ఇతిహాసములు ఉత్తరరామాయణము రాముఁడు శంబుకుఁడను శూద్రతపస్విం జంపి బ్రాహ్మణబాలుఁ బ్రతికించుట
రాముఁడు శంబుకుఁడను శూద్రతపస్విం జంపి బ్రాహ్మణబాలుఁ బ్రతికించుట
వ.అని పల్కు నారదుపల్కు లాకర్ణించి, యాకర్ణాంతలోచనుం డగునయ్యహ ల్యాశాపవిమోచనుండు నిండుమనంబున నప్పని యొప్పికొని, తన చెంగట నున్న లక్ష్మణు నుపలక్షించి, నీవు పోయి యీక్షణంబున క్షోణీసురుని మనః క్షోభంబు నివారించి, తత్పుత్త్ర దేహంబు సుగంధతైలకటాహంబుకుక్షిని నిక్షేపించి, సురక్షితంబు గావించునది యని నియోగించి, కించిన్నిమీలిత నయనుం డయి, హృదయబిసపుష్పంబునఁ దనపుష్పకంబుఁ దలంచినంత, ననంతానంతమణి ప్రభారమణీయపద్మ రాగమణి ప్రభాచ్ఛవిచ్ఛటాచ్ఛా యాచ్ఛాదిత దశదిశావకాశంబై, గగనతారకాయమాన ప్రసూననికాయ మానఘుమఘుమాయమానం బగునవ్విమానంబు సాక్షాత్కరించినన్‌ గటాక్షించి, ప్రహర్షించి, మహర్షి జనంబులకు నమస్కరించి, విరించిసము లగువారియ వారితాశీర్వాద వచనవైభవంబునం బ్రాభవంబు లొంది, త దామంత్రణంబు గావించి, పురరక్షణంబునకు భరతలక్షణుల నియమించి సమంచితతపః క్రియాసమున్నిద్రశూద్ర శీర్ష చ్ఛిదాచికీర్షాదురాధర్షా మర్షహర్షోత్కర్షం బవధరించి, కవచంబు ధరియించి, కవదొనలు బిగియించి, ఖడ్గంబు సంగ్రహించి, కార్ముకం బవలంబించి, జాతిమగరాతిమొత్తంపుఁ గ్రొత్తముత్తెంపుఁ జెక్కడంపుఁ బనిడంబునం బ్రకటం బగు మకుటంబు తళత్తళలు వియత్తలంబు హత్తికొన, నుత్తుంగతరదివ్యయానలలామంబు సుమంత్రాదిమంత్రి జనసమేతంబుగా నధిరోహించి, ధరావరారోహాభ రావహమహాంజనాచల సదృశాంగసమంజసాంజనాభిధకుంజరేంద్ర సాంద్రమదధారాధోరణీరణద్‌ భ్రమరఝంకారరవాభోగం బగు పశ్చిమ దిగ్భాంబుఁ బరిశోధించి, సురావరోధ వధూనివహ విహరణోచిత రచితాఖర్వ సార్వభౌమాత్యఖండగండకం డూతిమన్మత్త వేదండఘర్షి తోద్దండ గండోపలప్రకాండమండిత హిమవత్పర్వత సార్వభౌమ హైమ ప్రభామండలపిచండిలం బగు నుదగ్ధరామండలంబు దొరసి, యవరవర్ణు నక్కడ నెల్ల నరసి, యరసి, దిక్కూల ముద్రుజసముల్లోలకల్లోల మాలికాకీర్ణ కలశార్ణవ కర్ణేజపవర్ణ వర్ణితైరావత దంతావళచతుర్దంతి దంత తంతన్యమాన కాంత కాంతిరమాసమాక్రాంతం బగు శచీకాంతుదిగంతంబు డాసి, దృగంత వీక్షా పరంపర వెదచల్లి, యచ్చోట విపర్యాసతపశ్చర్యా నియమధుర్యునిం బొడగానక, గానకళాచతురోపరిభాగ చరద్వైమానిక మానినీశ్రేణికాశ్రూయ మాణవీణా రవంబు లాలింపుచు, నిజవిమాన రాజవిరాజమాన రాజమణి ఘృణిమతల్లికా వల్లిక లెల్లకడలను నల్లికొన, నబ్బల్లిదుండు సర్వంకషశేముషీ ధురీణసర్వోర్వ రాగీర్వాణసర్వదాప్రకల్పితనదీ స్నాన సంధ్యాజపానుష్ఠాన నిష్ఠుర తపోనిష్ఠా గరిష్ఠతా శ్రేష్ఠతరాశ్వత్థతరు ప్రణామపురస్సర ప్రదక్షిణం బగుదక్షిణంబునకుం బఱతెంచి, గిరిప్రాంతంబులు పరికించి, సరిత్తటంబులు విమర్శించి, పురోపవనంబులు పరామర్శించి, సరోవరంబుల పరీక్షించి, యరణ్యంబు లవలోకించి, తపోవనంబు లన్వేషించి, జనపదంబు లుపలక్షించి, ఘనపథంబులు నిరీక్షించి, గోకులంబులు తిలకించి, కోవెలలు వెదకి, పక్కణంబులు నెమకి, పానీయశాలలు చూచి, మఠంబు లరయం బంచి, మఖశాలలం దర్శించి, యగ్రహారంబులు గనుంగొని, యన్ని దేశంబులఁ బొడగని యరయక, మఱియు నందంద మెలంగుచు, నమందసిందూరచారుశోణప్రభా స్తోమధురీణతా వామవామన సింధురంబుడంబున బంధురంబై కన్నులపండు వగునిండుజేగుఱుచాయల దండిని మెండుకొనునొక కొండదండఁపుండరీక షండరోచిః కాండపాండురత రతరంగమాలికా డోలికావిహరమాణమరాళి కాపాలికా కేళికాసారంబగుకాసారం బొకటి కనుంగొని, తన్మధ్య ప్రదేశంబును.204
శా.శ్రీరామక్షితి నాయకాగ్రణి నిరీక్షించెం గృశాంగున్‌ నిరా
హారున్‌ శోణజటాచ్ఛటాధరు మహోగ్రాచారు నేకాగ్రతా
పారీణాత్ము నధోముఖున్‌ భసిత శుంభ త్పాండురశ్రీనిధిన్‌
ధీరత్వాకరుఁ జీరధారు నొకనిన్‌ దీవ్యత్తపస్యాన్వితున్‌
205
కం.వీక్షించి నివ్వెఱఁ గు వడి
యా క్షితికిన్‌ డిగ్గి వాని కపరోక్షగతిన్‌
సాక్షాత్కరించె సాక్షా
దక్షరతత్త్వంబు శూద్రుఁ డల్పుఁడె తలఁపన్‌
206
చం.ఇటువలె నత్తపో-ధికుని దృష్టిపథంబున నిల్చి రాముఁ డో
పటు నియమాఢ్య! యే శుభము వాటిలఁ జేసెద వీ తపంబు దు
ర్ఘట మిది నీవు విప్రుఁడవొ రాజవొ? వైశ్యుఁడవో? వివేకవి
స్ఫుటమతి మించు శూద్రుఁడవొ? బొంకక తెల్పుము కల్గినంతయున్‌
207
కం.నాపేరు రాముఁడందురు
భూపాలుఁడ దశరథేంద్రు పుత్రకుఁడను నీ
తాపసనిష్ఠ గనుంగొన
నీ పాలికి వచ్చినాఁడ నినుఁ దెల్పు మనన్‌
208
చం.కరము వినీతి వాఁ డను నగణ్యగుణాబ్ధివి నీవె వేడఁగా
హరిహరి యెట్లు బొంకుదు? యుథార్థము శూద్రుఁడ శంబుకాఖ్యుఁడన్‌
నరవర! బొందితోనె సురనాయకు లోకముఁ జెందుకాంక్ష దు
ష్కరమగు నిట్టి బల్‌ తపముఁ గైకొని చేసెద నంచుఁ దెల్పినన్‌
209
కం.విని యింత వినయ వంతునిఁ
జనునే హింసింప? రాజ జన్మము నింద్యం
బని రోసి, వెన్క భూసుర
తనయు మృతిఁ దలంచి కినుక దయఁ బెడఁ బాపన్‌
210
చం.కలకల నవ్వుచున్‌ నృపశిఖామణి హొన్ను గనీబులోని యి
ట్టలపు మెఱుంగు చాయల బెడంగు కటారి జరీన దూసి మం
త్రులు గన శూద్రు మస్తము కఱుక్కునఁ ద్రుంచెఁ దదీయరక్త మ
జ్జలజవనంబు ముంచె దివిషత్సుమవర్షము భూమి మించఁగన్‌
211
మ.అమరేంద్రాగ్నియమాది దిక్పతులు సిద్ధాదిత్యగంధర్వ సా
ధ్యమరు త్కింపురుషుల్‌ ఋషుల్‌ రఘుకులాధ్యక్షాగ్రభాగంబునన్‌
బ్రమదంబొప్పఁగ వచ్చి నిల్చి పటువాక్ప్రౌఢిన్‌ బ్రశంసించి రం
త మరుత్వంతుఁ డనెన్‌ బురాహృతసుధాధారానుసార్యుక్తులన్‌
212
ఉ.విప్లవముల్‌ హరించి పృథివీ భర మీవు భరింప శోకపా
రిప్లవతా వికారములు రీణము లయ్యె భవత్కృపాణ ధా
రాప్లవపూతుఁడై వృషలుఁ డంగముతో దివికేఁగెడిన్‌ సురా
నుప్లవవృత్తి వాఁ డదె కనుంగొను మయ్య! దశాననాంతకా!
213
ఉ.క్షుల్లకులన్‌ వధించి పరిశుద్ధుల నేలెడు మిమ్ము మెచ్చి నేఁ
డెల్ల సురల్‌ వరం బొకటి యిచ్చెద మంచుఁ దలంచి వచ్చినా
రుల్లమునందుఁ గావలసియున్న యభీష్టముఁ దెల్పుఁ డన్న భూ
వల్లభుఁ డుత్సహించి సురవర్యుల కంజలిఁ జేసి యిట్లనున్‌
214
చం.కరుణ వరం బొసంగు మది గల్గిన దేవతలార! తద్ధరా
మరసుతు ప్రాణమిండు మహిమం బలరన్‌ బ్రతికింతునంచునే
భరపడి మున్ను పల్కితి సభాస్థలి బాలకుఁ డట్టులౌట నా
యరయమిఁ జేసి కాదె? యను నాయనతో నని రెల్లవేల్పులున్‌
215
చం.శిఖి కడుఁ జల్లనైన నుడుశేఖరుఁ డుష్ణగుణంబుఁ బొందినన్‌
నిఖిలశరణ్య! మీరనెడు నిశ్చయవాక్కుల బొంకు సెందునే?
స్వఖరకరాసి శంబుకునిఁ జంపినయప్పుడె ప్రాణవంతుఁడై
సుఖమున నున్నవాఁడు ద్విజసూనుఁ డసూనుఁడు గాక భూవరా!
216
ఉ.ఊహ కలంగి చింతిలక యూఱడు మప్పని, కాశ్రితావనో
త్సాహ జలాశియై కలశజన్ముఁడు ద్వాదశ వర్షయాగ దీ
క్షాహిత నిష్ఠ నుండెఁ గద సాంగముగా నెఱవేర్చి నేఁడు పూ
ర్ణాహుతిసేయఁ బూనె మన మందఱ మమ్మునిఁ జూడఁబోఁదగున్‌
217
కం.క్రతుకర్తవు క్రతుభోక్తవు
క్రతుఫలదుఁడ వీవు నీకుఁగల గుణముగదా!
క్రతు వవలోకించుట లని
క్రతుభోక్తలు వలుక నటులఁగానిం డనుచున్‌
218
శా.కుంభీసంభవుఁ గాంచు వాంఛఁ దగఁగాకుత్‌స్థాన్వయ స్వామి య
జ్జంభారిప్రముఖామరేశ్వరుల పజ్జన్‌ ఋష్పకారూఢుఁడై
యంభోజాప్త నిభప్రభా విభవ మౌరా నాఁగ నేఁగెన్‌ దటి
న్యంభోజాకరపట్టణోపవన శైలారణ్యముల్‌ సూచుచున్‌
219
వ.ఈ గతి నేఁగి యా గుణసాగరుండు తన పురోభాగంబునన్‌220
సీ.ప్రాగద్రితటభాగ భాగహార పరాగ - రాగధూత ఘనాఘన నాగకులము
దారి తాభ్ర శతార తారదంష్ట్రోదార - దారయు గ్భూదార దారకంబు
మాలూర హింతాల తాల తూల రసాల - సాలకేసరసాలసాలయుతము
శబరయోషా చండచండరుక్కరకాండ - కాండఖండిత గండ గండకంబు
 
గీ.పిండితాజాండ గండభేరుండ నినద
సంశ్రవణమాత్ర విత్రస్త శరభ సరభ
సాగమన దర్శనోద్భ్రాంత హరివరేణ్య
మవు మహారణ్య మొకటి రాఘవుఁడు గనియె
221
కం.కని యయ్యరణ్య పథమున
ఘనయానము మీఁద శతమఖప్రముఖులతో
జనపతి సంభాషింపుచుఁ
జనునప్పుడు గృధ్రమొకటి చనుదెంచి వెసన్‌
222
ఆ.వె.మ్రొక్కి నిలిచె, నంత నొక్క యులూకంబు
వచ్చి బహుపరాకు స్వామి! యనుచు
వినుతి యాచరింప వెఱఁగందె రఘురాముఁ
డందు గ్రద్ద వలికె ముందుగాఁగ
223
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju