ఇతిహాసములు ఉత్తరరామాయణము విష్ణువు మాల్యవదాదులతో యుద్ధము సేయవచ్చుట
విష్ణువు మాల్యవదాదులతో యుద్ధము సేయవచ్చుట
ఉ.ఆసురరాడ్భయానకజయానకనాదము లాలకించెనో,
వాసవదూత పోయి యిదె వచ్చిరి దైత్యులు నా నెఱింగెనో,
తా సకలాత్ముఁడౌట విభుతం గనెనో తెలియంగరాదు, ల
క్ష్మీ సరసోక్తులం దనివిఁజెంది ముకుందుఁడు లేచెఁ జెచ్చెరన్‌
40
వ.ఈ ప్రకారంబున క్షీరాబ్ధి కుమారితోడి విహారంబు సాలించి దనుజ సంహారంబునందు డెందంబు గీలించి సురబృందంబు మేలెంచి మహోత్సాహంబున41
సీ.వనజమోహమునఁ జేరిన భాస్కరుఁడొ నాఁగ - శయకుశేశయమునఁ జక్ర మమరఁ
గరికరంబున సితాంబురుహంబు దగులీల - నొకకేల నంబుజం బొప్పుమీఱ
నంజనాచలముపై నరుణతాపము మించు - రహి మేనఁ గనకాంబరము దనర్పఁ
దొలువేల్పురా ప్రతిమల చెక్కడపు గండ - పెండెంబు డాకాల దండిఁజూప
 
గీ.శార్‌ఙ్గ తూణ గదాఖడ్గ సహిత మహిత
గారుడస్కందమెక్కి బంగరపు గట్టు
తుదను గనుపట్టు నీలతోయద మనంగ
శాత్రవజిగీష నరుదెంచెఁ జక్రధరుఁడు
42
వ.తత్సమయంబునన్‌43
సీ.తూలఖండములట్ల తునుకలై పాథోధ - రములు రోదో-ంతరాళమున నెఱసె
సపతత్త్రముల లీల శైలముల్‌ దివిఁ బ్రతి - ధ్వనులతో నొండొంటిఁ దాఁకులాడె
శరనిధుల్‌ లోఁతు సూప రసాతలముదోఁపఁ - జిలువరాచెలుల కంటెలు చలించెఁ
గులశైల చలనంబువలన భారము మోవ - బెదరి దిక్కరులు గీపెట్టసాగె
 
గీ.విఱిగి ఫెళఫెళ ధరఁగూలె విపినతరులు
గ్రహవిభుని తేరి హరుల పగ్గములు వదలెఁ
బ్రళయ ఝంఝానిలాభీల పక్షిరాజ
పక్షవిక్షేప జాత ప్రభంజనమున
44
కం.పక్షీంద్ర పక్షహతదీ
ప్రక్షోణీరేణుపటలి ప్రతిపక్షచమూ
రక్షోవీక్షల కప్ర
త్యక్షముఁ గావించె భువనమంతయు నధిపా!
45
చం.హరిశరపంక్తికంటె మును పగ్గరుడోగ్రగరున్మరుత్పరం
పరలు విరోధిసైన్యములపైఁజనఁగూలె ధ్వజాతపత్ర చా
మర సుభటప్రకాండ భుజమండల మండిత మండలాగ్రముల్‌
గరులు హరుల్‌ రథంబులును గాడ్పడెఁ జేడ్పడి రెల్లసైనికుల్‌
46
చం.అమరులు పుష్పవృష్టిఁగురియన్‌ దివిఁ దుంబురు నారదాదిగా
నములు రహింప సేవకజనంబులు గొల్వఁగఁ జారణస్తుతుల్‌
ప్రమదమొనర్ప వచ్చి రిపుభంజనుఁడా హరి యొత్తె రుక్సమూ
హమథితరాజమున్‌ రవధుతారిసమాజము శంఖరాజమున్‌
47
చం.అదిరి కడున్‌ సురారిభటు లా జయశంఖరవంబు వీనులం
గదిసిన గుండియల్‌ పగులఁ గంపముతోఁ దలలెత్తి కాంచన
చ్ఛదరుచి మించు నగ్గరుఁడుఁ జక్కఁ గనుంగొన లేక భీతులై
యదెయిదె వాఁడెవీఁడె హరియంచుఁ జలింపఁగ సైనికాగ్రణుల్‌
48
ఉ.గర్వముతో సుపర్వులకుఁగా ననిసేయఁగ వచ్చితే? యిదే
సర్వసమానలక్షణము? చాలు, హరీ! నిలు పోకు మంచహం
పూర్వికతో గదా పరశుముద్గర తోమరపాణులై మహా
పర్వతరాజమున్‌ మశకపంక్తులయ ట్లెదిరించి రొక్కటన్‌
49
సీ.వర్షాబ్దగతి సంపవాన దైత్యులు ముంప - నచలుఁడై హరి యంజనాద్రిఁ దెగడె
శలభసంహతిలీల శత్రులొక్కట మీఱఁ - గేదారగతినొందెఁ గేశవుండు
మశకపంక్తులయట్లు మార్తు రుద్ధతిఁజూప - గట్టుఁదాలుపు జెట్టి బెట్టుఁజెందె
మకరవైఖరి వైరినికరంబు చెలరేఁగ - వనజనాభుఁడు వార్ధి వహి వహించెఁ
 
గీ.బూర్వదివిజులు దివిజుల పోల్కి నిగుడ
నయ్యనంతుఁ డనంతాభ నతిశయిల్లె
దొరయు మధుమక్షికల వీఁకఁ బరులు దాఁకఁ
దేనెపెరదారి మధువైరి గానిపించె
50
శా.రక్షోరాజధనుర్వియుక్త శతధారస్ఫారహృద్వాయువే
గాక్షీశాస్త్రపరంపరల్‌ నిగిడి కీలాభీలతన్‌ వచ్చి ప
ద్మాక్షుం జొచ్చి యడంగె నొక్కటఁ దదీయాంగంబునం బద్మగ
ర్భక్షీణావసరంబునన్‌ భువనముల్‌ ప్రాపించి లోనౌ రహిన్‌
51
వ.అప్పుడు52
సీ.పలు నగంబులు వజ్రపాణి మార్కొను లీల - రథికసారథులతో రథము లడరె
హరినీలశిఖరి గోరాడఁ దార్కొను జాడ - నిజయూథపులతోడ గజము లడరెఁ
బక్షితార్క్ష్యత సహింపని చందమున నాశ్వి - కశ్రేణితోఁదురంగమము లడరెఁ
గదనమందెటులైన నిదియె దిక్కను రీతి - హరిపదంబున భటోత్కరము లడరె
 
గీ.నడరి నప్పుడె రథిక దోరధిక ధన్వ
శింజినీ ఘోషములును హాస్తిపక హుంక
రణము లాశ్వికధిక్కార రవము లుగ్ర
భట కహకహార్భటులు దిశాపటలి నెఱసె
53
శా.ఆ నక్తంచరశేఖరుల్‌ గురియు దివ్యాస్త్రప్రవర్షంబులున్‌
నానాశస్త్రపరంపరల్‌ పయిపయిన్‌ నారాయణున్‌ గ్రమ్మినన్‌
దా నుచ్ఛ్వాసము లేనియ ట్లొక ముహూర్తం బయ్యెడన్‌ గన్పడెం
బ్రాణాయామపరాయణుండయిన విప్రగ్రామణిం బోలుచున్‌
54
కం.మీన సమూహము పొరల మ
హానీరధి గలఁగనట్లు హరియున్‌ రక్ష
స్సేనాధిపనానాస్త్ర వి
తానములకుఁ గలఁగ కుగ్రతరకోపమునన్‌
55
మ.అతిశీఘ్రంబున శారఙ్గ మెక్కిడి గుణంబాభీలతన్‌ దీటుచున్‌
శతధారాగ్రములై మనోజవములై సంవర్తతకాలానలా
ద్భుతకీలాభములై తనర్చు శరముల్‌ తోరంబుగా నేసినన్‌
శతశః ఖండములైరి రాక్షసవరుల్‌ సంగ్రామరంగంబునన్‌
56
కం.శ్రుతిదాఁక శరము లరిఁబో
సి తిగిచి హరి యేయ నసురసేనలఁబడియెన్‌
జతురంగంబులు దిలశ
శ్శతశః కణశస్సహస్రశః ఖండములై
57
ఉ.వాయువుచేఁ బ్రభూతమగు వానవలెన్‌ నిజశారఙ్గ ముక్తమౌ
సాయకజాత మద్దనుజసైన్యము ముంచిన నుత్సహించి నా
రాయణుఁడొత్తె నప్పుడు యుగాంతపయోధర ఘర్షణోదిత
స్ఫాయదభంగురాశనినిభధ్వనిధుర్యము శంఖవర్యమున్‌
58
శా.ఆ నారాయణ శంఖరాజరావ మిట్లత్యుగ్రమై విద్విష
త్సేనాధీశుల వీనులన్‌ దొరయ భీతిం జెంది సింహం బర
ణ్యానిన్‌ గర్జిల నేనుఁగుల్‌ బెగడు నట్లందంద మూర్ఛిల్లుచున్‌
దీనత్వంబునఁ ద్రెళ్ళుచున్‌ నలుగడల్‌ దృష్టించుచున్‌ స్రుక్కఁగన్‌
59
చం.గతులకుఁబాసె నశ్వములు గంధగజంబులు మూర్ఛిలెన్‌ రథ
ప్రతతుల త్రోవ కట్టువడె బన్నముఁజెందెఁ బదాతిజాతి య
ద్భుత విజయాంబుజధ్వనికిఁదోడుగఁగేశవుఁడార్చి సంగర
క్షితి యద్రువన్‌ దిశాకరులు చేడ్పడ శారఙ్గ గుణంబు దీఁటినన్‌
60
వ.వెండియు నక్కుండలీశశయనుండు గుండలీకృత కోదండమండిత కరుండయి గండుమిగిలి చండతరాఖండల మండలాగ్రనిభాఖండకాండ మండలాగ్రంబులన్‌ గొండలవలె దండిగల చండరాక్షసుల గుండెలన్‌ బగిలించుచుఁగండల నగలించుచుఁ గోదండంబుల ఖండించుచు దోర్దండంబులం దుండించుచు జోళ్లం జించుచుఁ గాళ్లం ద్రుంచుచుఁ బ్రక్కలం గ్రొచ్చుచు డొక్కల వ్రచ్చుచు నెమ్ముల రాల్చుచుఁ గొమ్ములఁ జీల్చుచు ఛత్రంబుల ఛేదించుచు గాత్రంబుల భేదించుచు మెడలం ద్రెంచుచుఁదొడల నొంచుచుఁ జేతికత్తుల ద్రోయుచు భీతచిత్తులం జేయుచుఁ గపోలంబుల నాస్ఫోటించుచుఁ గపాలంబుల నుత్పాటించుచు నరంబుల వదలించుచు శిరంబుల విదళించుచు భూషణంబుల నులుపుచు దూషణంబుల సలుపుచు ధైర్యంబుల నెంచుచు శౌర్యంబుల నడంచుచు ధ్వజంబులం జెడఁగొట్టుచు గజంబులం బడఁబెట్టుచుఁ దొండంబులఁ గోయుచు గండంబుల వ్రేయుచుఁ దేరుల కరుగుచు సూరెలఁ దిరుగుచు వీతుల వడిదీర్చుచు సూతులఁ గడతేర్చుచు యోద్ధలఁగిట్టుచు బాధలఁబెట్టుచు బిరుదులంబాపుచుఁ గఱదలం జూపుచు, నెక్కడఁ జూచినం దాన యై చుట్టుఁగైదువుం బట్టకయె దిట్టతనంబుతో బెట్టిదంబుఁ గనిపించునెడం బ్రళయోద్దండమార్తండమండలంబుననుండి నలుగడల నిండికొను కరమండలంబులమెండున నజాండో పరితరంగమాలికలవలనం దుఱంగలించునభంగతరోత్తుంగ తరంగమాలికల తెఱుంగున మహాగరుడార్పితగిరిగుహాకుహరసరణిం బఱతెంచుకాలసర్పంబుల దర్పంబునంగప్పు జిగి దలిర్ప నుప్పరంబునం గప్పుకొని మిగుల మెఱయు కారుమోగిళులవలన దిగు నగణితజలధారల తీరునం దద్విశిఖంబు లసంఖ్యాతంబులయి, నిశాటుల శరీరంబులు శోషింపంజేయుచు నమృతాశనవైరుల లోఁబఱచి ముంచుచుఁ జక్రిదూషకులమర్మంబులు నాఁటుచు ఘనవిపక్షుల శిరంబులపయిఁ దొరఁగుచు, మఱియు నరిదిగా నరిపుండకీరంబుల ఖండించుచు, గౌశిక ప్రతోషకరంబులై పరవాహినుల యుబ్బడంచుచు, నత్యంత సంతాపకరంబులయి యెదిరించివారి కమృత పదంబుఁ జూపుచు, గరుత్పరంపరాపరిణద్ధంబులై రుధిరంబు వెడలించుచు, నప్రదీప్రశిఖిశిఖాప్రతీపంబులయి ప్రతిపక్షబలంబులపయిం బ్రవహించు నప్పుడు, పద్మనాభుండు భద్రేభవరదుండు మీ రతని ధర్మంబుల మెలంగు చుండియు మమ్ము నొంచవచ్చుట మేరగాదని వారించుతీరున సంచలత్కరంబులయి ఘీంకరణంబు లొనర్చుచుఁ దదభిముఖంబుగా శరణాగతరీతిం బడుగంధ సింధురంబులకు హరి సారూప్యం బొసంగెనో యన, నూతనక్షతజధారాపూరంబులు గెంబట్టుఁబుట్టంబులుగాఁ గరాగ్ర పరిసరపతద్రథచక్రంబులు చక్రంబులుగా విమతవిగతవిజయ శంఖంబులు దొలిశంఖంబులుగాఁ గ్రిందఁ బడినవీరయోధ బాహుకాండంబులు శయనీకృత బిలేశయప్రకాండంబులు గాఁ జెలువొంద, నందుఁ గ్రందు సేయుచు భూతప్రేతవేతాళకూశ్మాండ బ్రహ్మరాక్షసపిశాచశాకినీడాకినీ గణంబులు దేవానురగణంబులవలె ద్వివిధంబు లయి, యాయూధాస్థి భూషణరజస్సికతాతలంబున నిలిచి, మహాసింధురబంధురకబంధ మంథాచలంబునడుమ నిడుదనరంబులు నూఱాఱు లొక్కటి సేసి గట్టిగాఁ జుట్టి, యిరుదెగలవా రిరుదెసలం బట్టి శోణితాంబుధి మథించుచుఁ, దన్మధ్యంబుననుండి శాకినీభూతంబు పొడవుగా నెత్తినముత్యాల గొడుగు గ్రొత్తగాఁ బొడమిన చంద్రుం డనియును, బ్రచ్ఛన్నంబుగా మునింగియుండి బయలుదేఱిన మోహినీభూతంబు లచ్చర లనియు, సంగహీనంబు గాని మత్త మాతంగశవంబునకు వెండియు రెండుకొమ్ము లిడి ప్రేతావేశంబునఁ బఱతేర నదియే చతుర్దంతదంతావళం బనియును, శ్వేతాశ్వశవం బుచ్చైశ్శ్రవం బనియును, విచిత్రవర్ణపతాకాకీర్ణపటచ్ఛత్త్రచామర శకలావికల రథస్తంభజాతంబు పారిజాతం బనియుఁ, గమనీయసౌందర్యలీలన్‌ బయలుపడిన కామిని యిందిరాకామిని యనియును, బ్రహ్మరక్షోధన్వంతరి స్థూలకపాలకలశంబునం దెచ్చినతరసతైలం బమృతరసం బనియును, నిబంధించి, తదర్థంబుగా నిరుదెసల పెద్దలును సన్నదులై పెద్దయుంబ్రొద్దు యుద్ధంబు సేయుకోలాహలంబుఁ గౌతూహలంబుఁగల్పింపఁగా వరించి, విరించిపట్టి విపంచిపట్టి బెట్టుగా బొట్టగీతంబులం దలపెట్టె, నట్టియెడ సజ్జగజెట్టి మహారణ్యంబు సొచ్చిన కార్చిచ్చు పెచ్చునం బ్రళయసముద్రంబు దొరసిన సంకర్షణాగ్ని బింకంబున మేఘజాలంబుపయి నడరిన ఝంఝానిలంబు వేగంబున సంధతమసంబుపయి నొలసిన మధ్యందిన సూర్యుశౌర్యంబున నవార్యక్రౌర్యంబుఁ జూపిన యాపురుషోత్తముదాపున నిలనోపక కకావికలై, భేరుండంబునకుం బాఱు శరంబుల రభసంబున, శరభంబున కులుకు కొదమసింగమ్ముల భంగంబునఁ, గొదమసింగంబున కుఱుకుఱుకు మత్త మాతంగంబుల ఘటలయటుల, మత్త మాతంగంబులకుం బఱచు వ్యాఘ్రంబుల శీఘ్రంబున, వ్యాఘ్రంబులకు వెఱచు కురంగంబుల తెఱంగున, నిలిచినచో నిలువక, యొండొరులం బిలువక, తిరిగి చూడక, పడినకత్తు లెత్తఁ జేతులాడక, హతశేషులైన దోషాచరులు విముఖులై లంకాభిముఖు లయి పఱచి రయ్యెడ61
కం.పాఱెడి రిపుల రణస్థలిఁ
బాఱెడి బహురుధిర నదులఁ బ్రతిబలములపైఁ
బాఱెడి శరములఁగని సొం
పారెడి మది శంఖ మొత్తె హరి యవ్వేళన్‌
62
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju