| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | గృధ్రోలూకములు రామునితోఁ దమ వివాదముఁ జెప్పుకొనుట |
| కం. | శిక్షింతువు దుర్మార్గుల రక్షింతువు దేవతలను బ్రాహ్మణులఁ గృపన్ వీక్షింతు వార్త జనులను సాక్షాద్విష్ణుఁడవు నిన్ను శక్యమె పొగడన్ | 224 |
| సీ. | పరమవిద్యాప్రౌఢి బ్రహ్మదేవునికంటె - రౌద్రసంపన్నత రుద్రుకంటె గాంభీర్యధుర్యతఁ గలశాంబునిధికంటెఁ - దిరమైన తాల్మి భూదేవికంటె నుతచమత్కృతి సమున్నతి బృహస్పతికంటె - నధికధైర్యమున హేమాద్రికంటె ననుపమానవితీర్ణి ధననాయకునికంటె - ధర్మవైఖరి దండధరునికంటెఁ | |
| గీ. | దేజమున భాస్కరునికంటె దీప్రకీర్తి శశిధరునికంటె ఘనుఁడవు సకలభూత సంభవస్థితికరుఁడవు సర్వసాక్షి వఖిల రక్షక! యొక వాక్యమవధరింపు | 225 |
| కం. | ఈ కౌశికంబు నాయిలుఁ జేకొని దన గృహమటంచుఁ జేరన్ గని దా వాకిలి నిడుకొని పోరెడి నో కౌశికయాగరక్షణోత్సుక! యెపుడున్ | 226 |
| కం. | నా యనదతనము మాన్పి కు లాయము విడిపించి దుర్బలస్య బలం రా జా యను వాక్యము నిక్కము సేయఁ గదే! యనిన గూబ క్షితిపతి కనియెన్ | 227 |
| సీ. | ఇంద్రునంశంబున నెల్ల భోగము లంది - వహ్నియంశమునఁ బావనతఁ జెంది యముని యంశమున ధర్మాభిరక్ష యొనర్చి - నిరృతియంశమున దుర్నీతిమాన్చి వరుణాంశమునఁ బ్రజావళికి సేమ మొనర్చి - పవనునంశముననౌ బలిమి హెచ్చి ధననాయకుని యంశమున వితీర్ణి వహించి - శివు నంశమున భూతు లవధరించి | |
| గీ. | భాస్కరుని యంశమునఁ బ్రతాపంబుఁ బూని చంద్రునంశంబునను మహాసౌమ్య మూని యఖిలకల్యాణ గుణరాశివైన నిన్నుఁ బ్రస్తుతి యొనర్ప శక్యమే బ్రహ్మకైన? | 228 |
| సీ. | లక్ష్మీవిహారాబ్జ లక్షణేక్షణములఁ - గరుణయు రోషంబుఁ గడలుకొనఁగ నెల్ల ధర్మములకు నెల్లయౌ మనమున - శాంతి దౌర్బల్యముల్ సందడింప నుచితవైచిత్రిఁ బెంపొందిన మాటల - వినయ పౌరుషములు విస్తరిల్ల దరహాసచంద్రికా స్ఫురితాస్యమున నాభి - ముఖ్యంబు వైముఖ్యమును రహింప | |
| గీ. | శిష్టజనరక్షణము దుష్ట శిక్షణంబు నాచరింపుదు వొక్కట నఖిల భూత సముఁడ వయ్యును ధర్మసంస్థాపనార్థ మిన్ని గుణములు వహియించి యీశ్వరేశ! | 229 |
| ఉ. | అద్దమరేయి భూమి నశనార్థము గ్రుమ్మరి తెల్లవాఱినన్ నిద్దురఁ జెందవచ్చునని నేను బ్రయత్నము సేసి కట్టితిన్ దద్దయు వేడ్క నిల్లొకటి తద్గృహసీమ వసింపనీయ దీ గద్దఱి గ్రద్ద చేరి కలకాలము పోరెడుఁ బోరు మాన్పవే! | 230 |
| కం. | ధర్మమతి రామ ఏవ గ తిర్మమ యని యిఁక సుఖస్థితిని బ్రతికెద నే నిర్మించిన యీ సదనముఁ గూర్మిని విడిపింపవే రఘుప్రవర! యనన్ | 231 |
| సీ. | విలసితాంతరవైరి విజయుఁడౌ విజయుని - నతులరూప జయంతుఁడగు జయంతు సకల సద్ధర్మపాలకు ధర్మపాలకు - నధిపస్తుతసుమంత్రుఁడగు సుమంత్రు నరిరాష్ట్రసాధకుం డగు రాష్ట్రసాధకుఁ - గితవకార్య తమో-ర్క ఘృష్టి ఘృష్టి యాచకసిద్ధార్థుఁడనఁ దగు సిద్ధార్థు - ననవరతమశోకుఁడగు నశోకుఁ | |
| గీ. | గాంచి, వింటిరె గృధ్రఘూకముల వాక్కు లని విమానంబు డిగి రాముఁడచట నిలిచి పులుఁగులను బిల్చి యే పక్షి తొలుతఁ గట్టె నీ గృహముఁ దెల్పుఁడన గృధ్ర మిట్టులనియె | 232 |
| కం. | ఏనాఁడు బ్రహ్మ పుట్టెనొ యేనాఁడు ప్రజా సమృద్ధి యిద్ధరఁ గనెనో యానాఁడె నిలువ నీ డని యీ నీడముఁ గట్టితిన్ నరేశ్వర! యనినన్ | 233 |
| కం. | పేచక మను ఘనసూచక మేచక! మీచెంత వెఱతు మృషలాడంగా భూచక్రంబున నజు చే నీ చెట్లైనపుడ యయ్యె నీ యిలు నాకున్ | 234 |
| చం. | అనవిని మంత్రి పుంగవుల నందఱఁగన్గొని రామచంద్రుఁ డో యనితరధర్మమర్మ నిధులార! దివాంధము భూజముల్ జనిం చినపుడె గూఁడు తా నిచటఁ జేసితినంచనె గృధ్రముర్వి పు ట్టినయపుడే నివాసము ఘటించితి నంచనె నిక్కమెద్దియో? | 235 |
| కం. | దాక్షిణ్యంబును పక్షా పక్షంబులు దలఁప కుభయ పక్షము లెనఁగా నీక్షించి తగవు దీర్చు వి చక్షణులకు నిహపరముల సౌఖ్యము గల్గున్ | 236 |
| చం. | తగవును సత్యమున్ హితవుఁ దప్పక ధర్మము గల్గి విన్నవా రగునని సంతసింప వ్యవహారము లొప్పఁగఁదీర్చి సజ్జనుల్ జగతిఁ బ్రసిద్ధి కెక్కుదురు సత్యము ధర్మ మెఱింగి యుండియున్ దెగమొగదిడియున్న జననింమోతు లొందుదు రెందథోగతుల్ | 237 |
| ఉ. | ఊరక రాని పోని వెడయుక్తులఁ గొన్ని గణించి వాక్చమ త్కారము జూపి రచ్చలను ధర్మము దేర్చని దుర్విచారుఁ డ వ్వారుణపాశ బద్ధుఁ డయి వందురుఁ గావున మీరు గృధ్ర కా కారుల వాదు దీర్పుఁడు యథార్థముగా నని యాన తిచ్చినన్ | 238 |
| ఉ. | ఆ యెనమండ్రు మంత్రులుఁ దదాజ్ఞవహించి ముహూర్తమాత్ర మే కాయనతా ప్రసక్తమతులై తలపోసి నరేంద్రుఁ జూచి భూ నాయక! గూబ గెల్చె సదనంబునకై మృషలాడె గ్రద్ద య న్యాయపథానువర్తి యిది యర్హము దండన కంచుఁ దెల్పినన్ | 239 |
| చం. | అలరి రఘూద్వహుం డనియె నౌ నిది నా మది నున్నలాగునం దెలిపితి రియ్యులూకము గణించినదే నిజ ముర్వి వృక్షముల్ గలుగక మున్నె యీ గృహము గట్టితినంచు నబద్ధ మిక్కడం బలికెడి గృధ్ర మిచ్చెడుగుఁబట్టి వధింపక మానవచ్చునే? | 240 |
| మ. | వినుఁ డేకార్ణవమైన కాలమున మున్విష్ణుండు నీటన్ శయిం చిన నద్దేవుని యాత్మఁ బుట్టి దివిషజ్జ్యేష్ఠుండు దత్కుక్షి హా యనకోటుల్ వసియించి నిర్గమనమార్గాన్వేషియై యున్నెడన్ జనియించెం గనకారవిందము తదంచన్నాభికాదీర్ఘికన్ | 241 |
| శా. | ఆనాళీక మృణాళనాళగతిఁ బద్మాగ్రంబుఁ బ్రాపించు భా షానాథున్ మధుకైటభాఖ్యు లడలించన్ నిద్రమేల్కాంచి డెం దానన్ గోపము మించ నుగ్రుఁ డగుచున్ నాభౌ సరోజుండు దు ర్మానోదగ్రుల వారిఁ ద్రుంచె నతిశీఘ్రప్రాప్త చక్రాహతిన్ | 242 |
| కం. | ఆ దానవ మూర్ధన్యుని మేదః పంకమున నయ్యె మేదిని యపు డు త్పాదించె శైలతరు స స్యాదుల నజుఁ డందు వెన్క నఖిలము గల్కెన్ | 243 |
| ఉ. | కావునఁ గౌశికంబు నరికట్టిన గ్రద్దనుబట్టి గట్టిగా నే వధియింతు నేఁ డనుచు హేతి ధరింప నభస్సరస్వతీ దేవి వచించె నో నృప! వధింపకు మిప్పెను గ్రద్ద తొల్లి ధా త్రీవరుఁడా శరీరమఱి గృధ్రతఁ జెందుట విన్ము తెల్పెదన్ | 244 |
| ఉ. | పూర్వము బ్రహ్మదత్తుఁడను భూవరుఁడై యితఁ డొప్పె సత్యమున్ సర్వవిరోధి జైత్ర భుజ శౌర్యము ధైర్యము గల్గి కీర్తు ల ప్పర్వమునాఁటి వెన్నెలల బాగున దిక్కుల నెల్లఁబర్వఁగా నుర్వరయేలుచుండె బుధయూధచకోరము లుత్సహింపఁగన్ | 245 |
| కం. | ఈతని కడ కొక దినమున గౌతమముని వచ్చి యన్నకాంక్ష నతిథి నిం దే తెంచితిఁ బెట్టెదె? యన నాతిథ్య మొనర్చి యాతఁ డడిగిన భంగిన్ | 246 |
| కం. | ఇష్టపదార్థంబులతోఁ బుష్టికరంబుగను నాఁడు భోజనమిడి యా ముష్టింపచునకు నటువలె నిష్టాన్నము నూటయిరవదేనేండ్లిడఁగన్ | 247 |
| చం. | ఇటువలెఁ బెక్కునాళ్లు భుజియింపఁగఁ బెట్టిన నాత నింట న జ్జటి వసియించి యొక్క దివసంబున నన్నములోనఁ గండ మొ క్కటి గని, కూటిలోఁ బలలఖండముఁ బెట్టితి గాన దీన నీ వటవిని గృధ్రమై మెలఁగు మంచు శపించె దయావిహీనుఁడై | 248 |
| కం. | శపియించిన భయపడి యా నృపతి యతని కెఱఁగి యెఱుఁగనిది తప్పైనన్ గృప శాపముడుపవే యని కృపణతఁ బ్రార్థింప మరల ఋషి యిట్లనియెన్ | 249 |
| సీ. | వెడఁదకన్నులవాఁడు విగ్రహాయుతకోటి - విగ్రహాయిత కాంతి వెలుఁగువాఁడు రామనామమువాఁడు శ్యామలాంభోధర - శ్యామలాంగకలీల నమరువాఁడు మునులపాలిటివాఁడు వనజాత హితకులా - వనజాతహితకీర్తిఁ దనరువాఁడు పల్కి బొంకనివాఁడు పంక్తికంధరశిరః - పంక్తి కంధరమరుత్పటిమవాఁడు | |
| గీ. | దశరథునిఁబోలు నొకరాజు దశరథునికిఁ దనయుఁడై పుట్టగలఁడా జితనయుఁ డెలమి మించి నీ దేహమున హస్తముంచినపుడె యతివిభుఁడవౌదు వని యేఁగె యతి విభుండు | 251 |
| కం. | ఆ శాపమడఁగఁ జేయుము కౌశికహితకాంక్ష యేల గ్రద్దను జంపన్ శైశవమున నొనరింపవె కౌశిక హితకార్య మని గగనవాణి యనన్ | 251 |
| ఉ. | ఆ రఘువీరమౌళి చతురంబుధివేష్టిత విశ్వధారుణీ దారుణ భారనిర్వహణ దక్షిణ దక్షిణ పాణి పద్మమున్ గారుణికత్వ మేర్పడఁగ గ్రద్ద శిరంబున నుంచె శాపసం హార మొనర్తునం చభయహస్త మొసంగు తెఱంగు దోఁపఁగన్ | 252 |
| వ. | ఇత్తెఱంగున నత్తరణికులపుంగవుండు బంగరుమించు టుంగరంబుల మెఱుంగులం గరంబు మెఱయు తన కరంబు విహంగమోత్తమాంగంబునం గదియించిన | 253 |
| సీ. | మార్తాండఘృణినేలు మణికిరీటము డాలు - మొనసి దిక్కులఁ గీలుకొని వెలుంగ నుడుజాలముల లీల బెడఁగొందు మగఱాల - సరుల పొందునఁ జాల నురము మెఱయ జగములన్నియు గెల్చు తెగువ నెమ్మదిఁ దాల్చు - వలరాజువలెఁ బొల్చు చెలువు గులుక మంచి పున్నమ చందమామ వెన్నెల చంద - మొందు కప్పుర గంద మొఱపు నెఱప | |
| గీ. | మఱియుఁ దగు భూషణంబులు మహితచిత్ర వస్త్ర మాల్యాదులు రహింప వాసవాదు లవుర! యద్భుత మనియెంచ నా క్షణమున గ్రద్ద యొక పుణ్యపురుషుఁడై కానిపించె | 254 |
| వ. | ఇవ్విధంబున | 255 |
| తే.గీ. | పురుషుఁడై నిల్చి యమ్మహాపురుషు పాద పద్మయుగళంబున నవీన పద్మరాగ మకుట రుచు లాచరింప నమస్కరించి హస్తములు మోడ్చి యిట్లని యభినుతించె | 256 |
| సీ. | జ్ఞానమార్గహరాయ శరణార్థిహృద్వ నా - జ్ఞానమార్గహరాయ తే నమో-స్తు దీనజీవనదాయ ఫేనభంగాంచన్న - దీనజీవనదాయ తే నమో-స్తు మానసత్త్వపరాయ మానవాశి విభా స - మాన సత్త్వపరాయ తే నమో-స్తు దానవారిధరాయ ధైర్యసంపద్ధూత - దానవారిధరాయ తే నమో-స్తు | |
| గీ. | భానుజాదికసేవ్యాయ తే నమో-స్తు భానుగోత్రపవిత్రాయ తే నమో-స్తు మానితదయాసముద్రాయ తే నమో-స్తు జానకీప్రాణనాథాయ తే నమో-స్తు | 257 |
| మ. | చరణాంభోజరజంబు సోఁక శిల యోషాత్వంబు మున్ గాంచె మీ కరపంకేజము దాఁకఁ బక్షి నరుఁడై కాన్పించు టాశ్చర్యమే? దురితంబుల్ దొలఁగెన్ శుభంబు గలిగెన్ దొల్లింటి చందాన నా పురికిం బోయెద సెల్వొసంగు మిఁక నో భూరిప్రభావోదయా! | 258 |
| కం. | అని యెంచి బ్రహ్మదత్తుఁడు మనువంశ నృపాలమౌళిమణి సముచిత భం గిని గారవించి పనిచినఁ దన దేశంబునకుఁ జనియెఁ దద్దయువేడ్కన్ | 259 |
| చం. | అమరులు క్రొవ్విరుల్ గురిసి రంతట రాముఁడు పాకశాసన ప్రముఖులు పెక్కు చందములఁ బ్రస్తుతిసేయ విమానమెక్కి మం త్రిమణులఁ గూడి కుంభభవునిం గననేఁగెఁగవేర కన్యకా కమలరజోధురంధరసుగంధసమీరము సేద దీర్పఁగన్ | 260 |
| మ. | శతమన్యుం డటు లేఁగు రాఘవుని పజ్జం బోవుచున్ రామ! చూ చితె యీ ద్రావిడభూమి నేఁ డయిన యీ చిత్రంబు! సామాన్యప ర్వతముం గానము తావకీన ఘనధైర్యస్ఫూర్తిచే గాసియై క్షితిలోఁ జొచ్చి యడంగెనో గిరులనన్ సీతావిభుం డిట్లనున్ | 261 |
| ఉ. | సర్వసుపర్వమౌళిమణి సంగత దివ్యపదాబ్జ! సర్వతో గర్విత పర్వతప్రకరఖండన చండకృపాణి! మించఁ గాఁ జేర్వకు మీరు రాఁగ నివసింపగ యిచ్చటి కొండలెల్ల నీ యుర్వి నడంగె నన్నఁ దగు - నొప్పునె యీ గతి నానతీయఁగన్ ? | 262 |
| వ. | అని యిట్లు శ్రీరామచంద్రుడు వలికిన | 263 |
| చం. | నగుచు బలారి పల్కె రఘునాయక! చెంగటఁ గంటివే యభం గ గురుతరప్రభావమణికర్ణిక నాఁ దగు తామ్రపర్ణికన్ బొగడిత కెక్కు క్రొత్త తెలిముత్తెపుఁ జిప్పలు సేతుబంధనా ద్యగణిత తావకీన చరితార్జిత కీర్తి రుచిన్ వెలింగెడిన్ | 264 |
| కం. | మలయముఁ గను మలయజతరు నిలయముఁ బాదాగ్ర భరిత నిర్భర ఫణభృ ద్వలయముఁ గృత పథిక శ్రాం తిలయము నతభావ ధృతమణీకిసలయమున్ | 265 |
| మ. | అదె కుంభీభవు నాశ్రమం బదె సముద్యత్పర్ణశాలోత్క-రం బదె పాథోధరయూథవృద్ధికర దీవ్య ద్ధోమ ధూమ వ్రజం బదె శాలాగత మంత్ర తంత్ర పర హోత్రధ్వర్యు ఋత్విగ్గణం బదె యూపప్రముఖార్హ సాధన చయం బంచున్ సురేంద్రుండనన్ | 266 |
| కం. | విని యతఁడు దెల్పి నన్నియుఁ గని రఘువీరుండు పుష్పకము డిగ్గి ముదం బునఁ దత్రత్య తపోధన జనమునకున్ వినతుఁ డగుచుఁ జనుదెంచె వెసన్ | 267 |