ఇతిహాసములు ఉత్తరరామాయణము మాల్యవదాదులు స్వర్గనగరిపై దండెత్తుట
మాల్యవదాదులు స్వర్గనగరిపై దండెత్తుట
కం.సేనాధిపతుల రమ్మని
దానవపతి యమరరాజధానిపయిఁ జనం
బూనినవాఁ డిప్పుడె మన
సేనల రప్పింపుఁ డనుచు సెలవిచ్చుటయున్‌
26
భుజంగప్రయాతముదణా పెద్ద యాజ్ఞన్‌ సుధాభుగ్విరోభ్య
గ్రణీ సేనలన్‌ మించె గంభీరభేరీ
ధణంధాణముల్‌ దేవధానీవసద్గ
ర్భిణీగర్భగభ్రూణభేదంబు గాఁగన్‌
27
సీ.తన నిర్జరాచలత్వమున కుల్కి సురాద్రి - వాపోవు గతిఁ బ్రతిధ్వను లొసంగఁ
దన కింక నేటి జీవనమంచు వారాశి - గలఁగెనా జలము పంకిలముగాఁగఁ
దనమేను గరుపారఁ దమిమీఱి శశిధారి - వడఁకు గుబ్బలి కన్నె వడఁకుఁదీర్ప
దన కోర్కు లీడేఱెనను చొక్క పరువుతోఁ - గలహభోజి ముకుందుకడకుఁ బఱవఁ
 
గీ.జెవులలో వ్రేళు లునిచి రాజీవగర్భుఁ
డిచ్చ నేమియు ననలేక ఱిచ్చవడఁగ
మించి ప్రస్థానభేరి వేయించి దండు
వెడలి రసురులు జేజేల వీటిమీఁద
28
సీ.సౌందర్యకృతమేరు మందరాచల నింద - నములౌ మహాస్యందనముల మీఁద
భూరిదానోదకాపూర్ణబంధురకంధ - రములైన మదసింధురముల మీఁద
స్వజవమానసగంధవాహవాహసబాంధ - వములైన ఘనసైంధవముల మీఁదఁ
బ్రతిపక్షకుంభికుంభచ్ఛిదారంభరం - హములైన ఘోరసింహముల మీఁద
 
గీ.శరభచమరీ మృగవ్యాఘ్రశల్యభల్ల
కాసర వరాహ ఖడ్గ పుంగవ ఖరోష్ట్ర
విహగ ఫణికూర్మ మకరాది వివిధ వాహ
వారములమీఁద దైతేయవీరు లెక్కి
29
సీ.మధ్యందినాదిత్య మండలోగ్రాంశు పా - ణింధమాయుధదీప్తి నింగి మ్రింగ
గాఢసర్వాంగీణ కవచవజ్రచ్ఛటా - చ్ఛాయ లాశాకుడ్యచర్చ లొసఁగ
వీరపాణప్రక్రియారక్త దృగ్దృశ్య - విభ ఖదిరాంగారవృష్టిఁ గురియఁ
బ్రళయకాలాభ్రగర్జా వదావద నిష్ఠు - రాట్టహాసముల బ్రహ్మాండ మగల
 
గీ.దేవలోకజిగీషచేఁ ద్రిపురహంతు
కామ కామాంతకోద్భటాకారు లగుచు
లంక విడిచి మనోవీథి శంక విడిచి
యసురు లుత్సాహములు గ్రాల నరుగువేళ
30
శా.ఆ లంకాపురిలో వినంబడె సృగాలారావముల్‌ భూతబే
తాళక్రూరతరాట్టహాసములు మిథ్యాదుర్విలాపంబు ల
వ్వేళన్‌ వేలయు దాఁటి నల్దెసలఁ బర్వెన్‌ సాగరోల్లోలక
ల్లోలశ్రేణి చలించె క్షోణి నుడుపాళుల్‌ రాలె వ్రీలన్‌ గిరుల్‌
31
శా.రక్షస్సైన్యములోఁ గబంధములు గృధ్రంబుల్‌ నటించెం ద్రిలో
కక్షోభంబుగ మేఘముల్‌ గురిసె నిర్ఘాతాస్థిమాంసాస్రముల్‌
పక్షక్షేపము లొప్ప నిప్పుకలు గూబల్‌ చూపులన్‌ రాల్చెఁబ
ద్మాక్షుండిప్పుడె మిమ్ము గెల్చునను పల్కాకాశభూతం బనెన్‌
32
కం.ప్రీతిన్‌ సూరెల నశ్వినీసుతులు రాఁ బెంపొందు నింద్రున్‌ బలెన్‌
భ్రాతల్‌ గొల్వఁగ మాల్యవంతుఁడపు డాభౌమాంతరిక్షోదితో
త్పాతంబుల్‌ దిలకించి దైవకృతముం దప్పింప రాదంచు ని
ర్భీతిన్‌ సైన్యముఖంబునన్‌ నడచె నీరేజాక్షవీక్షాస్పృహన్‌
33
ఉ.మాల్యవదాసురుం డిటులు మాల్యవదాఖ్యనగంబులీల నై
శ్చల్యముతో ననేకదివిషద్రిపు సంగతుఁడై పటీరనై
ర్మల్యలసద్యశోధన సమన్వితదాత ధనార్థికోటిలోఁ
గల్యతఁ గన్న కైవడిఁ బ్రకాశిలె శత్రులు భీతినొందఁగన్‌
34
ఆ.వె.విభుని శౌర్యధైర్య విక్రమోన్నతి సాహ
సములు సూచి సకల సైనికులును
భయము మాలి మాలి పనుపున మృత్యువ
శాత్ములగుచు నడిచి రమరపురికి
35
చం.దనుజవరూధినీ సలలిత త్వరితాశ్వఖురాహతోర్వరా
జనితపరాగ మింద్రుపురి చక్కటికిం జనుటొప్పె మీ పురం
బున కదె దాడిగా దనుజముఖ్యులు వచ్చెద రేడకైనఁ బొం
డని మునుమున్నె ధాత్రి యవరాళికిఁ దెల్పఁగ నేఁగెనో యనన్‌
36
మ.సురదంతావళదానగంధలహరిన్‌ సొంపొందు సౌరాపగాం
బురుహాళిందమిళిందబృందము మహామోదంబునం బైకొనెం
జరనీలాచల భాసురాసురబలస్తంబేరమోద్యత్కటాం
తరచంచన్మద మాహరింప, రిపులన్నన్‌ సైఁప రెవ్వారలున్‌
37
ఉ.భ్రాతల వీటికీ గతి నుపాధి విరోధు లొనర్పఁజూడఁ బా
లైతినటంచు విన్ననయినట్టి క్రమంబునఁ గాంతి మాసి, ఖ
ద్యోతుఁడు వీరరాక్షసభటోద్భట పాణి కృపాణ దీధితి
వ్రాతము గప్పినం గనె వివర్ణత యద్దపుబిళ్ళకైవడిన్‌
38
వ.తత్సమయంబున39
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju