| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | వృద్ధ విప్రమిథునంబు మృతకుమారుని రామునివాకిట వైచి విలపించుట |
| చం. | కతిపయమాసముల్ చన నొకానొకనాఁడసకృద్విలాప వి స్మితజన మశ్రు వారి పరిషిక్తకపోల మురువ్యధాభరా నత మొక వృద్ధ విప్రమిథునంబు మృతుండగు పిన్నపాపనిన్ వితమఱి కొంచువచ్చి రఘువీరుని వాకిట వైచి దీనతన్ | 181 |
| కం. | హా! సుకుమార! కుమారక! హా! సుగుణ నిధాన! నీకు నర్హం బటరా గాసి పడఁ జేసి మమ్మున్ బాసి చనఁగ నేమి తప్పు పాటిలెఁ జెపుమా! | 182 |
| చం. | మతిగల నిన్నువంటి సుకుమారశిరోమణి మమ్మువంటి దు ర్మతులకు నేల దక్కు? బహుమాత్ర సపర్యలొనర్చి యెల్ల దే వతలను గొల్చి నిన్నుఁ గని వంశము నిల్చెనటంచునేము న మ్మితి మెద, ని న్నకాలమున మృత్యువు మ్రింగు టెఱుంగమో సుతా! | 183 |
| ఉ. | ఎక్కడఁ జొత్తు? మేది తెరు? వెవ్వరు దిక్కగువారు? లింక నో చక్కని తండ్రి! పాదజలజంబుల గజ్జెలు మ్రోయ ముందు మా చక్కి నటింతు విప్పు డొకసారియు నాడవు మాటలాడ వా మక్కువ యెందుఁ బోయె? క్షణమాత్రములో నెటకేఁగి తియ్యెడన్? | 184 |
| ఉ. | అక్కట! యైదు వర్షముల యర్భకుఁ డెక్కడ? మృత్యువెక్క? డే దిక్కున నిట్టి వింత గలదే? తలిదండ్రుల కౌర్ధ్వదైహికం బెక్కడఁ బుత్రులుండి ఘటియింపుదు రాత్మజశోకవహ్నిలోఁ బొక్కుచుఁ దండ్రి సేయునొకొ పుత్రునకున్ దహనాదికృత్యముల్ | 185 |
| కం. | శిష్టనుత ధర్మనిధి జన తుష్టికరుఁడు రాముఁ డచ్యుతునకెనయండ్ర దృష్టాంతము పుత్రక! నీ దిష్టాంతమువలనఁ దెలిసితిమి మృష యనుచున్ | 186 |
| మ. | ధర వర్ణాశ్రమధర్మ రక్షణము వేదప్రోక్తమార్గంబునన్ ధరణీనాథుఁ డొనర్పఁ డేని నతఁడా ధర్మచ్యుతింబుట్టు ని ష్ఠుర పాపంబులకెల్ల నెల్లయగు నెచ్చో రాజదోషంబునన్ దొరయున్ భూజనకోటి కిట్టు లపమృత్యువ్యాధిబాధావళుల్ | 187 |
| వ. | అని సతీయుతుండై పరాసుండగు సుతుని మీఁదం బడి ధరాసురుండు విలపించి ఖరాసురాంతకు నుద్దేశించి మఱియు నిట్లనియె | 188 |
| ఉ. | ఆసురభీకరుం డినకులాగ్రణి రాముఁడు రాజ్యమేలఁగా భూసురబాలకుండు మృతిఁ బొందె నటం చను మాట వాసితో నీ సహజన్ము లాశ్రితులు నిన్ను భజింపఁ జిరాయు రున్నత శ్రీ సుఖయుక్తి రాజ్యమొనరింపుము సొంపున రామభూవరా! | 189 |
| కం. | ఇక్ష్వాకు వంశజులు శౌ ర్యక్ష్వేళగ్రీవు లవని నరయఁగ శిశుమృ త్యుక్ష్వేళ విన రమోఘ ప్రక్ష్వేళన! నీ తరమునఁ బాటిలె నదియున్ | 190 |
| ఉ. | సత్యము ధర్మమున్ దయయు క్ష్మాపతి దాల్చిన నిట్లు బాలురన్ మృత్యువు సెందునే? యిఁక నదేటికి? బాలుని కగ్నికృత్య మౌ చిత్యమె మేము సేయుట? త్యజించెద మీ వెత దీఱఁ బ్రాణముల్ హత్యలు మూఁ డునుం బొరసి యయ్య! సుఖింపు మటంచు నాడఁగన్ | 191 |
| కం. | ఆ పలుకులు విని భయపరి తాపపరీత్ముఁ డగుచు దాశరథి కృపా కూపారుండా పాఱుని పాపని బ్రతికించు తమి సభకు వచ్చి వెసన్ | 192 |
| కం. | హితులఁ బురోహితుల మహీ పతుల మహామతులఁ గృతుల భాతృ సుహృత్సం తతుల గుణాన్వితుల నిజా శ్రితులం బిలిపించి చింతఁ జేయుచునున్నన్ | 193 |
| సీ. | సంవర్త జలరాశి జానుదఘ్నంబుగా - మనిన మార్కండేయ మునివరుండు ఫాలలోచనునితోఁ బ్రతిఘటించి పదాంబు - జమునఁ గన్గొన్న గౌతమతపస్వి నిస్సంశయజ్ఞాననిధులలోఁ దొలుతఁ గీ - ర్తింపఁగాఁదగు వామదేవమౌని భక్తి ప్రపత్తి సంపత్తియు గానవై - శారద్యమును గన్న నారదుండు | |
| గీ. | మఱియు జాబాలి కాశ్యప మందపాల కణ్వకాత్యాయనాత్రి మౌద్గల్య భృగు వ సిష్ఠ ముఖ్యులు శిష్య ప్రశిష్య సహితు లగుచు వచ్చిరి రఘువరు నాత్మ యెఱిఁగి | 194 |
| కం. | సభయు లయి లేచి రప్పుడు సభఁ గలవా రెల్ల రామచంద్రుండును ద త్సభ నమ్మునిరాట్పదముల కభివందన మాచరించి యానందమునన్ | 195 |
| కం. | ఉచితాసనముల నునిచి స ముచితార్చా విధు లొసంగి యుచితజ్ఞుండై రుచిరానన శశిబింబ ప్రచురతర సుధాయమానభాషల ననియెన్ | 196 |
| చం. | అరుదుగ గోచరింపని పదార్థములైన మనఃప్రబోధ వి స్ఫురణల మీరెఱుంగుదురు పుణ్యతపోనిధులార! యీ ధరా మరుని కుమారుఁ డేమిటికి మ్రందె? నధర్మము లెట్టుచెందె నీ ధరణి? ననన్ యథాతథ సుధా మధురోక్తుల నారదుండనున్ | 197 |
| మ. | అవనీదేవతలెల్ల నంచితతపస్యాసక్తియున్ సత్త్వ మా త్మవివేకంబు వహింపఁ గాఁగృతము ధర్మస్ఫూర్తి మించున్ జిరా యువు నారోగ్యము లెప్పుడుం గలిగి భూయోధైర్య గాంభీర్యవై భవయుక్తిం ప్రజ యొప్పు నయ్యుగమునన్ బాణకృతోర్వీసుతా! | 198 |
| సీ. | ఆ కృతయుగమున నలరుఁ జతుష్పాద - చారియై ధర్మంబు జనవరేణ్య! త్రేత సత్యపదంబు తెగి పదత్రయగామి - యగు క్షత్రియుల తపం బపుడు తఱుచు తమ తపోమహిమల ధరణీజనులఁ బ్రోతు - రాయు రారోగ్య భాగ్యములు గలుగు ననృతముల్ పల్కుదు రచ్చటచ్చట జనుల్ - బుధులు మాత్రము బొంకు బొరయ రందు | |
| గీ. | ద్వాపరంబున సగఁబాలు ధర్మ మేఁ గు నందు ద్విజరాజ శుశ్రూష లాచరించి వైశ్యులు తపంబొనర్తు రవార్య నిష్ఠ నది విపర్యాసమై తోఁప దయ్యుగమున | 199 |
| కం. | కలియుగమునఁ బాదత్రయి తలఁగును ధర్మంబు శూద్రతపములు తఱుచౌఁ గల వెన్నియైన వింతలు దలఁప ననర్హంబు లా యధర్మము లధిపా! | 200 |
| శా. | ఆలా గిప్పుడు శూద్రుఁ డొక్కఁడు తపోవ్యాసక్తి నీ భూమిలోఁ జాలన్ నిష్ఠ వహించె నందువలనన్ జచ్చెన్ ధరాదేవతా బాలుం, డా కుటిలాత్ముఁ జంపి శిశువున్ బ్రాణాన్వితున్ జేయు మిం కేలా కాలవిలంబ మీక్షణమె లెమ్మిక్ష్వాకువంశాగ్రణీ! | 201 |
| కం. | పాపాత్ముల దండింపని క్ష్మాపతి కా పాపమునను షడ్భాగము సం ప్రాపించుఁ గాన ధరలోఁ బాపము లేకుండ నరసి ప్రజఁ బ్రోవఁ దగున్ | 202 |
| ఉ. | ఈయెడ రాజనీతి వచియించితి నింతియ యొక్కసారి రా మా! యని నిన్నుఁ బేర్కొనినయంత ననంతములైన పాపముల్ పాయఁగ నీకుఁ జేకుఱునె పాపము లీ ద్విజపుత్త్రు జీవితున్ జేయుట యెంత? తొల్లి కపిసేన ననిన్ బ్రతికింపవే కృపన్! | 203 |