ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముఁ డగస్త్యాశ్రమమునకుఁ బోవుట
శ్రీరాముఁ డగస్త్యాశ్రమమునకుఁ బోవుట
చం.అజరులు దెల్పఁగా విని నిజాగమనంబున కుల్లసిల్లు కుం
భజుని పదాంబుజాతములు ఫాలము సోక నమస్కరించి భూ
భుజుఁడతఁడిచ్చు నర్మ బహుపూజలఁ దృప్తి వహించె, నంత యా
గజనిత హవ్యభాగములు గైకొని యేఁగిరి వేల్పు లందఱున్‌
268
చం.సముచిత భంగి యాగవిధి సర్వము దీర్చి యగస్త్యమౌని భూ
రమణుని నాఁటి రాత్రి నిల రమ్యనివాస మమర్చి కందమూ
లములను దేనెలం దగు ఫలంబులఁ దృప్తి యొనర్చి తత్ప్రస
న్న ముఖసరోరుహంబునను నైజదృశాళులఁ జేర్చి యిట్లనున్‌
269
ఉ.నాదెస నెయ్యముంచి రఘునాయక! మీ రరుదెంచినందునన్‌
గాదె చెలంగె మన్మఖము, గల్గెఁ దపఃఫల మాత్మయున్‌ మహా
హ్లాదముఁ జెందె విప్రతనయార్థము శూద్రుని సంహరించి యిం
ద్రాదుల కిం పొనర్చుట సమస్తము వింటిమి వారు దెల్పఁగన్‌
270
కం.ఐదంయుగీన నృపతుల
కీ దాక్షిణ్యప్రసక్తి యీ కరుణయు నీ
యౌదార్య శౌర్యగంభీ
ర్యాదులు గలవే? నుతింప నలవియె నిన్నున్‌?
271
చం.నిను ఘనుఁ డంచు మెచ్చి ధరణీవర! యేమి యొసంగువాఁడ నై
న నిది విచిత్ర రత్నమయ నవ్యవిభూషణ మొక్కఁ డిచ్చెదన్‌
గొనుమనినన్‌ రఘూద్వహుఁడు గుంభజ! మాకుఁ బ్రతిగ్రహింపవ
చ్చునె? ద్విజరాజధర్మములు చూచి యొసంగుఁడునానతం డనున్‌
272
చం.ఎలమిఁ గుబేరునంశమున నియ్యఁగఁ బుచ్చుకొనంగ వచ్చు రా
జుల కది యెట్టు లన్నమును క్షోణిజనంబులు రాజశూన్యతన్‌
దలఁకి బలారి నిర్జరగణంబుల నేలెడు లీల, దమ్ము నే
ర్పలరఁగఁబ్రోచురాజుఁ ఒడయంగఁ దలంచి విధాతపాలికిన్‌
273
చం.అరిగి నమస్కరించి చతురానన! రా జొకరుండు లేక యీ
ధరణి వసింపలేము కులధర్మపథంబులు సంచరింప దు
ష్కరమయి యున్న వొండొరులఁ గైకొనకుండెడి చెయ్వు పుట్టెడిన్‌
దిరముగఁ జింతఁ జేసి యొక ధీరు నిఁ కన్‌ సృజియింపవే యనన్‌
274
చం.నలువ సురేంద్ర దండి జలనాథ కుబేరులఁ బిల్చి పల్కె మీ
బలముల నాలుగింట నొక పా లొ సఁగుండు త్వదంశజాతుఁ డై
యిల భరియింప నొక్క నృపు నేను సృజించెద నన్న నిచ్చి ర
చ్చెలువున వార లందున సృజించె విభాజితఋక్షపున్‌ క్షుపున్‌
275
ఉ.క్షుపుఁ డిక్కైవడిఁ బుట్టి బ్రహ్మ వనుపన్‌ క్షోణీతలాధ్యక్షుఁడై
యపు డైశ్వర్యముఁ దృప్తి దాతృతయు నింద్రాంభోధిపాంశంబులన్‌
రిపు నాశంబు కృతాంతు నంశమున దారిద్య్రార్తి సంహార మ
ర్థ పరత్వంబు ధనేశునంశమున నిత్యం బూని ప్రోచెన్‌ బ్రజన్‌
276
ఉ.కావున నెవ్వరిచ్చినను గైకొనవచ్చు నృపాలమౌళికిన్‌
నీవు నృపాలమాత్రుఁడవె? నిర్మలకీర్తివి విష్ణుమూర్తి వి
ప్పావన భూషణం బిఁకఁ గృపం గొను మంచు నగస్త్యుఁడిచ్చినన్‌
భూవలశాసనుండు ప్రియపూర్వముగా గ్రహియించి వేడుకన్‌
277
చం.అది ధరియించి మౌనిఁ గని యయ్య! సమస్త రహస్యధర్మసం
పదలఁ బొసంగు మీరు ప్రతిభాషలు వల్కిన నేరమున్‌ క్షమిం
పఁదగుదు రంచు నేమిటికిఁ బల్మఱు వేఁడఁ? సైచినారె కా
యిది హృదయంగమంబయిన దెక్కడి దీ మణిభూష దెల్పరే?
278
సీ.అవివర్ణమౌళి వింధ్యనగంబు మీరు డా - య వివర్ణ గతిఁ బూనదా మొదటనె?
యహితాతిభయదుఁడౌ నహుషావనీభర్త - యహితాప్తి మీ కిన్క నడవిఁబడఁడె?
ధర్మాతిశయమున నెంతయు వార్త కెక్కియు - ధర్మాశయందె సంతతము మనరె?
దానవద్ద్విప సముద్ధతి వృద్ధి వహియించు - దానవద్విపుఁ గుక్షిలో నడఁపరె?
 
గీ.యల సముద్రంబు ప్రాగభివ్యక్త సత్త్వ
మై నశింపంగఁ గొనరె యాపోశనంబు?
మి మ్మెఱింగియు నెటు నీ సొమ్ము గలిగె
ననుట యనుచిత మది యోర్చి యానతిండు
279
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju