| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శత్రుఘ్నుండు శ్రీరామపాదసేవార్థియై అయోధ్యకు మరలి చనుట |
| మ. | సుగుణాంభోధుల మంత్రిపుంగవుల నచ్చోనుంచి యంచన్మతిం దగు వారిన్ దన వెంటఁ బెట్టుకొని రత్నస్యందనారూఢుఁ డై నగరావాసుల నెల్ల వీడ్కొని ప్రయాణవ్యాప్తిఁ గొన్నాళ్లకున్ మిగులన్ వేడుకఁ జేరె నా ఘనుఁడు వాల్మీక్యాశ్రమ స్థానమున్ | 156 |
| తే.గీ. | చేరి వాల్మీకులకు నతుల్ చేసి యాతఁ డంచి తాశీర్వచస్స్ఫూర్తి నాదరించి యిచ్చు నర్ఘ్యాదికములు గ్రహించి శ్రాంతి దొరఁగి పరిజనయుక్తి శత్రుఘ్నుఁ డలరె | 157 |
| ఉ. | అమ్మునిచంద్రుఁడంత దయ నాతనిఁ గన్గొని పల్కె నెల్లలో కమ్ముల కుక్కుముల్లయిన కంటకునిన్ దృణలీల నొక్క బా ణమ్మునఁ గూలనేసితి వనంతభుజాబలశాలి వెంచఁగా నిమ్మహి నీకు సాటిగలరే? శరకౌశలి లక్షణానుజా! | 158 |
| ఉ. | ఇంకొకనాఁటికిన్ లవణుఁడీల్గునె లోకుల బాధ తీఱునే? శంక దొఱంగి వీని ననిఁ జంపెడి శూరుఁడు భూమిఁబుట్టునే? యంకిలిలేక యుండుదుమె? యంచుఁ దలంపుదు మా తలంపు నీ వంక ఫలించెనేఁడు బుధవత్సల! నిన్ను నుతింప శక్యమే? | 159 |
| ఉ. | రావణుఁ ద్రుంచునాఁడు రఘురామునకున్ బహుళప్రయత్నముల్ గావలసెన్ దశాననునికంటె మహోద్ధతుఁడై యనేకులన్ భూవరులన్ హరించిన రిపున్ నిమిషంబునఁ ద్రుంచెనంచు న ద్దేవసభన్ సురేంద్రుఁడె నుతింపఁ గ వింటిమి నీ ప్రభావముల్ | 160 |
| చం. | లవణునితోడ నీ వవికలస్థితిఁ బోరెడువేళ మేము వా సవుకడనుండి చూచితిమి సర్వము నీ ధృతి యింత యొప్పునే? యవునవు నీకుఁ జెల్లు నని యక్కునఁ జేర్చి శిరంబు మూర్కొనెన్ బ్రవిమలచిత్తుఁ డత్తపసి పంక్తిముఖాంతకుఁ బిన్న తమ్మునిన్ | 161 |
| చం. | ఇటువలె నాదరించి జటిలేశ్వరుఁ డాప్తబలాధిభూసుకృ ద్భటయుతుఁడైన యాతనికిఁ బక్వఫలాదులఁ దృప్తిఁ జేసి చెం గటి యుటజంబునన్ నిలువఁ గా సెల విచ్చిన నక్కుమారుఁ డ చ్చట వసియించె భృత్యు లుపచారములన్ శ్రమమున్ హరింపఁగన్ | 162 |
| వ. | అయ్యవసరంబున | 163 |
| సీ. | ఉరుసుధా రసధార లొలికెడు చందాన - సరసస్వరస్ఫూర్తి సంఘటిల్లఁ దిన్నగాఁ దావిపూదేనె సోనలు మించు - విధమునఁ దానముల్ విస్తరిల్లఁ గండ చక్కెర పానకమ్ములు ప్రవహించు - రహి ఘనరాగముల్ రక్తి గులుక విరివియై చెఱకుపాల్ వెల్లువవాఱెడి - క్రమమున నాలాపగతులు వెలయఁ | |
| గీ. | గవలు కవవీణె లూని ద్రాక్షా ఫలోప మాన మానిత వాల్మీకి మౌని రచిత చారు రామాయణ శ్లోక సమితి గాన లీలఁ బఠియింప శత్రుఘ్నుఁ డాలకించి | 164 |
| కం. | ఆ మధురార్థ నిగుంభన లా మృదువర్ణానువృత్తు లా పదసంద ర్భామిత కౌశలి యా వా క్ప్రామాణ్యము నెంచి యతఁడు పరవశుఁడయ్యెన్ | 165 |
| కం. | పరవశుఁడగుఁ దెలియున్ గ్ర మ్మఱ విని తలయూఁచు నింత మాత్రము సీతా వరపుత్రు లిత్తపోనిధి కరుణన్ మనిరిగద! యనుచుఁ కౌతుక మొందున్ | 166 |
| చం. | అతని నిజాప్తు లద్భుతరసాబ్ధి మునింగి నిజంబొ స్వప్నమో క్షితి నిటువంటి గానములు సేయఁగ వింటిమె వీరలెవ్వరో యతివరుఁ జేరి వేఁడఁదగు నయ్య? యనన్ బరమాద్భుతంబు లి య్యతివరు పాల నున్నయవి యారయ నెంతటి వారమంచనెన్ | 167 |
| కం. | శత్రుఘ్నుఁ డిటుల సీతా పుత్రుల గానమును వేడ్కఁబొంది వినుచు నా రాత్రి గడపె నర్ధక్షణ మాత్రముగా నంత భానుమంతుఁడు వొడిచెన్ | 168 |
| చం. | దివసముఖోచితక్రియలు దీర్చి మునీంద్రుఁ డనుజ్ఞనీయఁగా సవినయవృత్తి వీడుకొని సైన్యముతోఁజని లక్ష్మణానుజుం డవిరళవేగలీల రవి యంబరమధ్యముఁ జేరు నంతకున్ రవికులనాథుఁడేలెడి పురంబు గనెన్ నయనోత్సవంబుగన్ | 169 |
| వ. | ఇత్తెఱంగునం గనుంగొని యభంగహర్ష తరంగితాంతరంగంబునం బురలక్ష్మికిఁ గరాంబుజంబులు ముకుళించి, సముచిత ప్రకారంబునం బ్రవేశించిఁ | 170 |
| సీ. | సామజ హయభటస్యందనావళులతో - నెడనెడ సామంతు లెదురుకొనఁగ భూసురాశీర్వాద పుణ్యనాదములతో - వందిమాగధుల కైవార మొలయఁ గమనీయ ఘృణిమణి కంకణక్వణనలై - చెలులు మేడలనుండి సేస లొలుక నబ్జమండల పాండురాతపత్రములతో - ముందర బలుటెక్కెములు రహింపఁ | |
| గీ. | బౌరు లాడాడఁ బొడఁ గని ప్రస్తుతింపఁ బటహ బహు వాద్య రవముతోఁ బ్రజల యులివు మీఱ మొగసాల ముందఱఁ దేరు డిగ్గి శిరముపై నంజలి ఘటించి నరగ నతఁడు | 171 |
| చం. | కొలువున కేఁగి రామనృపకుంజరు పాదయుగంబు మస్తకం బొలయఁగ మ్రొక్కి శత్రుపురినుండియుఁ దెచ్చిన దివ్యరత్నరా శులు దగు కాన్క సేసి పరిశుద్ధమతిన్ గరముల్ మొగిడ్చి చూ పులు ఫలియింప స్వామి మొగముం గనుఁగొంచటనిల్చియిట్లనున్ | 172 |
| ఉ. | దేవర యాజ్ఞ శత్రుని వధించి తదీయపురం బుదంచిత శ్రీ విలసిల్లఁ జేసి పదిరెండు శరత్తులు వాసి యుండితిన్ గావున మీ పదాబ్జములు గన్గొన వచ్చితిఁ దాళ శక్యమే యావును బాయు క్రేపు వలె నచ్చట నొంటిగ నిల్చి నావుడున్ | 173 |
| సీ. | నగుచుఁ దమ్మునిఁ జేరఁ దిగిచి కౌఁగిటఁ జేర్చి - వసుధేశుఁడను నేల వగపు వత్స ! యరి శిక్షయును ధరా పరిరక్షయును జేయ - కూరకుండఁగ క్షత్రియునకుఁ దగునె? యుచితకృత్యము మాన్ప నోడి యుండుట గాక - నినుఁ బాసి మేమైన నిలువఁ గలమె? వలసినయపు డిందు వచ్చి తల్లుల మమ్ముఁ - జుట్టాల మిత్రులఁ జూడరాదె? | |
| గీ. | తామసింపక సప్త రాత్రములు మాత్ర మిచట వసియించి పురి కేఁగు మింత తడవు రాజు లేకున్న రాజ్య మరాజకమగు ననినఁ బతియాజ్ఞ శిరమున నతఁడు పూని | 174 |
| చం. | భరతుని లక్ష్మణుం గదిసి భక్తి నతుల్ ఘటియించి వారి యా దరణముఁ గాంచి ప్రేమమునఁ దల్లుల కెల్ల నమస్కరించి త త్పర మహితోక్తులం దనరి బంధుల నాప్తుల మిత్రులన్ ధరా మరుల యథోచితక్రియల మన్ననఁ జేసి యనంతరంబునన్ | 175 |
| చం. | ఇనకులుఁ డానతిచ్చినటు లేడు దినంబులు నిల్చి యవ్విభుం డనుమతి సేయఁగాఁ బయనమై జననీబుధ బంధుకోటి వీ డ్కొని భరతుండు లక్ష్మణుఁడుఁ గూర్మిని వెంబడి వచ్చి పంపఁ జ య్యన నతఁ డయ్యెడన్ సబలుఁడై చనియెన్ నిజరాజధానికిన్ | 176 |
| కం. | ఈ శత్రుఘ్నుని కథ యే ధీశాలులు వినిన హితమతిన్ జదివిన స త్కౌశలి వ్రాసిన శత్రువి నాశనమగు రాజ్యమును ధనమ్ములుఁ గలుగున్ | 177 |
| ఉ. | అల్లవణారి యిట్లు చని యాత్మపురీజను లుల్లసిల్ల సం ఫుల్లమనస్కతన్ ధరణిఁ బ్రోచుచు విశ్రుతకీర్తియుక్తి రా గిల్లియు నర్హభంగి శ్రుతకీర్తి మనోరథపూర్తి సేయుచున్ క్షుల్లకులార్తిఁ బెంచు భయజూర్తి పడన్ దగె ధర్మమూర్తియై | 178 |
| ఉ. | అక్కడ నక్కడాని మల యంతటి ధైర్యముఁ బూని రామభూ భుక్కుల చక్రవర్తి క్రతుభుక్కులు సర్వసుదృక్కులున్ సుమ స్రక్కుల సాధు వాక్కులఁ బ్రసన్నతతో నిగిడింప సత్క్రియా భాక్కులుగా ధరా జనులఁ బాలన సేసె సదృక్కు లౌనన్ | 179 |
| సీ. | శ్రుతిమర్మము లెఱింగి సుస్థిరాంతర్యాగ - విమలులై బ్రహ్మ భావమున మించి యధిగతధర్ములై యరినాశ మొనరించి - యాశలు గెలిచి బ్రాహ్మణులఁ గొలిచి పరమార్థవంతులై సురుచిరాష్టాంగసం - గతి గాంచి రాజయోగము వహించి తగు శాస్త్రములు నేర్చి ద్వంద్వసహిష్ణులై - తెలిసి మహార్యసేవలు ఘటించి | |
| గీ. | బ్రాహ్మణ క్షత్రి యోరవ్య భటులు యోగి జనులవలె మించ జగతి ప్రశస్త సస్య వతి యయి ఫలింప నెల మూఁడు వానలెచ్చ రాజ్య మొనరింపుచుండె శ్రీరామవిభుఁడు | 180 |