ఇతిహాసములు ఉత్తరరామాయణము మేఘనాదుం డింద్రజిత్తగుట
మేఘనాదుం డింద్రజిత్తగుట
మ.అలుకన్‌ దేరును దా నదృశ్యుఁడయి మాయాధ్వాంతమున్‌ దిక్కులన్‌
బలియన్‌ జేయుచు నింద్రునిం బొదివి, తర్పార్శ్వస్థులౌ దిక్పతుల్‌
తలఁకన్‌ మాతలిపైఁ బతాకపయి రథ్యశ్రేణిపైఁ దేరిపై
బలుతూపుల్‌ నిగుడించి యార్చిన బలప్రత్యర్థి విభ్రాంతుఁడై.
351
మ.అరదం బయ్యెడ డిగ్గి, యగ్గలికతో నైరావతారూఢుఁడై
పరునింగానక నాల్గుదిక్కు లరయన్‌ బౌలస్త్యపుత్రుం డగో
చరుఁడై గోచరచక్రవర్తి సొలయన్‌ శస్త్రాస్త్రముల్‌ నించి బం
ధురమాయాతిమిరాంధుఁడౌ నతని బద్ధుం జేసెఁ బాశావళిన్‌.
352
వ.అప్పుడు353
ఉ.అత్తెఱఁగెల్లఁదెల్లముగ నారసి యుబ్బుచు దైత్యసత్తముల్‌
మత్తిలి, మేఘనాదుఁ బలుమాఱు నుతించుచుఁ గేకవ్రేయుచున్‌
నృత్తము సేయుచున్‌ జెలఁగి రింద్రుని కొందలపాటుఁ జూడలే
కత్తఱి రుద్రసాధ్యమరుదశ్విను లార్చుచు ధీరచిత్తులై.
354
చం.చలమున రావణుం బొదివి సాయకజర్జరితాంగుఁజేసి త
ద్బలముల నొవ్వనేసి గుమిఁ బాయక పైపయిఁగ్రమ్ముకొన్న బి
ట్టలసి దశాననుండును బ్రయత్నముతో ననిసేయ నంబర
స్థలమున నుండి చూచి రభసంబున రావణి వచ్చి యార్చుచున్‌.
355
మ.ప్రళయాభ్రం బమితాశనుల్‌ గురియుదర్పం బేర్పడన్‌ వారిపై
శిలలుం బర్వతశృంగముల్‌ శరములున్‌ జేయార వర్షించి ద
వ్వులకుం బాఱఁగఁ ద్రోలి తండ్రిఁగని - దివ్యుల్‌ పాఱి, రింద్రుండు దు
ర్భలుఁడై నా చెయిఁజిక్కె నేలయిఁక సంగ్రామంబు? దైత్యేశ్వరా!
356
చం.మగఁటిమి నీడు గాని సురమండలితో నని సేయనేల? ము
జ్జగములకీవె నాథుడవు సైన్యములన్‌ మరలింపఁబంపు నీ
కగపడె వీఁడె వాసవుఁడటంచును జూపిన మేఘనాదునిన్‌
బిగియఁ గవుంగిలించి, కడుఁబ్రీతి వహించి దశాస్యుఁ డిట్లనున్‌.
357
చం.వెలసెఁగులంబు నీవలన విక్రమధైర్యనిధాన! పోరిలో
బలరిపునంతవానిఁ జెఱఁ బట్టఁగ నెవ్వరికైన శక్యమే!
తెలిసిరి నీ ప్రతాప మదితిప్రియపుత్రులు ముజ్జగంబులన్‌
వలసినయట్లకొంటి నినువంటికుమారుఁడు కల్గియుండుటన్‌.
358
ఉ.అందఱిలోనఁ బెంపును జయంబును జెందితిగాన ముందు నీ
స్యందన మేఁగనిమ్ము వెను చక్కిన వచ్చెద నేను సేనతో
నిందఱు జోదులుం గొలువ నియ్యెడనంచు గుమారుఁబంచి మి
న్నంది బలంబుతో వెనుకయై దశకంధరుఁడేఁగె వేడుకన్‌.
359
వ.ఇవ్విధంబున360
చం.సుతుని పురస్కరించుకొని సూరెల మంత్రులు సంస్తుతింపఁగా
శతమఖు గుండె దిగ్గుమన సర్వనిశాచరసేన గొల్వఁగా
నమలమహావిభూతి మెఱియన్‌, దన ప్రోలికిఁబోయి సోదరా
న్వితుఁడయి పౌరులుల్లసిల వేడుక నొందుచునుండె రాఘవా!
361
కం.అని కుంభజుఁ డెఱిఁగించిన
విని యింద్రుం డెటులు మరల విడిపించుకొనెన్‌
వినిపింపుఁ డవలి కథ యని
మనువంశనృపాలమౌళి యడుగుటయున్‌.
362
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju