| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శత్రుఘ్నుఁడు లవణాసురుని సంహరించి తత్పురంబు సేరుట |
| మ. | అల శత్రుఘ్నుఁడు నివ్విధంబునను దివ్యాస్త్రంబు సంధించి పే రలుకన్ దైత్యుని ఱొమ్ము లక్ష్యముగ నేయన్ జ్వాలికల్ దిక్కులన్ వెలయన్ శత్రుని ఱొమ్ముఁ దూఱి యిలయున్ భేదించి పాతాళవా సులకున్ భీతి యొనర్చి గ్రమ్మఱఁ బొదిన్ జొచ్చెన్ సురల్ మెచ్చఁగన్ | 141 |
| కం. | బాణము వెడలినయప్పుడె ప్రాణంబులు వెడల దనుజపతి పవనహత క్షోణీధ్రము వలెఁ గూలెన్ క్షోణీస్థలి జగములెల్లఁ జోద్యముఁ జెందన్ | 142 |
| తోటకవృత్తము | ఇలపై లవణాసురుఁడిట్లొఱుఁగన్ గలకాలము వాని యగారమునన్ వలనొప్పెడు ముమ్మొనవాల్ శివుచే నలువొందెడు శూలమునన్ గలసెన్ | 143 |
| క్రౌంచపదము | తావులు మీఱఁగఁ బూవుల వానల్ - దఱచుగఁగురియఁగఁ దతఘనభేరుల్ గ్రేవల మ్రోయన్ గేవల గీత - క్రియలను వనితలు గిఱికొనియాడన్ దేవతలెల్లన్ ఠీవిఘటిల్లన్ - స్థిరమతిఁ గొలువఁగ దివిజ విభుండున్ బావకముఖ్యాశా విభుయుక్తిన్ - బగతుని నడఁచిన ప్రభుఁ గనవచ్చెన్ | 144 |
| తే.గీ. | అపుడు బ్రహ్మర్షి దేవర్షు లాదియైన ఘనులు శత్రుఘ్ను దీవించి కౌతుకమున రావణుని సంహరించిన రాముఁ బొగడి నటులఁ బొగడిరి, దేవేంద్రుఁ డతని కనియె | 145 |
| పణవవృత్తము | తీఱెన్ మౌనుల దిగు లివ్వేళన్ జేరెన్ మాకున్ జిరసౌఖ్యంబుల్ దేఱెన్ లోకుల దినగండంబుల్ మీఱెన్ నీ బలిమి యమేయంబై | 146 |
| కం. | నచ్చితిమి నీ ప్రతాపము హెచ్చితిమి భవద్దయా సమృద్ధిని నిన్నున్ మెచ్చితి మొక వర మియ్యఁగ వచ్చితి మనఘాత్మ! యడుగవలయు నటన్నన్ | 147 |
| మ. | అల శత్రుఘ్నుఁడు శక్రముఖ్యులకు సాష్టాంగంబు లర్పించి యం జలి గావించి, మహాత్ములార! భవదంచత్పాదముల్ గొల్వఁగాఁ గలిగెన్ జాలదె? యైన నిమ్మధునిప్రోల్ గన్గొన్నఁ దొల్లింటికం టె లస త్సంపద మీఱఁ జేయు తమి పుట్టెన్ గల్గ నిండట్టులన్ | 148 |
| మ. | అనినన్ నీవు దలంచినట్టు లతిరమ్యంబై ధరాస్వర్గమో యన నింపొందెడు నిప్పురంబనుచు వా రంతర్ధిఁ జెందన్ ముదం బున శత్రుఘ్నుఁడు శత్రుసంహరణ మా ప్రొద్దే రఘుస్వామికిన్ వినిపింపన్ దగు వారిఁ బంచి హితమంత్రిశ్రేష్ఠు లేతెంచినన్ | 149 |
| ఆ.వె. | వారి నాదరించి వచ్చిన సేనలఁ గలిసి విజయ సూచకంబులైన పటహ గోముఖాది బహుళ వాద్యంబులు బోరు కలఁగ మధుని పురము సొచ్చె | 150 |
| తే.గీ. | చొచ్చి యచ్చోటి ప్రజలకు సొంపెసంగ నిర్జనంబైన మధుని మందిరముఁ జేరి ధనమణి సువర్ణ వస్తు వాహనము లెల్లఁ జేకొని, సునీతి రాజ్యంబు సేయుచుండె | 151 |
| వ. | అప్పుడు | 152 |
| సీ. | దివస ప్రభుశతప్రధితభా ప్రచయ దీప్ర - కనక ప్రచుర వప్రగణము గలిగి ఘనయూధ పథరోధ కలనా ధరిత భూధ - రసుధా ధవళ సౌధరాజి గలిగి నరఖేచర విలోచన ముదాచరణ సూచ - కమణీచయ కృతాచలములు గలిగి సుపచేళిమ ఫలాళి శుకశారి సమదాళి - ఘనకేళి వనపాళికలును గలిగి | |
| గీ. | రంగదుత్తుం గతర గోపురములు గలిగి కలిత గృహవర్గ విపణిమార్గములు గలిగి వికచకల్హార హారి దీర్ఘికలు కలిగి పొంచె శత్రుఘ్నువలన నప్పురవరంబు | 153 |
| కం. | బేహారులు మిత సత్య వ్యాహారులు వచ్చి నిలిచి వలసిన వస్తు వ్యూహములు నింపి రప్పురి నా హరిదశ్వాన్వవాయు నాదృతివలనన్ | 154 |
| మ. | తనప్రోల్ స్వర్గమె యంచు నందఱును సందర్శింప ధర్మస్థితిన్ జనులం బ్రోచుచు, లేమియుం దెవులు కృత్సంతాపముం దాప మె వ్వనియందుం గనిపింప కెల్ల ప్రజలున్ వర్ధిల్లఁ బండ్రెండు హా యనముల్ రాజ్యముసేసి రామపద వీక్షాకాంక్షియై యంతటన్ | 155 |