ఇతిహాసములు ఉత్తరరామాయణము అగస్త్యుఁడు రామునకు శ్వేతుఁడను రాజర్షి వృత్తాంతము సెప్పుట
అగస్త్యుఁడు రామునకు శ్వేతుఁడను రాజర్షి వృత్తాంతము సెప్పుట
కం.అనిన నగస్త్యుం డిటు లను
ననఘాత్మక! తెలియవలసి యడిగినఁ దప్పా?
వినుఁ డీ యాభరణము వ
చ్చిన విధ మాద్యంత మెఱుక సేసెద నీకున్‌
280
చం.ప్రథమయుగాంతరంబునఁ దపంబొనరింపఁగ నేఁదలంచి యీ
పృథివి నివాసయోగ్యవన మెక్కడఁ గల్గునొ యంచు నైకది
క్పథ పథికుండనై సమధికత్వరఁ ద్రిమ్మరి యొక్క దిక్కునన్‌
బ్రథితబహుద్రు కుంజ నికరస్ఫురితాటవిఁ గంటి రాఘవా!
281
చం.అల శతయోజనాయతమహాటవి యీ గతిఁ గాంచి చొచ్చి య
న్నెలవు విహంగశూన్యమును నిర్జనమున్‌ మృగవర్జితంబునై
యళు కొనరింపఁ జాలుటకు నచ్చెరు వందుచుఁబోయి పోయి చెం
తల నయనోత్సవ స్ఫురణఁ దార్కొను నొక్క కొలంకుఁ జూచితిన్‌
282
సీ.అలల యుయ్యెలలపై నలరెడి యంచలు - నంచల శకున లగ్నాంబకములు
బకములు విహరించు భంగి సారసములు - సారసములు చేరు జక్కవ కవ
కవకవఁ బలికెడి కరణి నారవల మించు - మించినందున నిద్ర డించెఁ గాన
గానముల్‌ సేయు భృంగముల వేడ్కఁ గనంగ - నంగనాదృక్కాంతి నలరు తొగలఁ
 
గీ.గల మనోహర వాసనల్‌ గలయు నాఁచు
నాఁచు జలదంతికరముల నతిశయమున
యమున రహిఁ గాంచు నత్తోయజాకరమునఁ
గరము నయ మొప్పఁ దీర్చితిఁ గాల్యవిధులు
283
కం.ఓ జనవర! యా కొలనొక
యోజన విస్తార మొంది యొరపైనది యం
దే జనునిఁ గాన నద్దరి
భూజావళి మించు నొక తపోవనిఁ గంటిన్‌
284
తే.గీ.కని, యమో! యిట్టి వన మేమి కారణమున
నార్య ముని శూన్య మయ్యెనో యని తలంచి
కందమూలాదికముల నాఁకలి యడంచు
యే వసించితి నాఁటి రేయెల్ల నచట
285
కం.మఱునాఁ డరుణోదయమున
సరసికి స్నానంబు సేయఁ జనుచున్‌ జగతీ
శ్వర! నేఁ దెరువునఁ జూచితిఁ
బరిపూర్ణాంగంబు నొక్క ప్రాయపు శవమున్‌
286
ఉ.చూచి, మనోహరాంగ మగుచున్‌ జెలువొందు శరీరమిచ్చటన్‌
వైచి శరీరి యెన్నడు దివంబున కేఁగెనొ? యీ శరీర మిం
దే చెదలైన నంటి నశియింపక మించుట కేమి హేతువో?
యీ చతురంతభూమిఁ గన మిట్టి విచిత్ర మటంచు నెంచుచున్‌
287
ఉ.అంత నొకింతసేపటికి నంబరవీథిని నేను గంటి దు
ర్దాంత మణీధగద్ధగిత రమ్యసువర్ణ సువర్ణఘంటికా
క్రాంతము చంద్రచందన శరచ్ఛరదామరదంతికాంతి సా
మంత సితచ్ఛదైక లసమానము నొక్క మహావిమానమున్‌
288
ఉ.అందొక దివ్యుఁ డుజ్జ్వలతరాభరణద్యుతు లుల్లసిల్లఁగాఁ
జందనలిప్త దివ్యతను సౌరభముల్‌ దిశ లావరింపఁగాఁ
జందురుకాంతియున్‌ గుసుమసాయకుఁ గేరెడి సోయగంబు సం
క్రందన భోగమున్‌ గలిగి కన్నుల పండువుగాఁ గనంబడెన్‌
289
వ.అప్పుడు290
సీ.వింజామరలు వైచు వేల్పుఁ బూఁబోఁడుల - కంకణక్రేంకార కలన కంటె
వివిధగీతావళుల్‌ వినిపించు గంధర్వ - వనితల వీణా రవములకంటె
నటియించు నప్సరః కుటిలాలకల పాద - కటక ఝళంఝళార్భటుల కంటె
సౌవర్ణవేత్ర భృత్సాధ్యకన్యాసము - త్కలిత సాహోనినాదములకంటె
 
గీ.సరస సంగీత వాద్య ఘోషములకంటె
నౌపవాహ్యమరాళ సాహస్ర పక్ష
ఝంకృతులు మించ వెలయు నా స్వర్గి దివ్య
యానమణి డిగ్గి వనభూమి కరుగుదెంచె
291
కం.అరుదెంచి యల్ల శవమున్‌
గర మర్థిని డాసి కోసి కండలు దిని త
త్సరసీజల పానంబునఁ
బరితుష్టిం బొంది యతఁడు పటువేగమునన్‌
292
ఉ.క్రమ్మఱ నవ్విమానమణిఁ గౌతుకమొప్పఁగ నెక్కి క్రేవలం
గొమ్మలు గొల్వనేఁగఁగ, జుగుప్స జనించిన నూరకుండ కే
నమ్మహనీయమూర్తిఁగని యక్కట! దివ్యుఁడ వయ్యు రోఁతలే
కెమ్మనుజామిషంబు దిననేమిటి కెవ్వఁ డవీవు దెల్పుమా!
293
కం.హేయమగు మనుజమాంసము
రోయక భక్షింప నాసురులకుఁ దగున్‌ గా
కోయి మహాత్మక! యిప్పని
సేయఁగ నీకగునె? యనిన సిగ్గున నతఁడున్‌
294
చం.శిరమొకయింత వంచి నుతిసేసి కరంబులు మోడ్చి నా పయిన్‌
బరమవినీతిఁ జూడ్కు లిడి పల్కె - మునీంద్ర! విదర్భధారుణీ
శ్వరుఁడు సుదేవుఁడన్‌ నృపతివర్యుఁడు దొల్లి సతీద్వయంబునం
దరుసముఁ బూని శ్వేత సురథాఖ్యుల నిర్వురఁగాంచెఁ బుత్రులన్‌
295
తే.గీ.వారిలో శ్వేతుఁ డనియెడువాఁడ నేను
మజ్జనకుఁ డార్యవినుతధర్మప్రసక్తి
జగతిఁ బాలించెఁ దత్పరోక్షమున నన్నుఁ
గడఁగి మంత్రులు పట్టంబు గట్టి రనఘ!
296
ఉ.పట్టము నేను గట్టికొని బాహుజనీతియె వట్టి శత్రులన్‌
గొట్టి యనేకకాలమును గుంభిని యంతయు నేలి యంత! దోఁ
బుట్టినయట్టి యా సురథు భూవరుగా నొనరించి నెమ్మదిన్‌
బుట్టిన శాంతి నీ ఘన తపోవనభూమికి వచ్చి యిచ్చటన్‌
297
కం.ఈ సరసీ తటసీమనె
వేసరక వసించి మూఁడు వేలేండ్లు తపం
బే సల్పి పిదపఁ గాయము
బాసి తపోమహిమ దేవభావము గంటిన్‌
298
శా.దేవత్వంబు వహించి యీ ఘనమణీదీవ్య ద్విమానంబుపై
నీవేల్పుం జవరాండ్రతో మెలఁగఁగా నింతంతనన్‌ రాని క్షు
త్తేవేళన్‌ నను గాసి సేయ నిది నన్నేలాగు ప్రాప్తించె? నీ
దేవావాసముఁ జెందువారలకు క్షుత్తృష్ణావ్యధల్‌ సెందునే?
299
మ.ఇదియేమో యని చింతఁజేసి యొకనాఁడేఁ బద్మజున్‌ జేరి త
త్పదముల్‌ ఫాలము సోఁక మ్రొక్కి కరుణాపాథోధి! యో భారతీ
హృదయాధీశ్వర! నిన్నుఁ జేరియును నే నీలాగు క్షుద్బాధఁ జి
క్కి దినంబున్‌ దపియించుటేమి? యనఁ బల్కెన్‌ ధాత నాతోఁ గృపన్‌
300
మ.నృపభావంబున రాజ్య మేలు నపుడున్‌ నీ వన్నదానంబు దా
న పరత్వంబునఁ జేయ వంబుకణమైనన్‌ దప్పిఁ గొన్నట్టివా
రిపయిన్‌ గోట విదుర్ప వొక్కరుఁడ వుర్వీనాథ! సాధుస్థితిన్‌
దపముల్‌ సల్పుచుఁ బ్రోవవే యతిథి దానన్‌ క్షుత్తు నిన్నేఁ చెడిన్‌
301
కం.ఆఁకొన్నవారి రమ్మని
తేఁకువ నన్న మిడువాఁడె దేవుఁడు దేవ
త్వాకాంక్షఁ జేయు తపములు
ప్రాకటముగ నన్నదాన ఫలమున కెనయే?
302
చం.అలసి శ్రమంబుతో నతిథి యాత్మగృహంబున కేఁగు దెంచినన్‌
గలిగినమాత్ర మన్నముదకంబు నొసంగక సేద దీర్ప కా
యిలు సొరనీక యేమిటికి నీడకు వచ్చితి వంచుఁ గ్రూరుఁడై
చలమునఁ బల్కు దుష్టగృహి చచ్చిననేమగు నున్ననేమగున్‌?
303
చం.వలసినయన్న మర్థుల కవారణఁ బెట్టెడి పాటి సంపదల్‌
గలిగియుఁ బెట్టవైతి వటుగావున నార్తి వహించెదీ క్షుధన్‌
నిలువక యేఁగి మున్ను ధరణీస్థలి వీడిన మేని మాంస మాఁ
కలిసెడ మెక్కి తత్సరసిఁ గల్గిన తోయముఁ ద్రావి రమ్మిఁకన్‌
304
చం.దినమును మాంస మీవు తిని తృప్తి వహించెదు మాంసనష్టి న
త్తనువు నశింప కెప్పటి విధంబునఁ బూర్ణతఁజెందుఁ బెక్కుహా
యనములు వోవఁ గుంభజమహాముని రాఁగలఁడాడ కమ్మునిన్‌
గనుఁగొని మాటలాడినను గష్టశవామిషభుక్తి దీఱెడిన్‌
305
ఉ.తా నొనరించినంతయును దా ననుభూతి వహింపకుండినన్‌
బోనె? తపింప నేమిటికి? పొమ్మని బ్రహ్మ వచింప నిగ్గతిన్‌
బీనుఁగు మాంసముం దినుచుఁబెక్కు దినంబులనుండి పూనెదన్‌
హీనత నా తెఱం గిది మునీశ్వర! యెవ్వరు మీరు దెల్పరే!
306
చం.కమలజుఁ డాన తిచ్చిన యగస్త్యులె కావలెఁ గాకయున్న నీ
సమధిక చిత్తశుద్ధియును శాంతియు దాంతియు భూమి నన్యసం
యములకుఁ గల్గ నేర్చునె? కృతార్థతఁ జెందితి మిమ్ముఁ జూచి యో
విమలతపఃప్రభావనిధి! విన్నప మొక్కటి యాలకింపవే!
307
ఉ.పాత్రులకున్‌ జలాన్నములు భక్తి నొసంగమిఁజేసి కాదె మ
ద్గాత్రము కోసికోసి తినఁగావలసెన్‌? ననుఁబ్రోవుఁ డీమణీ
చిత్ర విభూషణం బయినఁ జేకొని యంచు నొసంగె నంతలోఁ
జిత్రముగా నగోచరతఁ జెందె శవం బతఁ డుత్సహింపఁగన్‌
308
శా.శ్వేతుం డంతట నచ్చరల్‌ గొలువఁగా శీఘ్రంబునన్‌ వచ్చి సం
ప్రీతిన్‌ నాకు నమస్కరించి కరుణాబ్ధీ! మీ కటాక్షంబునన్‌
ఖ్యాతిం జెందితి దుర్దశల్‌ గడచితిన్‌ గైకొంటి సౌఖ్యంబు శం
కాతంకంబులు దీఱె నం చరిగె నేనంపన్‌ రఘుగ్రామణీ!
309
ఉ.ఈ తపనీయభూష ధరణీశ్వర! మీరు ధరించినందునన్‌
శ్వేతుఁ డుదారసౌఖ్యములఁ జేకొని శాశ్వతదాతృలోక సం
స్థాతృతఁ జెందు నంచుఁ గలశప్రభవుండెఱిఁగింప జానకీ
నేత మహాద్భుతాంబుధి మునింగి యగస్త్యునిఁ జూచి క్రమ్మఱన్‌
310
ఉ.ఓ మునిసార్వభౌమ! శతయోజన విస్తృతిఁ గన్న యీ వనం
బేమికతంబునన్‌ ఖగమృగేతరమయ్యె? జనుల్‌ చరింపఁగా
నే ముని యోర్వలేక శపియించె? వచింపుఁ డటన్న నమ్ముని
గ్రామణి పల్కెఁ దామరసగర్భ వధూ పదనూపురార్భటిన్‌
311
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju