ఇతిహాసములు ఉత్తరరామాయణము పంక్తిముఖుఁడు వీరహోమంబు సేయుట
పంక్తిముఖుఁడు వీరహోమంబు సేయుట
సీ.అఖిలలోకాతీతమగు మహామహిమంబుఁ - బడయంగ నూహించి పంక్తిముఖుఁడు
విధిదేవతాకమై విలసిల్లు మంత్రంబు - జపియించుచును నిరశనతఁ దాల్చి
యొకకాలి పెనువ్రేలి నుర్విఁజక్కఁగ నిల్పి - సూర్యావలోకన ధుర్యుఁడగుచుఁ
దన హృదయాకాశమునఁ బితామహునుంచి - ధ్యానించి వేయేడులైన వెనుక
 
గీ.నగ్రమున మండు నుగ్రతరాగ్నిలోన
మునుకొని కరాసిఁ దలఁ ద్రుంచికొని సభక్తి
కముగ బ్రహ్మార్పణంబగుఁగాక యంచు
వీరహోమంబుఁ గావించె విస్మయముగ
169
మ.వికటాచారుఁ డతండు నిశ్చలమతిన్‌ వేయేండ్ల కొక్కొక్క మ
స్తకమున్‌ భేదమొనర్చి వేల్చు దమునస్సంభాసితార్చిం దదీ
యకరోటిప్రతతుల్‌ పటిల్లుమని వ్రయ్యంబుట్టు ఘోషంబజాం
డకటాహస్ఫుటనా ప్రచండతరమై నానాదిశల్‌ నిండఁగన్‌
170
శా.పౌలస్త్యార్పితకీకసాస్ర పల శుంభన్మస్తకప్లోషణ
స్థూలాభీల కరాళపావక శిఖాస్తోమంబు ధూమంబుతోఁ
బౌలోమీపతి ప్రోలుఁ జుట్టుకొనియెన్‌ భావిప్రవృద్ధాసురో
ద్వేలాస్త్రార్చులు తద్బలంబు విటు లుద్దీపించు నన్‌ పోలికన్‌
171
మ.ఉరునిష్ఠోగ్రదశాస్య నిర్మిత శిరోహోమక్రియాదగ్ధమే
దురమేదః పలాలాస్థి కైశిక మిళద్దుర్యాసనల్‌ భూనభోం
తరముల్‌ నిండఁగ సైఁపనోప కిఁక నెన్నండిచ్చునో వీనికిన్‌
వర మబ్జాసనుఁ డంచు నెంచు వినుత్రోవం బోవు దేవౌఘముల్‌
172
కం.కైకసి సుతుఁ డిటువలె ని
ర్వ్యాకులమతి దశసహస్రవర్షము లరుగన్‌
భీకరగతిఁ బదియవ తల
వీఁకం దెగఁదోసి వహ్ని వేల్వం దలఁచెన్‌
173
వ.అప్పుడు174
చం.గగనముమ్రోసె వీచె సుడిగాలి సముద్రము లింకె మేరువున్‌
దిగఁబడె భూమి - చక్రముగతిం దిరిగెన్‌ రవి త్రోవఁ దప్పె న
మ్మగలమగండు వీఁక దశమంబగు మస్తక ముత్తరించి వే
ల్వఁగడఁగి హోమవహ్నిఁ జటులంబుగఁ బ్రజ్వరిలంగఁజేసినన్‌
175
శా.ఆ పౌలస్త్య వివర్ధమాన ఘనహోమాగ్నిజ్వలజ్జ్వాలికల్‌
పైపైఁ బ్రాఁకిన దిక్పతుల్‌ యతులు విభ్రాంతాత్ములై సర్వలో
కాపూర్ణాధిపతిత్వసౌఖ్యనిధి బ్రహ్మం జేరి సేవించి స్వా
మీ! పద్మాసన! యార్తులన్‌ మముఁ గృపాదృష్టిన్‌ విలోకింపవే!
176
మ.దశకంఠాసురుఁ డగ్నిఁ దొమ్మిది తలల్‌ దావేల్చియున్‌ నేఁటిక
ద్దశమంబైన శిరంబువేల్వఁ గడఁగం దద్ధోమధూమచ్ఛటల్‌
దశదిగ్భాగము లావరించె నిఁకఁ బ్రత్యక్షంబు గాకుండితే
ని శిఖిజ్వాలలఁ గ్రాఁగు ముజ్జగములున్‌ నిక్కంబు వాణీశ్వరా!
177
ఉ.ఒప్పిదమైన నీ కరుణ నున్నతుఁడై మఱి మీఁదుగా జగం
బప్పిశితాశి యేఁచు, హవనానిల మిప్పుడె యేఁచఁబూనెడిన్‌,
జెప్పెడిదేమి? యింక నెడసేసినఁ దప్పగు, మీఁది బాధకే
మొప్పితి, ముగ్ర మవ్వికృతహోమము మాన్పఁగదయ్య చయ్యనన్‌
178
వ.అని భయోత్పాత విధూతచేతస్కులై చేతులు ముకుళించి ప్రార్థించు వేల్పుదొరల దరహాసవదనంబు దెరలం గనుంగొని మంచిదని సమ్మతించి, విరించి కాంచనమయకమలాసనంబు డిగ్గ నుఱికి యతి సత్వరంబుగ179
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju