ఇతిహాసములు ఉత్తరరామాయణము శత్రుఘ్నుండు లవణాసురునితోఁ బోరుట
శత్రుఘ్నుండు లవణాసురునితోఁ బోరుట
మహాస్రగ్ధరరవి పూర్వగ్రావముం జేరకయె మునుపు సారంగసింహాశ్వవిద్వి
డ్గవయ క్రోడాది జంతుగ్రసన విలసనాకాంక్ష గేహంబు వాసెన్‌
వివిధారణ్యాళి డాసెన్‌ వెలయు మెకములన్‌ వేనవేలన్‌ హరింపన్‌
లవణక్రవ్యాది శ్రాంతి న్మసలక మరలన్‌ వచ్చె మధ్యాహ్న మైనన్‌
119
సీ.సందిళ్ల నిఱికిన సమదేభ శార్దూల - ఘోణులఁ బలుమాఱుఁ గొఱికి కొనుచుఁ
బలు పచ్చి పొల నుండి సెలవుల దిగజాఱు - నల్ల నాలుక సాఁచి నాకికొనుచు
మదమత్త చిత్తుఁడై పదఘట్టనలచేతఁ - జెట్టులఁ బడ బిట్టు మెట్టుకొనుచు
దేవతల్‌ డయ్యంగ దిక్కులు వ్రయ్యంగ - నప్పటప్పటికిఁ గీలార్చుకొనుచు
 
ఆ.వె.నెదురులేక యూరి కేతెంచు మధుపుత్రు
ఘనతనూ నిరుద్ధ కమల మిత్రు
నతికరాళవక్త్రు నగ్ని జ్వలన్నేత్రుఁ
జూచి లక్ష్మణానుజుండు గినిసి
120
స్రగ్ధరడాచేతన్‌ మించుకోదండమున గుణరవాడంబరం బొందఁ జేయన్‌
నీచుండా దైత్యుఁ డల్కన్‌ నెగడు శిఖి శిఖల్‌ నేత్రకోణంబు లానన్‌
జూచెం బ్రోద్దీర్ఘ బాహున్‌ శ్రుతిపథగత చక్షుఃపయోజున్‌ శిఖావ
ద్రోచిస్తుల్యాస్త్రపూర్ణోద్ధుర శరధిని శత్రుఘ్ను శత్రుఘ్ను నంతన్‌
121
ఉ.చూచి, కరాళవక్త్రుఁ డగుచుం గడు బెట్టుగ నవ్వి త్రోవలో
వేచి కరంబునందు నొక విల్లునుఁ దూపులుఁ బూనియున్న నిన్‌
జూచిన నాజికిం దొడరి శూరతఁ జూపఁగ వచ్చినట్టులం
దోఁచె భవాదృశుండొకొ యెదుర్కొని నన్ను జయించువాఁ డనిన్‌.
122
ఉ.ఈ వెడబుద్ధి నీకె జనియించెనొ? యే జడుఁడైనఁ దెల్పెనో?
హా! విధిఁ ద్రోయ నీకు వశమా? లవణాసురు బారిఁ బడ్డవా
రీవర కెవ్వరైన మనిరే? యిఁక నూర్వురు బ్రహ్మ లాఁగినన్‌
జావక పోదువోటు? కొనసాగునె నీ విలువిద్య లిచ్చటన్‌?
123
కం.దినమును మెకముల యెఱచిన్‌
దినిన యరుచి వాయనేఁడు దినఁగలిగెఁ గదా
మనుజాధమ! నీ మాంసం
బని పలికెడు లవణుఁ జూచి యౌడు గఱచుచున్‌
124
కం.కటతటము లదరఁ గన్నులఁ
జిట చిట నిప్పుకలు చెదరఁ జిలుప చిలుప చె
మ్మట లొడలఁ గడలుకొన న
క్కుటిలునకు సుమిత్ర పిన్నకొడు కిట్లనియెన్‌
125
ఉ.ఈ వొక పోటుబంటువలె నెన్ని దురుక్తులు ప్రేలె దోరి! దు
ర్భావ! మదించి మున్పటి నృపాలుర యట్లనె నన్‌ దలంచితో?
రావణుఁ బుత్ర మిత్ర నికరంబులతో ననిఁ ద్రుంచినట్టి రా
మావనినాథు తమ్ముఁడ! కృతాంతుఁడ నింకెటు వోయె దింతటన్‌?
126
శా.శత్రుఘ్నాఖ్య యథార్థమై రహి వహించన్‌, దేవ భూదేవతల్‌
విత్రాసస్థితిఁ జెంద రింక సమరోర్విన్‌ నేఁడు ఖండించి నీ
గాత్రం బిచ్చటి కంకగృధ్రములపాల్‌ గావింతుఁ గుంభీనసీ
పుత్రా! దుష్టచరిత్ర! నిల్వు మనినన్‌ భూరిక్రుధావేశుఁడై
127
శా.ఆ రక్షోవిభు డార్చుచున్‌ బళిర! లంకాధీశు మన్మాతులున్‌
బోరం గూల్చిన రాము సోదరుఁడవే! పొమ్మైన నా కోర్కి యీ
డేఱెన్‌ నిన్‌ భవదగ్రజాప్త హితకోటిన్‌ గూడ నేఁ డంతకుం
జేరం బంచెద నిల్వు మంచుఁ బురికిన్‌ శీఘ్రంబునం బోవఁగన్‌
128
మ.అలుకన్‌ లక్ష్మణు తమ్ముఁ డడ్డమయి యౌరా! యోరి దోషాట! మా
ర్పలుకుల్‌ పల్కి జుణింగిపోయెదవు, రారా! నిన్ను శత్రుఘ్నుఁ డి
క్కలనన్‌ గూల్పక యేల పోవిడుచు? బింకం బాడి భీరుండవై
తలఁగన్‌ నవ్వరె లోకు ? లంచుఁ దెగడన్‌ దర్పించి వాఁడుద్ధతిన్‌
129
చం.పలికిన పల్కులోరి జనపాలకులాధమ! యాత్మ నిల్పరా!
కలిగెడిఁ దత్ఫలం బనుచు గ్రక్కున బాహువు లప్పళించుచున్‌
గిలకిల నార్చుచున్‌ జెలఁగి కేరుచు నొక్క విశాలసాల మ
గ్గలమగు బల్మితోఁబెఱికి కైకొని వక్షము దూయ వైచినన్‌
130
కం.అదరక శత్రుఘ్నుం డది
పది తునియ లొనర్చెఁ బంచభల్లప్రహతిన్‌
మదమెత్తినటుల వాఁడును
వదలని రోషమున వృక్షవర్షము గురిసెన్‌
131
చం.కురిసెడు వృక్షవర్షమునకున్‌ వెనుదీయక భానువంశజుం
డురుతరసాయకత్రయము నొక్కమొగిన్‌ నిగిడించి యార్చినన్‌
గురిసెడి నౌర! నీ విశిఖకోటుల సాలము లంచు నశ్మముల్‌
గురిసె విరోధి వజ్రశరకోటి నడంచె నతండు గ్రమ్మఱన్‌
132
కం.వే నా భారము ద్రుంచం
గానీ భార మనినట్లు కంటకుఁడు వడిన్‌
నానా తరువులు వైచిన
మానక యతఁడడఁచె నిమిషమాత్రములోనన్‌
133
కం.తుమురైన శిలలు పొళ్లును
గుమికొని తుత్తునియలైన కుజశకలములున్‌
సమరోర్వి నిండికొనెఁ ద
త్సమయంబున సమసె నచటి సాలము లెల్లన్‌
134
ఉ.చేరువ చెట్టు లెల్ల సరిసేసి నిశాటుఁడు భానుజాసరి
త్తీరమహీరుహావళులు దెచ్చుఁ బయింబడవైచుఁ గ్రమ్మఱన్‌
దూరము వోవ నేడఁ బురి దూఱునొ వీఁ డని యక్కుమారుఁడున్‌
సారెకు రామదత్త ఘనసాయకమేయఁ దలంచుచుండఁగన్‌
135
ఉ.అంతట నేమఱించి లవణాసురుఁ డొక్క కుజంబుఁ దెచ్చి దు
ర్దాంతరయంబునన్‌ శిరముఁ దాఁకఁగ వ్రేయ నతండు నొచ్చి వి
భ్రాంతివహించి మూర్ఛిలె సురల్‌ మునులున్‌ బెగడొంది రప్సరః
కాంతలు జాలిఁ జెందిరి జగంబులు కంపముఁ బొందె నయ్యెడన్‌
136
చం.అది మృతిగాఁ దలంచి రిపుఁ డార్చుచు నేటికి శూలమింక? న
న్నెదిరిన వైరి సచ్చెనని యెల్ల మృగంబుల భూరిమాసముల్‌
ముదమున మెక్కుచున్న యెడ మూర్ఛదొలంగినఁ గన్ను విచ్చి పే
రుదుటున లేచె లక్ష్మణసహోదరుఁ డుత్సవమందె లోకముల్‌
137
వ.ఇత్తెఱంగున మూర్ఛఁ దేఱి, యింద్ర జిద్వీరారి కూరిమి తోఁబుట్టువు దనకట్టె దుట బలుచట్టులుం బలుచెట్టులు బట్టుకొని, పదఘట్టనల నిలాతలం బిట్టట్టు వడఁ బఱతెంచు చున్న మధుదైత్య పట్టబద్ధుపట్టిన్‌ గనుంగొని, వీరరౌద్ర రసంబు లతో నంగ మంతంతకు నుప్పొంగఁ, బ్రళయకాలాంతకు తెఱంగునం గనిపించి, నిటలతటంబున వికటతరంబుగాఁ గుటిలభ్రూకుటి ఘటిల్లఁ దటిల్లతాపటలచటుల ద్యుతులకు దండ యగుకోదండంబునారి సారించి, నిమిష మాత్రంబును సైరించక, వైరించనహయచంచద్గరుదంచల చంచలానిభవిభా ప్రపంచ వంచ నాచుంచు ప్రాంచితకాంచనసంఘటిత పుంఖప్రభాధురీణంబును, నరీణ తేజోవిభవాధిక మధుకైటభ ప్రముఖనిఖిల బర్హిర్ముఖకంటకకంఠలుంఠన క్రియాచమత్క్రియాభినుత్యశైత్యసంపత్ప్రఘాణంబును, సకలభువనగ్రసన వ్యసనాత్యుదాత్త లీలావిలోల కాలమృత్యుకరాళవక్త్రాభీలదంష్ట్రాంకుర ప్రమాణంబును, బ్రమాణప్రభావ వైభవాధఃకృతచక్రశూలాదినానాదేవతా శ్రేణిపాణికృపాణంబును, నగు నా రావణాంతకప్రసాదాసాదిత దివ్య బాణంబు వెడలం దిగిచి, లవణాసురుప్రాణంబు లపహరించుగుణంబున గుణంబునుం గూర్చిన, శతకోటిమార్తాండ మండలోద్దండతరకిరణస్ఫురణలఁ గ్రేణి సేయు తదఖండిత (మండిత) రుఙ్మండలంబు దిఙ్మండలంబు నిండుకొని మెండు కొని చూడం గూడక చూపులకు మిఱుమిట్లు గొల్పుటయు, ననల్పకల్పక్షయా క్షయ్యతరాశుశుక్షణిజ్వాలికామాలికలో యని భీతు లయి, గరుడగంధర్వ సిద్ధవిద్యాధరాదిదేవతలు దేవతాజ్యేష్ఠుం డగు పరమేష్ఠికడకున్‌ జని, వినతులై యి ట్లని విన్నవించిరి.138
మ.జగముల్‌ మ్రింగెడి రుద్రు తేజమొ? జగత్సంహారఘోరాగ్నియో?
జగదుద్యాపన భాస్కర ప్రభయొ? నా శత్రుఘ్నబాణార్చి ము
జ్జగముల్‌ కాల్చు తెఱంగునన్‌ వెలిఁగెడిన్‌ సర్వేశ! యింకే విధం
బగునో? లోకము లుద్ధరింపఁగదవే యన్నన్‌ విధాతృం డనున్‌.
139
మ.భయమేలా? సురలార! తొల్లి హరి యా బాణంబుచే దైత్యరా
ట్జయముల్‌ పెక్కు వహించె నవ్విశిఖమే శత్రుఘ్నుఁడున్‌ బూని దు
ర్జయలీలన్‌ లవణున్‌ వధించు నిఁక మీ సంతాపముల్‌ మానుఁద
ద్దయు సౌఖ్యంబు వహించు నన్నఁజని రుత్సాహంబుతో దేవతల్‌
140
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju