ఇతిహాసములు ఉత్తరరామాయణము చ్యవనాదిమునులు రామునితో లవణాసురుని వృత్తాంతంబుఁ జెప్పుట
చ్యవనాదిమునులు రామునితో లవణాసురుని వృత్తాంతంబుఁ జెప్పుట
చం.అవనిపుఁడంత నెప్పటిక్రియన్‌ సభకేఁగి వసించునంతలోఁ
జ్యవన మరీచి కశ్యప దళాద పులస్త్య ఋచీక ముఖ్యమౌ
నివరులు వచ్చి వాకిటను నిల్చినఁజూచి సుమంత్రుఁడెంతయున్‌
జవమునఁబోయి యయ్యసురశత్రుని కంజలిఁ జేసి యిట్లనున్‌.
28
తే.గీ.స్వామి! యమునాతటారణ్యవాసులైన
చ్యవన ఋచికాది సంయమీశ్వరులు వచ్చి
వాకిటను నిల్చినారన్న - వడిగలేచి
వినయము భయంబు భక్తియుఁబెనఁగొనంగ.
29
కం.జడదారి యొడయులకు న
ప్పుడ యెదురుగఁబోయి పాదములకు వినతుఁడై
తొడి తెచ్చి యుచితపీఠము
లిడి పూజలొనర్ప వార లెల్లనువేడ్కన్‌.
30
తే.గీ.తాము తెచ్చిన పుణ్యతీర్థముల పావ
నోదకంబులు పక్వఫలోత్కరములు
జిత్తమలరఁగ నిచ్చి యాశీర్వదింప
నెంతయును వినతుఁడై రాముఁడిట్టు లనియె.
31
శా.ఆధుల్‌ దీర్పఁగ నోపు మీ చరణతోయంబుల్‌ శిరంబానె నా
నాధున్యంబువు లింకనేల? మిము సందర్శింపనౌ సత్ఫలం
బే ధన్యాత్మునిఁజేసెఁగావలయునే యీ పండు? లట్లైనచో
సాధూత్తంసములార! మీకు కరుణించన్‌ గాదనన్‌ వచ్చునే?
32
శా.నా సామంతచయంబు నా యనుజసంతానంబు నా దేహమున్‌
నా సర్వస్వము మీ యధీనము గృపన్‌ నన్నున్‌ గటాక్షించి నే
దాసేయత్వముతో నొనర్పఁదగు కృత్యంబుల్‌ ప్రబోధింపుఁడం
చా సర్వంకషబుద్ధి పల్క మును లత్యానందమగ్నాత్ములై.
33
ఉ.ఏ నృపులైన నీ కరణి నీ వినయోక్తులు పల్కనేర్తురే?
మానసమున్న వైఖరిని మాటలనాడెద వాక్యపోషకుల్‌
భానుకులీను లందఱును బ్రాహ్మణరక్షయు దుష్టశిక్షయున్‌
బూనియకాదె నీ విచటఁ బుట్టుట రామ! యటంచు నెంచఁగన్‌
34
చం.చ్యవనుఁడు పల్కె రామనృపచంద్ర! కృతంబున దైత్యవంశసం
భవుఁడు మధుండు నానొకఁడు భాసిలు, నాతఁడు ధర్మశాలియై
యవనిసురుల్‌ సురల్‌ సుగుణఁడంచు నుతింప నుదంచితప్రభన్‌
భువిఁజెలువొంది పెక్కుదినముల్‌ శివుఁగూర్చి తపంబొనర్చినన్‌.
35
ఉ.ఆ తపమిచ్చమెచ్చి శివుఁడాత్మజటాద్యుతి సాంధ్యరాగ ము
ద్ద్యోతితకాలకంఠరుచి తోరపుఁజీఁకటి దేహకాంతి చం
ద్రాతపమున్‌ సృజింప జగదద్భుతభంగి దృశింప నమ్మధుం
డాతతభక్తియుక్తి నతుఁడై నుతియించె ననేకరీతులన్‌.
36
ఉ.సోమకళాధరుండు తన శూలముచే మఱియొండు శూల మెం
తే మహిమన్‌ సృజించి యది దివ్యకృపన్‌ మధుచేతి కిచ్చి సం
గ్రామమునన్‌ రిపున్‌ గెలిచి క్రమ్మఱ నిన్నిది చేరునే కదా
నీ మది ధర్మ మే మఱిన నిక్కముగా ననుఁజేరు నావుడున్‌.
37
చం.మధుఁడది సమ్మతించి, స్మరమర్దికిఁగ్రమ్మఱ మ్రొక్కి, మత్కులం
బుధరఁ గలంతకాలమును ముమ్మొనకైదువు నిల్పవే దయా
నిధీ! యన, నీ సుతుండొకఁడు నీ వెనుకన్‌ ధరియించి దీనిచే
నధికతఁజెందు శూలధరుఁడైనపు డాతఁడజయ్యుఁడాజులన్‌.
38
కం.శూలంబు మఱచెనేనియు
వాలాయము వైరిచేత వాఁడు హతుండౌ
శూలంబెప్పటివలె మా
శూలములోఁగలయు ననుచు శూలి చనుటయున్‌.
39
ఉ.ఆ నరభోజి యంతట దశానను కూరిమి చెల్లెలైన కుం
భీనసి లంకఁజొచ్చి బలిమిం గొనితెచ్చి హితోక్తిఁబెండ్లియై
యా నలినాక్షియందు లవణాసురుఁడన్‌ గుటిలాత్ముఁగాంచె నం
భోనిధి కాలకూటవిషమున్‌ దొలి కాంచినలీల రాఘవా!
40
చం.కొడుకు దురాత్ముఁడౌటకు జుగుప్స వహించి మధుండు వానికిన్‌
మృడుని వరంబుఁదెల్పి, యతఁడిచ్చిన శూలమొసంగి, ధర్మ మె
ప్పుడు విడకున్న మంచిదని ప్రోలికిఁబట్టముఁగట్టి, నెమ్మదిం
బొడమిన తాపమంతయును బోవఁగ వారిధిఁజొచ్చె నత్తఱిన్‌.
41
కం.అది మొద లమ్మధు పుత్రుఁడు
మదమత్తుండగుచుఁ గలఁచు మాదృశమునులన్‌
మెదలఁగ నియ్యఁడు మనుజులఁ
ద్రిదశుల బాధించు నేమి తెలుపుదు మధిపా!
42
మ.హరు శూలంబు వహించినాఁ డనిన ధైర్యం బేదియే ధారుణీ
శ్వరులున్‌ వాని నెదుర్కొనన్‌ వెఱతు రస్మద్రక్షణార్థంబుగా
ధర మీరుండఁగ నెవ్వరేమిటికి? నేతత్కార్యమున్‌ నేఁడు దే
వరకుం దెల్పఁగ వచ్చిరీ మునులు ప్రోవం జెల్లు నాపన్నులన్‌.
43
చం.లవణపయోధిఁ గట్టి సబలప్రబలానుజ పుత్రమిత్ర బాం
ధవముగ రావణాసురవధం బొనరించిన మీకు లక్ష్యమే
లవణుఁడు? వీనిఁద్రుంచి వికలత్వముఁ జెందిన మానసంబు లు
త్సవజలరాశిఁ దేలెడి విధం బొనరింపఁ గదయ్య! నావుడున్‌
44
ఉ.ఆ రఘువీరవర్యుఁడు గృతాంజలియై మునులార! వాని కా
హారము లెవ్వి? యెక్కడ విహారము సల్పుచునుండు? నెట్టి యా
చారమునం జరించు? నది సర్వము దెల్పుఁడు వానిఁబట్టి సం
హారము సేయు టెంత పని? యన్న మహర్షులు పల్కిరందఱున్‌.
45
ఉ.నూఱు మదావళంబు లిరునూఱు హరుల్‌ పదివేల దుప్పు లా
ర్నూఱు పసుల్‌ సహస్రచమరుల్‌ కిటి లక్షయు నొక్కపూఁట కా
హారము వానికిన్‌ మధువనాంతరమే విహరించు తాన మా
చారము గ్రూర మంచితవిచారము దూర మటంచుఁ దెల్పినన్‌.
46
కం.లవణుని శౌర్యము రఘుపతి
లవమునకుం గొనక మౌనులన్‌ గని యింకన్‌
లవణు వధింతు నవశ్యము
భవదార్తి హరింతు ననుచుఁబల్కి ప్రియమునన్‌.
47
కం.భరతుని నల శత్రుఘ్నునిఁ
గరుణా కలితేక్షణములఁ గనుఁగొని మీ యి
ద్దఱలో నెవ్వఁడు లవణునిఁ
బరిమార్పంగలఁ రటన్న భరతుఁడు వల్కెన్‌.
48
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju