| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | దశగ్రీవాదులు బ్రహ్మను గూర్చి తపంబు సేయుట |
| సీ. | కమలగర్భుఁడు భక్తకామధేనువు నిక్కు - వంబుగా వత్సలత్వంబుఁ జూపుఁ బరమేష్ఠి యాశ్రిత పారిజాతము శ్రాంతిఁ - బాపి కావలసిన ఫలము లొసఁగు భారతీనాథుండు ప్రణతచింతామణి - రాతనం బూనియు రక్తి నెరపు చతురాననుండు దాససమీపమేరువు - గర్బురదాతృత్వగరిమ మించుఁ | |
| గీ. | దాత తాపసజనకామితప్రదాత పెద్ద వేల్పు మునిశ్రేణిఁ బ్రీతి నిల్పు నలువ యతివీక్షణాళులు నిలుచు కలువ యతని భజియింప మన కోర్కు లబ్బు టరుదె! | 161 |
| మ. | అని వాణీరమణీమనోహరుని మాహాత్మ్యంబు వర్ణించి య య్యనుఁగుందమ్ముల నిర్వురన్ ఘనతపస్యాసక్త చేతః ప్రవ ర్తన ధౌరేయులఁజేసి వారి సవిధారణ్యంబులన్ నిల్పి తా నును బ్రత్యేకవనాంతరంబునఁ బ్రశాంతుండై తపంబున్నెడన్ | 162 |
| సీ. | వనజకాననశోషకునకెంత కువలయ - పరితాపకృతి నాఁగఁ బ్రబలు తపను కరములు సోక భగ్గన మండు రవిరత్న - ముల తనుజ్వాలిక లొలసినపుడె చురచురఁగాలెడి శుష్కతృణశ్రేణి - సరణిఁ గన్పడు నికుంజములఁ దగులు మంటలు వెదురు జొంపములఁ బ్రాకి మహోగ్ర - మై తదంతిక భూరుహముల కెగసి | |
| గీ. | దరికొని వహించు నక్కాఁకఁ దాళలేక తెరలి మృగములు మృగతృష్ణ కరిగి సొరుగు మండువేసవిఁ బంచాగ్ని మధ్యమునను కుంభకర్ణుండు గావించె ఘోరతపము | 163 |
| కం. | ఇటు లెండకు వానకును త్కటతరమగు చలికి వెఱన్ కంపింపక వే సటఁబడక కుంభకర్ణుఁడు పటు నిష్ఠ ఘటించెఁదపముఁబదివే లేఁడుల్ | 164 |
| సీ. | కంటిచూపు జగంబు కంటిరూపు సజాతి - కద్యుతి కతన నైక్యంబు సేసి సర్వభూతదయా ప్రసన్నభావంబుతోఁ - దరలని నియమంబుఁ దగులుపఱచి యించుకించుక సందడించు కోరికలతో - వివిధేంద్రియ వికార వితతు లడఁచి ద్వంద్వముల్ సహియించు తాల్మి కంబంబుతోఁ - గడిఁది చిత్తేభంబుఁ గట్టివైచి | |
| గీ. | కమలషట్కంబు శోధించి కమలభవుని కమల పదములు దలఁచుచు గాఢశక్తిఁ దగ విభీషణుఁ డేక పాదమున నిలిచి యైదు వేలేండ్లు గావించె నతుల తపము | 165 |
| కం. | మఱి యైదువేల యేఁడులు దెఱచిన కనుమూయ కినుని దెసఁ జూచుచునే డ్తెఱ నూర్ధ్వబాహుఁడై మతి దఱుమక శ్రుతి నొడివికొనుచుఁదప మొనరించెన్ | 166 |
| మ. | ఎలుకల్ పిల్లులు నీలకంఠములు భోగీంద్రంబు లేణచ్ఛటల్ పులులున్ సింహము లేనుఁగుల్ శరభపాళుల్ గండభేరుండముల్ చెలిమింజెంది విభీషణాశ్రమమునం జెల్వొందు భూనాథ! యం దుల కుప్పొంగి నటింతు రచ్చర లమర్త్యుల్ పూలు వర్షింపఁగన్ | 167 |
| వ. | అని పలికి లోపాముద్రాధిపతి వెండియు రామభద్రున కిట్లనియె | 168 |