ఇతిహాసములు ఉత్తరరామాయణము ఆశ్వాసాంత పద్యములు
ఆశ్వాసాంత పద్యములు
మ.నతరక్షాభరణా! రణార్థిరిపుసేనావారణా! వారణా
ర్తితమోహృత్తపనా! పనాయితగుణశ్రీధారణా! ధారణా
న్వితచేతోభ్యుదయా! దయాముదితకుంతీనందనా! నందనా
యతధాత్రీజహరా! హరాదికసపర్యాభాసితా! భాసితా!
363
కం.అమరార్చిత పదకమలా!
కమలారమణీ సమీపగతహారమణీ!
రమణీయదయైకమనా!
కమనాకృతిముషిత గోపికా మానధనా!
364
పృథ్వీవృత్తముఫణాభృదరుణాధరా ప్రణుతికర్ణసంతర్పణా!
పణాయితఘృణారసప్రవిలసత్‌ కటాక్షేక్షణా!
క్షణాఢ్యశరణాగతోచ్చయగృహార్చనాకారణా!
రణాశనకణాద పర్వత ముఖార్య సంరక్షణా!
365
గద్యముఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు చతుర్థాశ్వాసము. 
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju