| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | మాంధాత లవణాసురునిచే మృతుండైన కథను చ్యవనుడు శత్రుఘ్నునకుఁ జెప్పుట |
| మ. | అనఘా! యా లవణుండు మేటియని మీ రానాఁడు మా స్వామితో ననఁగా నేనును వింటి నైన శివదత్తాభీలశూలంబుచే ననిలో నెవ్వరినైన వీఁడడఁచెనే? యా చందముల్ గల్గినన్ వినిపింపందగు నన్న నా చ్యవనమౌనిశ్రేష్ఠుఁ డిట్లం చనున్ | 106 |
| కం. | అన్నా యా లవణాసురు సన్నాహముతోడఁ గదియఁజని శూలముచే మున్నాజిఁబడిన రాజుల నెన్నంగా శక్యమే ఫణీంద్రునకైనన్ | 107 |
| కం. | వచ్చిన నృపు లీతనిచేఁ జచ్చిన నృపు లెందఱో యసంఖ్యు లదేలా? మచ్చరమున లవణునిచే నొచ్చెన్ మాంధాతయును, వినుము వివరింతున్ | 108 |
| మ. | యువనాశ్వుండను రాజనందనుఁడు ధైర్యోదాత్తహేమాద్రి శా త్రవ శిక్షా క్షమ విక్రమ క్రముఁడు మాంధాతృక్షితీశుండు ము న్నవనీనాథుల నెల్ల గెల్చి సురలోకాధ్యక్షు నిర్జించి య ద్దివముం జేకొన నెంచి దండు వెడలెన్ దీవ్యత్ప్రతాపంబునన్ | 109 |
| కం. | వెడలి కడవన్నె గుబ్బలి గడిచి దివికి మించి రాఁగఁ గాంచి మొగుల్ త త్తడిజో డతని జయించుట కడు భరమని యెఱిఁగి వచ్చి కపటమతి ననున్ | 110 |
| ఉ. | ఇమ్ముల భూమి శాత్రవుల నెల్ల జయించికదా సమర్థతన్ మమ్ము జయింప రావలయు మానవనాయక! నీ కజయ్యుఁడై యమ్మధుపుత్రకుండు లవణాసురుఁ డుండఁగ నెట్లు వచ్చినా విమ్మెయి వాని గెల్వకయె యింద్రునిపై నన రాజు సిగ్గునన్ | 111 |
| ఆ.వె. | వానిఁ దాఁ కి పిదప వచ్చెద నీ వీటి కనిన నటులఁ జేయు మనుచు నింద్రుఁ డరిగె నాకమునకు నవనీంద్రుఁ డలుకతో మధువనంబు కడకు మసలకేఁగి | 112 |
| చం. | ఉపవనవీథి దండు దిగి యుద్ధతితో నొక దూత నంపినన్ గుపితమనస్కుఁడౌ లవణు కొల్వునకుం జని వాఁడు వానిచే నపహృతకాయుఁడయ్యె, నృపుఁడంతట నంతకుమాడ్కిఁ బేర్చి య చ్చపలునిఁ జేరఁబోయి దనుజాతకులాధమ! పోర రమ్మనన్ | 113 |
| చం. | గంధేభంబు నెదుర్చుకేసరివలెన్ గర్జింపుచున్ వాఁడు గ ర్వాంధత్వంబున శూల ముద్దవిడి వ్రేయన్ దచ్ఛిఖల్ గప్పినన్ బంధువ్రాతముతో నమాత్యతనుజాప్తశ్రేణితో సేనతో మాంధాతృక్షితినాయకుం డపుడె భస్మంబయ్యె నొక్కుమ్మడిన్ | 114 |
| ఉ. | కావున వాఁడు ముమ్మొనలకైదువుఁ బూనినవేళఁ బోరికిం బోవకుమీ నృపాలసుత! మున్నె సమస్తముఁ దెల్పినాఁడు రా మావనిభర్త దెల్పవలెనా యిఁక మేమును? రే పవశ్యమున్ నీవు జయింతు వా లవణునిన్ నిదురింపుము నేఁడు నావుడున్ | 115 |
| కం. | ఆ శత్రుఘ్నుఁడు చ్యవనుని పేశల భాషల ముదంబు బెరయుచు నిద్రా వేశముఁ జెందెడి నంతఁ గు శేశయహితుఁ డుదయశిఖరి శిఖరముఁ జేరెన్ | 116 |
| ఉ. | అంతకు మున్నె లేచి యతఁడాహ్నిక కృత్యము లెల్లఁ దీర్చి య త్యంతదయా ప్రసన్నులగు నచ్చటి మౌనులకెల్ల మ్రొక్కి వా రెంతయు వేడ్క శత్రుని జయింపు మటం చనుపన్ శరాస దు ర్దాంత కృపాణతూణములు దాల్చి కళిందజ దాఁటి చెచ్చెరన్ | 117 |
| కం. | మాధవు దేవికి నిరవగు మాధవపుర మెదుటఁ జూచి మది ధైర్యంబున్ గ్రోధముఁ బెనఁగొన నుపవని యోధాగ్రణి యతఁడు వేచియుండెడి వేళన్ | 118 |