| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | జయంత మేఘనాదుల యుద్ధము |
| ఉ. | స్వామి! మహాప్రసాదమని చయ్యన నాతని తేరి సూతుఁడౌ గోముఖుఁ డాగతిం బఱప గోముఖనాదము లుల్లసిల్ల సు త్రామసుతుండు రావణి నుదగ్రత మార్కొని భూరి బాణధా రామయగాత్రుఁ జేసె నమరప్రకరం బది చూచి క్రమ్మఱన్. | 312 |
| చం. | పకపక నవ్వి రావణి సెబాసుర యోరి జయంత! దేవతా నికరములో బలాఢ్యుఁడవు నీవె యొకించుక సేపు పాఱి పో వక నిలు నిల్చినం బొగడవచ్చును నిన్నని పల్కి శాతసా యకముల సారథిన్ హయచయంబుల నొంచి యహంకరించినన్. | 313 |
| చం. | శతమఖనందనుం డతని సారథి నొంచి నిశాతసాయక ప్రతతుల నించి మేనురుధిరంబున ముంచిన నొచ్చి దండతా డితభుజంగము మాడ్కి భ్రుకుటిప్రకటీకృతరోషుఁడై దశా స్యతనయుఁ డా జయంతుని సహాయుల నొవ్వఁగ నేసెఁ దూపులన్. | 314 |
| వ. | ఇచ్చెలువున జయంతునికిఁ దోడుపడవచ్చిన వియచ్చరుల మేను లుచ్చిపాఱ శరోచ్చయంబులు నిగిడించి, యచ్చిఱుత రక్కసుండు వెండియు. | 315 |
| చం. | అరదముమీఁదనుండియె బయల్పడ కుగ్రతమంబు పన్ని యం బరగతుఁడై శరాసనకృపాణ పరశ్వథ భిండివాల ము ద్గర పరిఘాస్త్రతోమర గదా ముసలక్షురికాదిసాధనో త్కరములు శైలశృంగములు గాటముగాఁ గురియించె నొక్కటన్. | 316 |
| ఉ. | అందున భీతిఁ బొంది సురలందఱు నిల్చినచోట నిల్వ కెం దెందొ చనంగ నాత్మభటులెంతయు వంతఁగనంగఁభజూచి సం క్రందననందనుండు దశకంఠసుతోత్థ తమః పరంపరన్ గుందియు దేవసైన్యములఁ గోల్తలఁ జేయఁ గడంగుచున్నెడన్. | 317 |
| తే.గీ. | ఆ మహేంద్రకుమారు మాతామహుండు మనుమఁ డలయుటఁగని తన మాయవలన నెత్తికొనిపోయె జలరాశి కెవ్వరతని పోక తెలియక యద్భుతాంబుధి మునుంగ. | 318 |
| కం. | పతి లేని చానవలె దై వతసేన గలంగి దానవప్రభుసుతుచే నతిదైన్య మొందఁగని సుర పతి మాతలి దిక్కు చూచి పటుమతిఁ బలికెన్. | 319 |
| చం. | అలజడిఁ జెందె సేనలు, జయంతుని నెక్కడ గాననైతి వే ల్పులకు నజయ్యుఁడై సమరభూస్థలి రావణి మించె వీనితోఁ గలహ మొనర్పకున్న నిఁకఁగార్యము గాదు రథంబు వేగ మా తలి! యటుపోవని మ్మరివధం బొనరించెద నేఁడు నావుడున్. | 320 |
| సీ. | కమనీయ శతకోటి ఘంటికాఘణఘణా - రవముచే దిక్కరుల్ సెవుడు వొరయ దశసహస్రోదగ్రతర మణీమయచక్ర - చంక్రమణస్థితి జగతి వడఁక సకలలక్షణవిచక్షణ లక్షహయఖురో - త్థరజోహతుల సముద్రములు గలఁగ శరదభ్ర విభ్రమ స్ఫురదదభ్ర ధ్వజో - ద్భటభటార్భటి నభస్తటము వగులఁ | |
| గీ. | జక్రచాపగదాఖడ్గశక్తి శూల కుంతతోమర పరిఘాది ఘోరసాధ నాంశువులు శత్రుదృక్కాంతు లపహరింప నమరవిభు తేరు మాతలి యపుడు నడిపె. | 321 |
| చం. | నలుగడలన్ మరుద్వసుగణంబులు సాధ్యులు రుద్రు లశ్వులుం గొలువ వరాప్సరోయువతికోటులు ముందు నటింప శంఖమ ర్దళమురజాది వాద్యనినదంబులు బోరుకొనంగఁ జారణుల్ పలుమఱు నెంచఁగా ననికిఁ బాకహరుం డరుదెంచుచున్నెడన్. | 322 |
| చం. | అభిముఖుఁడై దశాననుఁ డుదంచిత కాంచన కింకిణీక్వణ క్షుభితదిశాకరిశ్రవణకోటరమౌ రథ మెక్కి వాహినీ ప్రభు లిరువంకలం గొలువ బంధురతూర్యరవంబు లొప్ప స్వ ర్విభు నెదిరింప మాన్చి రణవీరుఁడు రావణి తా నెదుర్కొనెన్. | 323 |
| ఉ. | అత్తఱిఁ గ్రొత్తగా బవర మయ్యె సురాసురయోధకోటికిన్ గత్తులబల్ తళత్తళలు కత్తళపున్ మగఱాతళత్తళల్ మొత్తములై నభోమణిని ముంచె నభస్తటినీ మహోర్ములన్ జొత్తిలఁ జేసె సైన్యయుగ శోణ రజః పటలంబు లొక్కటన్. | 324 |
| ఉ. | అందును నిందుఁ బేరుగలయట్టిదొరల్ నెఱియోధు లుగ్రులై యందఱి కందఱై పెలుచనార్చుచు నొండొరుఁదాఁకి పోరి రా క్రందునఁ గుంభకర్ణుఁ డధికత్వర ముందుగ నన్న డెంద మా నందముఁ జెందఁగా రణమొనర్చె మహోన్నతశూలహస్తుఁడై. | 325 |
| మ. | పదఘాతంబుల జానుఘట్టనములన్ బార్ష్ణి ప్రహారంబులన్ ద్రిదశానీకిని నొంచుచున్ గలఁచుచున్ దీనత్వ మొందించుచున్ రథసంఘర్షములన్ నభంబు వగులన్ రౌద్రాకృతిన్ మించఁగా నెదిరింపన్ వసపోక భీతిలిరి దేవేంద్రాదు లుర్వీశ్వరా! | 326 |
| ఉ. | అద్రి తెఱంగునన్ సురబలార్ణవమున్ మథియించు శాత్రవో పద్రవకారి నయ్యసురభర్తఁ గనుంగొని రౌద్రమూర్తులౌ రుద్రులు వచ్చి తాఁకిరి మరుత్తులు బిట్ట్టెదిరించి యద్రిశృం గద్రుమసంఘముల్ గురిసి కాఱియవెట్టిరి యొక్కపెట్టునన్. | 327 |
| శా. | ఆదిత్యుల్ చెలరేఁగి యయ్యసురమే నస్త్రప్రవర్షంబులన్ భేదింపన్ గిరినిర్‌ఝరంబుల రహిన్ బెన్నెత్తురుల్ వాఱి యా చ్ఛాదింపన్ రణభూమి యెల్ల నపుడీర్ష్యాగ్రస్తులై యా ప్రహ స్తాదుల్ సేనలనెల్లఁ గోల్తలనుజేయన్ మీఱెఁ బోరయ్యెడిన్. | 328 |
| చం. | కరిమకరాహికర్కటకకచ్ఛపమీనవరాహఖడ్గకా సరచమరీతరక్షు హరిశల్యకురంగతురంగగండకా ద్యురుతరనైకవాహనము లుద్ధతి నెక్కి సురారివీరు లా సురల నెదిర్చి రొక్కమొగిఁ జూపరు లచ్చెరువంది చూడఁగన్. | 329 |
| కం. | ఆ సంకుల సమరంబున వాసవుఁ డౌ మే! లనంగ వసువులు తుషితుల్ డాసిరి యసిధారలఁ దెగ వ్రేసిరి రోసమున నసురవీరుల శిరముల్. | 330 |
| వ. | అప్పుడు | 331 |
| సీ. | తెగు బుజంబులు తుమురగు ధ్వజంబులు కూలఁ - బడు గజములు నడరెడు రజములు వ్రీలునెమ్ములు నేల రాలు సొమ్ములు చిక్కు - లొందు కా ళ్ళురవడి మ్రందు జోళ్ళు సడలు ఛత్రములు కీ లెడలు గాత్రములు మ్ర - గ్గెడు కరములు దునిఁగెడు శిరములు పొరలు రౌతులు భీతిఁదెరలు సూతులు వ్రస్సి - యొఱుగు బండ్లును బెట్టు విఱుగు విండ్లు | |
| గీ. | పాఱు నెత్తురుటేరులుఁ దీఱు శస్త్ర ధారులును మీఱు గాముల బారు గల్గి పేరుగల వేల్పు దొరలచేఁ దీఱునాత్మ బలము వీక్షించి రోషించి పంక్తిముఖుఁడు. | 332 |
| మ. | అమరాధీశచమూసమూహముల దివ్యాస్త్రానలజ్వాలలన్ సమరక్షోణిఁ గలంచినన్ దెరలి యా సైన్యంబు దైన్యంబుతో నముచిధ్వంసిరథంబు మాటునకుఁ జన్నన్ గిన్క నేత్రారవిం దము లారక్తసరోరుహద్యుతులఁజెందన్ జిష్ణుఁ డత్యుగ్రతన్. | 333 |
| కం. | అరదము దశముఖు మీఁదం బరువడి నడిపింపు వేగ మాతలి! యనుచున్ గురుకార్ముక మౌర్వీటం కరణముతో వచ్చు నింద్రుఁగనుఁగొని యతఁడున్. | 334 |
| ఉ. | సారథి నెచ్చరించి రభసంబున నిర్జరరాజుతేరికిన్ జేరువయై తనుం బొదువు చిల్లరవేల్పుల వాఁడితూపులన్ భీరులఁజేసి మాతలి ననేకశరంబుల నొవ్వనేసినన్ బేరలుకన్ శతక్రతుఁడు పేర్చి దశాస్యు నెదిర్చె శూరతన్. | 335 |
| మ. | శతకోటి ప్రతికోటి శాత విశిఖాసారంబులన్ సైంధవ ప్రతతిన్ నొంచి, ధ్వజంబు ముంచి మకుటీభాగంబులన్ నించి, సూ తతనుత్రాణముఁజించి, మించిన సురాధ్యక్షున్ నిరీక్షించి యు ద్ధతిమై రావణుఁ డాగ్రహించి, దశకోదండీకరోద్దండుఁడై. | 336 |
| మ. | పదిహస్తంబుల నస్త్రముల్ దొడి, నభోభాగంబు భేదిల్ల వే ల్పు దొరన్ నొవ్వఁగ నేసి యార్చిన మరుల్లోకేశ్వరుండున్ శిత ప్రదరాసారము నించె నింద్రదనుజేంద్రస్ఫారబాణావళుల్ గదిసెన్ భానుని దానఁగ్రమ్మె దిశలన్ గాఢాంధకారచ్ఛటల్. | 337 |
| శా. | ఆ పెంజీఁకటిలో స్వకీయపరకీయానీకినీభేదదృ గ్వ్యాపారేతరులై సురాసురులు తా రన్యోన్యమున్ బోరుచో దీపింపెన్ భుజఖడ్గకాంతు లపు డుద్రేకించి పౌలస్త్యు సే నాపంక్తిన్ దశమాంశముం బొదివి మ్రందం జేసి రద్దేవతల్. | 338 |
| శా. | ఆ సేనాక్షపణంబుఁ గన్గొని దశాస్యాదిత్యవిద్వేషి రో షాసూయావిలమానసుం డగుచు సింహస్ఫూర్తి గర్జించి వీ క్షాసంఘంబుల నిప్పు లుప్పతిల నుగ్రభ్రూకుటుల్ మోములన్ భాసిల్లన్ దన సారథిం గని యనున్ బ్రావృట్పయోదార్భటిన్. | 339 |
| కం. | ఇదె నందనమున నుండియు నుదయశిఖరిదాఁక నిండియుండెడు నైక త్రిదశానీకిని నడుమన్ బదరక మన రథము నడుపు ప్రావీణ్యమునన్. | 340 |
| మ. | వసురుద్రానిలభాస్వరప్రముఖ దేవశ్రేణులన్ నేఁడు జి ష్ణుసమీపంబున సంహరింతుఁ బొలియింతున్ దోడుగా వచ్చురా క్షస పాశాయుధయక్షరాజశమన స్వాహావధూనాథులన్ వెసఁ గైకొందుఁ దదీయలోకములు దోర్వీర్యంబుతో నావుడున్. | 341 |
| మ. | అతఁ డాలాగె రథంబు దోలఁగ సహస్రాక్షుండు వీక్షించి య ద్దితిజాధీశ్వరు నిశ్చయం బెఱిఁగి, యాదిత్యాదులం బల్కె నేఁ డతిశౌర్యంబున బ్రహ్మదత్తవరగర్వాయత్తుఁడౌ రావణున్ మృతిఁ బొందింపఁదరంబు గాదు గద బల్మిం బట్టి తెత్తుంజుఁడీ. | 342 |
| మ. | అవలోకింపుఁడు మీర లందఱు మదీయంబైన శౌర్యం బటం చు విజృంభించి బలారి దక్షిణపథస్థుండై చరించెన్ సురా రివరుం డుత్తరభాగవర్తియయి మీఱెన్ గొంతసే పంత న ద్దివిజేంద్రుం డెదిరించె దైత్యు నతఁ డద్దేవేంద్రుఁ దాఁకెన్ వడిన్. | 343 |
| వ. | ఇవ్విధంబున | 344 |
| కం. | కుడియెడమలుగాఁ దిరుగుచు నెడనెడమార్కొనుచుఁ దలఁగి యేఁగుచు శరముల్ జడిగొన నిగిడించుచు బడి బడి నడరుచుఁ దొడరి తెంపుపనికిఁ దివురుచున్. | 345 |
| మ. | పలు చందంబులఁ బోరుచున్నయెడ జంభద్వేషి యాదిత్యరు ద్రులతో ముప్పదిమూడుకోటుల సురల్ దోడ్తో విజృంభించి కో ల్తలనేయన్ దశకంఠునిన్ దొడరి రథ్యవ్రాతమున్ నొంచి చే తుల విండ్లం దేగవ్రేసి పట్టికొన నుద్యోగించి ధైర్యంబునన్. | 346 |
| చం. | అరదము చుట్టు ముట్టుకొని యాఁగి దశాస్యుని బిట్టదల్చి పై కుఱికి తెమల్చి పట్టుకొని యుద్దవిడిం దనతేరి మీఁదికిన్ సురపతిగొంచుఁబోవుటలు సూచి నిశాటులు స్రుక్కి దానవే శ్వరుఁడదె చిక్కె, దైత్యులకు వచ్చె నుపద్రవ మంచుఁ గూయిడన్. | 347 |
| ఉ. | ఆ రొద లాలకించి తమయయ్య యుపాధియుఁగాంచి సంగర క్రూరుఁడు మేఘనాదుఁ డతికోపముతో శిఖిఁబుట్టినట్టిబల్ తేరును గేతువున్ హరులు దివ్యధనుశ్శరధుల్ వెలుంగ గౌ రీరమణీమనోహరవరిష్ఠవరాగత శౌర్యధుర్యుఁడై. | 348 |
| చం. | కడువఁడి నేఁగుదెంచి దశకంఠుని చుట్టును నిండి యాఁగి యుం డెడి తెఱగంటి మూఁకల గడింది బలంబున డాసి యంప పెం జడి నిగుడించి వర్మములుఁ జర్మములుం బగిలించి నెత్తురుల్ మడువులు గట్టఁజేసి బలుమచ్చర మెచ్చను హెచ్చరింపఁగన్. | 349 |
| సీ. | అరదంబు లదలించి ద్విరదంబుల నడంచి - దరదమ్ము లగునాయుధములఁ ద్రుంచి పడగలగుమిఁజీల్చి గొడుగులగమిఁ గూల్చి - వడిగల తేజీలఁ బుడమివ్రాల్చి శిరములఁబగిలించి కరముల నొగిలించి - నరముల విశిఖసంతతులఁద్రుంచి హనువుల నొప్పించి ధనువులు దప్పించి - తనువులు నిశితశస్త్రముల ముంచి | |
| గీ. | భటుల బడలించి యాశ్వికార్భటుల మాన్చి సారథుల నేసి రథికులఁ జదియఁజేసి హస్తిపకకోటి నలయించి యభవదత్త తానుసీవిద్యఁ దాల్చి యద్దనుజసుతుఁడు. | 350 |