| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | జానకి వాల్మీక్యాశ్రమంబునఁ గుశలవులం గనుట |
| మ. | ధరణీపుత్రియు నాఁటి రాతిరి శుభస్థానంబులన్ సద్గ్రహో త్కరముల్ నిల్వఁగ వంశదీపకులఁ బుత్రశ్రేష్ఠులంగాంచె ని ర్వురఁ దత్సంభవవేళఁ బూలు గురిసెన్ మ్రోసెన్ దివిన్ దుందుభుల్ దొరసెం జల్లని గాడ్పు నల్గడల సంతోషించి రచ్చో ఋషుల్ | 96 |
| కం. | మునిసుతులు వచ్చి రయమున నినవంశ్యుని దేవి సీత యిద్దఱు సుతులం గనియె నని విన్నవించిన విని వల్మీకోద్భవుండు వేడుకతోడన్ | 97 |
| మ. | యశమున్ విద్యయు భాగ్యమున్ బలము దీర్ఘాయుష్యముం గాంతు రీ శిశువుల్ పుట్టినవేళ మంచిదనుచున్ శీఘ్రంబుగాఁబోయి త త్కుశలార్థంబుగ నమ్మునీశ్వరుఁడు రక్షోనాశమంత్రస్ఫుర త్కుశసంఘంబు లవంబు నించి జటిలస్తోమంబుతో నిట్లనున్ | 98 |
| కం. | ఈ కుశలవముల మార్జన మా కొమరుల కాచరింపుఁ డందున రక్షో నీకాదిక భయ మడఁగును జేకుఱు శుభమనిన నటులఁ జేసిరి వారల్ | 99 |
| కం. | కుశమార్జితుఁడగు సుతునకుఁ గుశనామము లవజలములఁ గుశలి యయిన యా శిశువునకు లవసమాఖ్యయుఁ బ్రశమనిధి యతండొనర్చెఁ బ్రఖ్యాతముగన్ | 100 |
| కం. | చంద్రార్కుల గతి నింద్రో పేంద్రులవలె నాశ్వినుల రహిన్ కుశలవు లా సాంద్రతపోధన శాలి ద యం ద్రాసము లేక వెలసి రత్యుజ్జ్వలులై | 101 |
| కం. | పుత్రోదయము ధరిత్రీ పుత్రీక్షేమంబు నత్తపోనిధి దెలుపన్ శత్రుఘ్నుఁడు విని యౌరా శ్రోత్రములు ఫలించెననుచు సొంపు వహించెన్. | 102 |
| చం. | హరిహయదిగ్వధూమణియు నంత విభాకరుఁగాంచె లక్ష్మణా వరజుఁడు నిత్యకృత్యము లవారితనిష్ఠ నొనర్చి యమ్ము నీ శ్వరునకు మ్రొక్కి యాయన యొసంగెడి దీవన లొంది చెచ్చెరం జరమదిశాభిముఖ్య విలసత్పదవిన్ జనియెన్ జయార్థియై | 103 |
| చం. | చని చని యేడునాళ్లకు రసాసతి గట్టెడు నీలిపుట్టమో యన హరినీలశైవల శశాంక కళంక కురంగనాభికా భినవ విభా ప్రభావములఁ బెంపగు భానుజఁ జేరి యన్నదిన్ మునిఁగి కృతార్థుఁడై చ్యవనముఖ్యుల నక్కడఁగాంచి వేడుకన్ | 104 |
| కం. | వారికి మ్రొక్కి ప్రియంబున వారిచ్చు ఫలాదికముల వారని క్షుత్తున్ వారించి గతశ్రముఁడై యా రాతిరి చ్యవనుతోడ నతఁడిట్లనియెన్ | 105 |