| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కుంభకర్ణునకు నిద్రింప దశగ్రీవుం డొక యిల్లు గట్టించుట |
| చం. | విను మటుమీఁద బ్రహ్మ యొదవించిన నిద్దురమబ్బు కుంభక ర్ణుని మొగమాని జాగ్రదవరోధ మొనర్చినఁ బవ్వళింపఁగాఁ దనకొక యిల్లు గావలయు దానవనాయక! యంచు నన్నతో ననుటయు నాతఁ డప్పనికి నప్పుడ పంచె ననేకశిల్పులన్ | 292 |
| వ. | వారును దదాజ్ఞ శిరంబున ధరియించి తత్‌క్షణంబ | 293 |
| సీ. | చికిలి ప్రాఁగెంపు టిట్టికల గోడలు వెట్టి - వజ్రంపు గారలపనులొనర్చి మూలఱారాకంబములు పెక్కు జతసేసి - జాళువాప్రతిమల చాలొనర్చి తులకించు పవడంపు దూలముల్ పయినుంచి - పచ్చఱాపలకలు పాదుకొల్పి పులుదిండిఱా మొత్తముల లోవ లమరించి - స్ఫటికసోపానముల్ సంఘటించి | |
| గీ. | పుష్యరాగ వితర్దికల్ భూరిచంద్ర కాంతజగతులు గోమేధికపుఁ దలుపులు కళుకు ముత్యాల సోరణగండ్లు వేడ్క సేయఁ బడకిల్లు గట్టి రా శిల్పివరులు | 294 |
| కం. | ఆమడనర వెడలుపు మూఁ డామడ నిడివియును గలిగి యతిరమ్యంబై రామ! ఘటకర్ణు పటుని ద్రామందిర మలరు మృదుతల్పతతులతోన్ | 295 |
| వ. | అటుల ధవళప్రభాపహసిత కైలాసంబగు తన్నివాసంబున | 296 |
| సీ. | కిన్నరాదులఁ గిట్టి గెలుచునందోళంబు - మించఁ బల్మఱుఁ గల్వరించుకొనుచు దిక్కరుల్ సెవుడొంద దేవతల్ వెఱసెంద - బెట్టుగా గుఱకలు వెట్టుకొనుచుఁ గలలోన దిక్పాలకులమీఁదఁ జని మాఱు - కొనువారిఁ గని పండ్లుగొఱికికొనుచు సెలవుల లాలచిప్పిల నప్పటప్పటి - కించుకించుక చప్పరించుకొనుచు | |
| గీ. | మరలుచును బొర్లుచును మేనుమఱచి మిగులఁ జెమ్మటల దొప్పఁదోఁగుచు నిమ్మళించు నిబిడతామస సుఖమిచ్చు నిద్రఁ గలిసి కాలముఁ గ్రమించె నక్కుంభకర్ణుఁ డధిప! | 297 |