మిప్పటికిఁ దోడ్పడ మీఁద శుభం బొసంగెదన్. | 286 |
| శా. | దేవత్వంబున నుండియే యరిని మర్దింపంగ లే నంటివే నీ వే లాగు నరత్వమొంది పగవానింగెల్చె దంటేని రా జీవప్రోద్భవు మాట నిల్పుటకుఁగాఁ జేకొంటి శాంతం బిఁకన్ భావిప్రాంచితరామరూపమున నిప్పౌలస్త్యుఁనబోనిత్తునే. | 287 |