| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరామునితో భిక్షుతాడితమైన శునకము మనవిఁజెప్పికొనుట |
| కం. | ఆలించుచున్న నచటికిఁ గౌలేయకమొకటి వచ్చి కడువడి నెత్తిన్ గీలాలధార దొరఁగన్ దూలుచు మొఱసేయ లక్ష్మణుఁడు కని కరుణన్. | 9 |
| తే.గీ. | చేరఁజని యేల నీ వడి శిరమువగిలె? నిచట మొఱసేయుటకు నేమి హేతు వనిన నగతికులకెల్ల గతియైన యధిపుతోడఁ గాని నేఁదెల్పనని శునకంబు పలుక. | 10 |
| తే.గీ. | మంచిదని స్వామికడకు లక్ష్మణుఁడు పోయి వినయమునఁదొల్తఁబ్రజమాట వినికి సేసి వెనుక శునకంబు తెఱఁగును విన్నవింప మనుజపతి దానిఁదెమ్మన్న మరలనేఁగి. | 11 |
| మ. | పతి దోడ్తెమ్మనె నిన్ను రమ్మనినఁగంపంబూని భూదేవతల్ యతులున్ నిల్చు సభాస్థలంబునకు రమ్మంచున్ ననుంబిల్చుటే చతురత్వంబని సారమేయమనినన్ సౌమిత్రి యమ్మాటయున్ క్షితిరాణ్మౌళికిఁదెల్పఁదానె యరుదెంచెన్ రాముఁడచ్చోటికిన్. | 12 |
| కం. | అరుదెంచి నెత్తి నెత్తుటి వఱదల జొత్తిల్ల నగరి వాకిట వెతతో నిరవుకొనియున్న శునకముఁ బరికించి వచింపు మేల పఱతెంచి తనన్. | 13 |
| ఉ. | ఆ మృగదంశకం బనియె నర్కకులేంద్ర! యలర్కమేమి యిం దేమిటి కేఁగుదెంచినది యేటికిఁగొట్టుము నాక లీలనేఁ డీ మునులీ నృపాలమణు లిందఱుఁ గొల్వఁగ నిందు వచ్చినా వేమని నీ దయాదిక సమిద్ధగుణంబులు సన్నుతింపుదున్. | 14 |
| సీ. | జలధిబంధనవేళ బలవత్కపుల కన్న - మించఁగా నుడుత లాలించలేదె? శబరి యిచ్చిన పండ్ల చవి భరద్వాజుల - విందొక్క రీతి భావింపలేదె? శుకవామదేవాదులకు సమానముఁజేసి - యెలమిఁబక్షికి మోక్షమియ్యలేదె? హనుమంతుచే క్షేమ మరయుచో భరతు క - న్నను ముందు గుహు వేడఁ బనుపలేదె? | |
| గీ. | దొడ్డకొంచెంబులున్నవే దొరవు నీ క టాక్షమున కెవ్వఁడైనచో నాశ్రయింపఁ గదిసి రక్షించుటయె నీకుఁ గల గుణంబు రఘుకులక్షీరనిధిచంద్ర! రామచంద్ర! | 15 |
| చం. | హరిహయ వహ్ని దండి దనుజాబ్ధిప వాయుకుబేర శంభు భా స్కర రజనీకరప్రముఖ సర్వసుపర్వులుఁదావకాంశజుల్ హరివి పరాత్పరుండవు నృపాకృతి దుర్జన శిక్షసేయ ని ద్ధర నవతార మొందితివి ధన్యతఁజెందితి నిన్నుఁజూచుటన్. | 16 |
| చం. | నృపతికి సాధురక్షణ వహించుట ధర్మువు గాన నాదు వి న్నప మిక నాలకింపు జననాయక! యెవ్వరి కెగ్గు సేయ కే నెపుడుఁ జరింతు నీపురి నిదేమియొ నేఁడొక భిక్షుకుండు నన్ గుపితమతిన్ శిరం బవియఁగొట్టెఁబరా మరిసింపవే యనన్. | 17 |
| ఉ. | అక్కరుణాబ్ధి రామవిభుఁడప్పుడె భిక్షుకుఁబిల్వఁబంచి యీ కుక్కకు నీకు నేమి పగ? కోపముతోఁదల వ్రయ్యఁగొట్టినా వక్కట! విప్రవంశజుఁడవయ్యు దురాగ్రహశత్రు గెల్వలే వెక్కడి భిక్షుకత్వ మిదియేటి విరక్తి? యటంచు దూఱినన్. | 18 |
| తే.గీ. | అతఁడు కరములు మొగిచి యిట్లనుచుఁబలికె దేవ! భిక్షార్థ మింటింటఁ దిరిగి తిరిగి యలసి నే రాఁగ నిది వీథి నడ్డ మగుచుఁ దలఁగకున్నను గొట్టితిఁ దప్పు గలదు. | 19 |
| కం. | దండింపఁదగుదు నేనున్ దండింపుము నన్ను నీవు దండించినచో దండింపఁడింక మీఁదట దండి యనిన విభుఁడు తగిన దండన మరయన్. | 20 |
| కం. | కౌలేయక మిట్లనియెను గాలాంజనమనెడి గిరిని గల దేవళముల్ బాలింప నితనిఁబనుపుము చాలు నదియె దండమనిన జనపతి నగుచున్. | 21 |
| తే.గీ. | అతనికపుడె తదాధిపత్యం బొసంగి ప్రభుత నభిషేక మొనరించి భద్రగజము మీఁద నెక్కించి పంచిన మేదినీంద్రుఁ గాంచి మంత్రులు పల్కి రక్కజముగాఁగ | 22 |
| ఉ. | తప్పొనరించి విప్రుఁడు ముదంబున దుర్గవిభుత్వమొందె నం చిప్పురినున్న విప్రజనులెల్లను జేయుదురింక నిట్టులన్ దప్పులె యంచుఁబల్కఁబతి నవ్వుచు నిప్పని కీడొ మంచిదో చెప్పెడిఁగుర్కురం బని వచించిన భైరవుతేజి యిట్లనున్. | 23 |
| ఉ. | ఎంచఁగ నింతకంటెఁ గలదే యవమానము? దేవ! తొల్లి నే నంచిత విప్రవంశజుఁడనై యల దేవగృహాధిపత్యమున్ గాంచి తదన్నభుక్తిఁగొనికాదె వహించితి నిట్టి జన్మమున్ గొంచెమె దేవతార్థహృతి? కుక్కతనం బొదవింపకుండునే? | 24 |
| కం. | జనవర! దేవబ్రాహ్మణ ధనహరణ మహాఘదావదహనము వంశం బను వంశాటవిఁ గాల్పక చనునే? యెవ్వరికి దానిఁజనునె యొనర్పన్? | 25 |
| ఉ. | కోవెల పారుపత్తెమునకుం బనిఁబూనియు నేను సాధు సం సేవయు దీనపోషణముఁ జేసితిఁ గావున నీ భవంబునన్ భూవర! జాతి సంస్మరణమున్ వహియించితి గ్రూరుఁడిద్ధరా దేవుఁడు సత్క్రియాప్తిఁగడతేఱఁగలాఁడె? తలంచిచూచినన్. | 26 |
| కం. | అని జాతిస్మృతిగల యా శునకము రఘురాముఁబొగడుచున్ వలగొని వీ డ్కొని కాశికేఁగి యట నిర శనతం గృశియించి పిదప సద్గతిఁజెందెన్. | 27 |