| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దేవదానవుల యుద్ధము |
| మ. | అని వీడ్కొల్పిన వజ్రి వచ్చి రణవాంఛాకల్పులన్ వేల్పులన్ గని హర్షించి జయానకార్భటుల ఢక్కాశంఖఘోషంబులన్ దనుజస్తోమము గుండె దిగ్గుమన రత్నప్రస్ఫురచ్చక్ర శం ఖనిజాశ్వధ్వజఘంటికా ఘణఘణోగ్రస్యందనారూఢుఁడై. | 288 |
| సీ. | ద్వాదశ ద్వాదశాత్మలతోడ వహిఁబదు - ముగ్గురు విశ్వులు ముందు నడువ నురలీల ముప్పదార్గురు తుషితులతోడ - నెనమండ్రు వసువులు నెనసి కొలువ మెఱయు నర్వది నలుగురు భాస్వరులతోడ - నలువది తొమ్మం డ్రనిలులు గొలువ రూఢి నేకాదశ రుద్రులతోఁ బదు - నిద్దఱు సాధ్యు లుద్వృత్తి నడువ | |
| గీ. | గరుడ గంధర్వచారణఖచర సిద్ధ యక్షకిన్నర కింపురుషాహిగుహ్య కాదితేయ మహారాజికాది దేవ సమితి నలుగడఁ గొలువ వాసవుఁడు వెడలె. | 289 |
| చం. | వెలువడి యెప్పుడెప్పు డరివీరులఁ దాఁకుదమంచు విచ్చుక త్తుల బెడఁగుం దళత్తళలతోఁ దనముందట వచ్చు దేవవీ రులకును జేయి వీచుటయు రోసముతోఁ జని దైత్యవీరులం దలపడి, రా సురాసురులు దార్కొని రుగ్రతరాగ్రహంబునన్. | 290 |
| వ. | అప్పుడు గొప్ప చప్పుడులు నుప్పతిల్ల బాహువు లప్పళించుచు, ధరారేణువు లుప్పరంబునం బొరయఁ గుప్పించుచు, దమ చేతిహేతుల నరాతుల నొప్పించుచుఁ దమదొర మెప్పించు వేల్పులును, రోషారుణితలోచనముల నిప్పు లురులఁ బరుల నిలు నిలుండని యెలుంగెత్తి నిలిపి యెదిరించియు ధిక్కరించి ఖడ్గాఖడ్గిం దలపడి యడిదంబులు పొడిపొడియై పుడమిం బడినఁ జిడిముడి వడి వడినడరుపడి మగుడం గచాకచిం బెనంగు రక్కసులును, ననుంగుఁజెలికాండ్రకు సహాయులై యీరసంబునం దారసంబైన పోరునం బేరువాఁడి మెఱసి మున్ను తమవారల నొప్పించిన పరవీరులం గడచి పోనీయక డయ్యం జేసి, కయ్యంపు టురువడిఁ గనఁబడఁజేయు దేవతలును, పంతంబు మెఱసి కుంతంబులం బడఁగ్రుమ్మిన నెమ్మేని నొప్పిదప్పు లెంచక, కరాంచితపట్టిసంబులఁ దత్ప్రతిపక్ష హస్తప్రసారికుంతంబు లానుకొని, యట్టె నట్టనడిమికిం దెగఁగొట్టి, కట్టలుక బిట్టెగసి జగజెట్టితనంబున నెదుటివారి యుదుటు మాన్చు దానవులును, గఱకఱిం బెరయ మెఱయ సురియ లురంబున గ్రుచ్చి వీఁపున నుచ్చిపాఱునంతలో మరలమరలం దివియువారల లా వెఱింగి యౌడుగఱిచి సురియతోడి కరంబు కరంబు చలంబుతో బిగఁబట్టి వలకేలి కరవాలంబునందలలు కఱుక్కునందెగ నఱుకు సురవీరులును, బెడిదంపు గటారులం బొడిచినఁ గడుపులనుండి బొసబొస వెడలు ప్రేవులప్రోవు లదిమి దిట్టతనంబుతో నడుమం జుట్టినట్టి దట్టి చెఱంగుల నడంచి కట్టికొని, తము నొంచినవారి బట్టికొని, యట్టి బెట్టిదంబులే యాచరించు నిశాచరులును, నిష్ఠురగదాఘాతంబులం దలలు పగిలి నొగిలి బుడబుడ నెత్తురు గ్రక్కుచుండియుం బెండువడక కడింది రిపుల వక్షస్థ్సలంబులు శూలంబులం గ్రుచ్చి పడఁద్రోచి యేడ్తెరంజూపు వినువీటి పోటుబంట్లును, గఠోరకుఠారధారల భుజశాఖలు నఱికివైచినం గఱకు చెడక మరులం జుఱుకుచుఱుకునం గనుంగొనుచు మొఱకుతనంబున మీఁది కుఱికి బెట్టుగాఁ బడఘట్టనంబులు పరఁగించు రట్టడిదనుజులును, నెదురుగ నుండి చూచు తమ యేలికలతో మార్తుర నిదె యిందఱ మ్రందించి వచ్చెద మని నొడివిన వడువునం గడిమి మెఱసి ప్రతిజ్ఞ లీడేర్చుకొని సొంపు బొందు నిలింపులును, పెడబొబ్బ లిడుచు నెదురుగా నడుచు పెక్కుమంది పగతుఱపై రోషంబునం దార్కొని, తోమరముద్గరభిండివాలశూలక్షురికాది వివిధాయుధంబుల సాధనంపు మెరవ ళ్లెఱింగించు నక్తంచరులును, నడికలన నింటివారిం దలంచుకొని కేడించి వచ్చి యచ్చటచ్చట మచ్చరంబున నెదిరి బలంబు సొచ్చి వ్రచ్చి నొచ్చువారిం జచ్చువారిం జూచి, నిజకులస్థానపౌరుషంబులు దలంచుకొని ముంచుకొను నభిమానంబుతోఁ గ్రమ్మఱం దొడరవచ్చు వియచ్చరులును, జనకాగ్రజానుజ తనూజాదిబాంధవులు మ్రందినం బొలివోనిబంటుతనంబునం గంటకులపై నురువడించి యొంటిపాటునం దమయింటి ప్రతిష్ఠల నిలుపుకొను తొలివేల్పులును, నూఱాఱుగాయంబులం బడియుఁ గాయంబుల నొప్పిఁ దలంపక యేలినవాని కార్యంబునకుఁ బాటుపడు నమర్త్యభట కోటులునుం గలిగి, యుభయ బలంబుల వీరభటు లారభటులతో నుబ్బి గబ్బిబెబ్బులులవలెను, నుదుట గల బొబ్బమెకంబులవలెను, నుఱుమని పిడుగులవలెను, నుడుగని కార్చిచ్చుల వలెను, నుడివోని కాలసర్పంబులవలె, నురడింపని మదహస్తులవలె, నోలమాస గొనక యొక్క చందంబునం బోరుచుండి రట్టియెడ. | 291 |
| కం. | పడుతలలు తఱచు నఱుకుడు వడుసేతులు జడిసి బెండు వడుగుండెలు చే డ్పడు మేనులుఁగడు త్రొక్కుడు పడు నడుగులుఁ బంక్తిముఖుని భటులకుఁ గలిగెన్. | 292 |
| సీ. | అపుడు రావణుఁడంప యజ్ఞకోపసుపార్శ్వ - ధూమ్రాక్షయూపాక్ష ధూమకేతు జంబుమాలిసుమాలి శతమాయరుధిరాక్ష - ఖరమహోదర మహాకాయదూష ణత్రిశిరోనరాంతక సురాంతక మహా - పార్శ్వ మారీచ సుప్తఘ్న సూర్య శత్రు వృశ్చికరోమ సర్పరోమాభేద్య - కవచ విరూపాక్ష కాలనేమి | |
| గీ. | దుర్ముఖశుకాది వీరదైత్యులు ప్రహస్త సహితులై తీవ్రహస్త ప్రశస్త శస్త్ర ధాళధళ్యంబు లఖిలదిక్తటుల మెఱియ నామరచమూజిగీషులై యడరుటయును | 293 |
| చం. | అసురులు మార్కొనన్మఘవుఁ డంపిన సిద్ధులు సాధ్యు లశ్వులున్ వసువులు భాస్వరుల్ దుషితవర్యులు రుద్రులు విశ్వు లుగ్రసా హసమున నొక్కటై యలప్రహస్తుఁడు మున్నగు సైన్యనాథులున్ మసలక తాఁకి రద్రులను మార్కొనునద్రుల పోల్కి నయ్యెడన్. | 294 |
| చం. | అడరుచు హుంకరించుచు నహంకృతిఁజూపుచు నస్త్రధారలన్ సుడివడఁజేయుచున్ దెగడుచున్ బెగడించుచు నిల్వరించుచున్ గడఁగుచు నోసరింపుచు ముఖాముఖి నిల్చుచు బిట్టదల్చుచున్ జడియక పోరి రయ్యుభయసైన్యములం గల యోధు లుద్ధతిన్. | 295 |
| చం. | హరులు మధేభయూధముల నాఁగినకైవడి, దేవవీరు ల య్యరుల నెదిర్చి శస్త్రముల నస్త్రములన్ నిగిడింప రక్తని ర్ఘరములతోడి జంగమధరాధరపంక్తులఁబోలి వారలం దఱు వెనుదీయఁ గాంచి యెలనవ్వువహించి సుమాలి యీసునన్. | 296 |
| చం. | నిలగదరోయి దేవరథినీవరులార! యటంచు నుజ్జ్వల జ్జ్వలనరుచిప్రకాశ మగు స్యందన మెక్కి గుణంబు దీటుచున్ బలరిపుసైన్యపాలకులపైఁ బ్రళయాశనితుల్యసాయకం బులు నిగుడించి యార్చి పొలివోని పరాక్రమవైభవంబునన్. | 297 |
| చం. | వసువుల బిట్టదల్చి పితృవర్గములన్ బెగడించి విశ్వులన్ వసుమఱిఁజేసి సాధ్యులజవం బడఁగించి శరాళి రుద్రులన్ దొసఁగులఁబెట్టి చారణుల దోహలముల్ సడలించి యమ్మరు ద్విసరము నొంచి భాస్వరుల బీరము మాన్చి పరాక్రమించినన్. | 298 |
| ఆ.వె. | ఈ సుమాలి సురల నిటులఁజిక్కులఁబెట్టె నీసుమాలి చూడనేల? యనుచు వసువు డాయు పేదవలెను సావిత్రాఖ్య వసువు విక్రమించి వాని దాఁకి. | 299 |
| శా. | నీ వీరత్వము గానిపించితివి మేల్ నేఁడింక నా శౌర్యమున్ నీవుం గన్గొన వల్వదే? యనుచు నిర్ణిద్రాస్త్రధారాహతిన్ సావిత్రుండు సుమాలి నొంచుటయు రోషభ్రూకుటీభ్రాజితుం డై వాఁడేసిన బాణముల్ నఱికి పూర్వాదిత్యుఁ డత్యుగ్రతన్. | 300 |
| శా. | ఆకాశం బవియించు నార్పు లెసఁగన్ జ్యావల్లి మ్రోయించుచున్ బాకారిప్రముఖామరుల్ బెగడ శుంభద్వజ్రశాతాశుగా నీకం బవ్వసుగాత్ర పంజరమునన్ నించెన్ సటోత్పాటన వ్యాకీర్ణక్రుధమైన కేసరిబలెన్ వాఁడల్గి దేవారిపైన్. | 301 |
| మ. | పది నారాచము లేసి, మైమఱువు నిర్భగ్నంబుఁ గావించి యి ర్వది బాణంబుల ఱొమ్మగల్చి కరరారాజచ్ఛరాసంబు ము ప్పది వాల్దూపులఁ ద్రుంచి సారథిశిరఃపాతంబు రథ్యధ్వజ చ్ఛిదయున్ నల్వది సాయకంబుల నొనర్చెన్ వేల్పులుప్పొంగఁగన్. | 302 |
| వ. | ఇవ్విధంబునన్ | 303 |
| మ. | విరథుండైన సుమాలిపై నడరి సావిత్రుండు వృత్రారి భూ ధరశృంగంబు శతారపాతమున విధ్వస్తంబు గావించువై ఖరి నుద్దండభుజాగ్ర మండితగదాఘాతంబునన్ వానిబల్ శిరమున్ గాత్రము నుగ్గుఁజేసె దివిజశ్రేణుల్ ప్రహర్షింపఁగన్. | 304 |
| ఆ.వె. | అతని పాటుఁజూచి యశ్రుధారాపూరి తాక్షులగుచు నెల్ల రాక్షసులును దలలు వీడ నాయుధంబులఁ బడవైచి రణము విడిచి చనిరి రఘువరేణ్య! | 305 |
| చం. | ముది పొలదిండి చేటు తమ మూఁకల కొందలపాటు వేల్పుమ న్నెదొరల గెల్పునీటుఁ గని నెమ్మది నీసును రోసమెచ్చఁ గెం పొదవెడి చూడ్కితో దనుజయోధుల నిల్పుచు మేఘనాదుడా త్రిదశులఁ బిట్టెదిర్చెఁ దన తేరు శిఖిద్యుతి నుల్లసిల్లఁగాన్. | 306 |
| కం. | ఎదిరించి శిఖిశిఖాభ ప్రదరపరంపరల నమరబలవనము దహిం పఁ దొడఁగె జగతీస్థలి గ్ర క్కదల రథము దుర్నిరీక్ష్యగతిఁ జరియింపన్. | 307 |
| కం. | అక్కడిఁది జోదు ముందరఁ జక్క నిలిచి తేఱి చూడఁజాలక దివిజుల్ దిక్క మెకంబులవలె నలు దిక్కులకున్ బఱ చిరేమి దెలిపెద నధిపా! | 308 |
| తే.గీ. | ఇక్కరణి దేవతలలో నొక్కఁడేని రావణాత్మజు నెదిరించి రణము సేయఁ జాల కతిభీతిఁ జనఁజూచి శతమఖుండు పేరెలుంగెత్తి వారలఁ బిలిచి పలికె. | 309 |
| ఉ. | ఆమరశూరులార! తగవా? పగవారలు సూచి నవ్వ సం గ్రామము డించి పోవ, భుజగర్వము ఖర్వము సేసి యూరకే యేమిటి కిట్లు పాఱెద రొకించుక నిల్వుఁడు మేఘనాదు బా హామహిమం బిఁకన్ మన జయంతుఁడు మాన్చు నటంచుఁ బల్కఁగన్. | 310 |
| ఉ. | అంతకుమున్నె రావణి రణావని గెల్వఁగ నుత్సహించి కా లాంతక శౌర్యవంతుఁడు జయంతుఁడు సారథిఁ జూచి దేవతా సంతతి నొంచురావణనిశాచరసూతి నెదిర్చి పోర నేఁ డెంతయు వేడ్కయయ్యెఁ జననిమ్ము రథంబు రయంబుతో ననన్. | 311 |