| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సప్తమాశ్వాసము |
| కం. | శ్రీ లలితమిత్రవిందా బాలామృదులోరు నిహిత పదపంకజ! భ ద్రా లోలలోచనా కచ కీలిత నవహేమదామ! కితవ విరామా! | 1 |
| తే.గీ. | అవధరింపుము, రామచంద్రావనీంద్ర వర్యుఁ డీ రీతి నవ్విభావరిఁ గ్రమించి కల్యమున లేచి సంధ్యాదికములు దీర్చి కొలువు సింగారమై సభాస్థలికిఁబోయి | 2 |
| సీ. | భరతాది సోదరుల్ ప్రణతులై యట నిల్చి - కనుసన్నఁ బనిచిన పను లొనర్పఁ బ్రేమ మీఱ వసిష్ఠ వామదేవాదికుల్ - మొనసి యాశీర్వాదములు ఘటింప స్వామి! పరాకు హెచ్చరిక హెచ్చరి కంచు - సారెఁ గంచుకులు హెచ్చరికఁ దెలుప మంత్రు లాశ్రితులు సామంతులు నెడనెడ - నెలమితోఁ బొడగని కొలువుసేయ | |
| గీ. | గములుకొని మన్నెదొర లూడిగము లొనర్ప హైమ సింహాసనంబుపై నధివసించి యుదయగిరి నిల్చు ప్రొద్దుతో నుద్దియగుచుఁ బెద్ద కొలువుండె దశరథు పెద్దకొడుకు. | 3 |
| తే.గీ. | ఇవ్విధంబునఁ గొలువుండి యినకులుండు మ్రోల నిలుచున్న లక్ష్మణు మోముఁజూచి యీవు మొగసాలకేఁగి యందెవ్వరేని మనవి గలదన్నఁ దోడితెమ్మనుచుఁబనుప | 4 |
| చం. | అతఁడు మహాప్రసాదమని యప్పుడె వాకిటి కేఁగుదెంచి యం దతినిబిడంబుగా నిలిచినట్టి ప్రజంగని రామధారుణీ పతి యపుడానతిచ్చిన సుభాషిత మందఱతోడఁ దెల్పినన్ క్షితిజను లెల్ల నాయనకుఁజేతులు మోడ్చి వచించి రింపునన్. | 5 |
| తే.గీ. | చంద్రుఁబోలిన శ్రీరామచంద్రు మోము గన్నులను జూడఁగోరు టొక్కటియ కాక యనఘ! పరిపూర్ణకాములమైన మేము విన్నపము చేయు మనవి యేమున్నదిపుడు. | 6 |
| సీ. | భద్రేభములయందె పాయని మదవృత్తి - మధుకరావళియందె మలిన గుణము చంచలాలతలందె చంచలభావంబు - చెలుల నెన్నడలందె యలస గరిమ మిథున సంగతు లందె మించు బంధములెల్ల - నల యర్ధచంద్రునియందె కొఱఁత కడిఁది పుట్టలయందె ఘనతరాహి భయంబు - లపరపక్షపు రాత్రులందె తమము | |
| గీ. | ప్రతిపదాదులయందె తీఱని ప్రదోష మాత్మవిదుల సమాధులయందె మఱపు గాని మఱి యెందు వెదకియుఁగానమయ్య! రఘుకులస్వామి పాలించు రాజ్యమునను. | 7 |
| సీ. | కాననంబులయందె కాదుగా సుమనోవి - లాస సంపద ప్రజలకును గలదు గంధసారమునందె కాదుగా సంతతా - మోదంబు భూజనమునకుఁగలదు గగనాంతరమునందె కాదుగా ఘనలక్ష్మి - తఱచుగాఁ బౌర సంతతికిఁగలదు కనకాంబరమునందె కాదుగా సుగుణసం - దోహాప్తి జానపదులకుఁగలదు | |
| గీ. | కలిత విక్రమ ధానుష్కకరమునందె కాదుగా ధర్మమిలనెల్లఁ గలదు రామ చంద్రుఁడెప్పుడుఁ బరిపూర్ణ చంద్రులీల రాజ్యమొనరింప నేమి కొఱంత? యనిన | 8 |