ఇతిహాసములు ఉత్తరరామాయణము అగస్త్యుఁడు రామునకు దండకారణ్యవృత్తాంతముఁ జెప్పుట
అగస్త్యుఁడు రామునకు దండకారణ్యవృత్తాంతముఁ జెప్పుట
కం.మనువంశరాజశేఖర!
మను వను దొర తొల్లి గగనమణికులమణియై
మను నతనికి నిక్ష్వాకుఁడు
మనుజస్తుతుఁ డుద్భవించె మహనీయ రుచిన్‌
312
శా.ఆ యిక్ష్వాకుఁడు శైశవంబున సమస్తామ్నాయ శాస్త్రార్థ ధౌ
రేయుండై శ్రుతు లన్నియుంగని ధనుర్విద్యాదిమాద్యత్కళా
వైయాత్యంబును బూని శౌర్యమహిమన్‌ వర్ధిల్ల సామ్రాజ్య ర
క్షాయత్తాత్మునిఁ జేసి తండ్రి మిగులన్‌ హర్షంబుతో నిట్లనున్‌
313
చం.చదివితి వెల్ల వేదములు శాస్త్రములున్‌ స్మృతు లభ్యసించి త
భ్యుదయకరంబులై జగతినొప్పిన యాగమముల్‌ పఠించి తే
కద తొలి ధర్మ ముత్తమముగాఁ గను మర్థము మధ్యమంబుగా
మదినిఁ దలంపు కామ మధమంబుగఁ జూడుము పుత్ర! యెప్పుడున్‌
314
కం.అది యేమి యంటివేనియు
మొదటను ధర్మంబు లేక మొనయదు ద్రవ్యం
బది లేక కాదు తలఁచిన
యది యది గావునను ధర్మ మధికం బంటిన్‌
315
ఉ.ధర్మమునం బ్రజాహితము తార్కొను వేల్పులు మెత్తు రార్యులున్‌
గూర్మి వహింతు రర్థమును గూర్పడియే యభివృద్ధిఁ బొందు దు
ష్కర్ములు భీతిఁ జెందుదురు శత్రు లడంగుదు రిష్టసిద్ధియౌ
నిర్మలకీర్తియున్‌ ధరణి నిల్చు దివంబును గల్గుఁ బుత్రకా!
316
చం.పరహిత మాచరించుటయె భవ్యతపం బని రాదిసంయముల్‌
పరులకుఁ గీడుసేయు టొక పాపమటంచు వచింపనేల? యి
ప్పరమహితోక్తిఁ బట్టి పరబాధ గదా యని మానరాదు భూ
వరులకుఁ బాపకర్ములగు వారల దండన సేయఁగా దగున్‌
317
కం.దండింపఁ దగని సుజనుల
దండించిన దండమునకుఁ దగు దుర్జనులన్‌
దండింపకున్న ధరణీ
మండలపతి నరకకూపమగ్నుఁడుగాఁడే?
318
చం.ఎడపక దండనీతి వహియించియె కీర్తియు స్వర్గమున్‌ నృపుల్‌
వడయుదు రాదిరాజనయపద్ధతు లిట్టివి గావె? యగ్గతిన్‌
నడువుము సౌఖ్య మొందెదవు నందన! యంచు ననేకనీతు ల
క్కొడుకున కాన తిచ్చి నయకోవిదుఁ డాయన యేఁగెఁ గానకున్‌
319
చం.మనుసుతుఁడున్‌ దదుక్తమగు మార్గమునం బ్రజనెల్లఁ బ్రోచుచున్‌
దనమతి పుత్రకాంక్షలకుఁ దావలమౌటయు దాన ధర్మముల్‌
మునుకొని యాచరించి మఖముల్‌ సతతంబును సంఘటించి యం
దునఁ గనియెన్‌ గుమారులను నూర్గుర బాంధవు లుత్సహింపఁగన్‌
320
తే.గీ.వారికెల్లను గడగొట్టువాఁడు దండుఁ
డనెడు దుర్మార్గుఁ డన్నలయటులఁ గాక
శ్రుతులు చదువక సాధుసంగతుల మనక
హితుల మాటలు వినక యథేచ్ఛ మెలఁగు
321
వ.మఱియును322
సీ.వీథిలోఁ బొడగన్న వృద్ధుల నరికట్టి - వెకలియై పలుమాఱు వెక్కిరించు
నాడఁబోయిన చోటఁ దోడి బాలురఁ బట్టి - మూర్ఖుడై యంగముల్‌ ముఱియఁగొట్టుఁ
జదువరా! యేల దౌర్జన్య మూనెద వన్నఁ - గన్నతల్లిని బెట్టు కడఁగి తిట్టు
నూరివారిండ్లలో నున్న వస్తువు లెత్తి - బలియుఁడై యెందైనఁ బాఱవైచు
 
గీ.నార్యులు పురోహితులు నన్న లరుగుదేర
నూరకయ బిఱ్ఱ బిగుసుక కూరుచుండు
సహజధౌర్త్యంబుఁ బూని శైశవమునందె
తండ్రి వెతఁ జెంద దండుఁ డుద్దండుఁ డగుచు
323
ఉ.బాలకుఁ డెంతలే యనెడు పక్షముతో నొకకొన్నినాళ్లు భూ
పాలకుఁ డోర్చి వాని యెలప్రాయమునందలి చిన్నెలున్‌ బర
స్త్రీలకుఁగా మెలంగుటలు శిష్టుల నెంచక నిందసేయు దు
శ్శీలములున్‌ గనుంగొని యిసీ యని రోసె మనంబులోపలన్‌
324
ఉ.రోసి, ప్రధానులున్‌ బుధవరుల్‌ దన ధర్మ మనీష మెచ్చఁగా
నా సుతు నీసుతో నినకులాధిపుఁ డాతఁడు బిల్చి వింధ్య సం
వాసము నీకు మే లచట వర్తిలు పొమ్మని దూరదేశగున్‌
జేసెఁ గుమారుఁ డంచు నృపశేఖరు లోర్వరు మేర మీఱినన్‌
325
మ.మధుమత్తుం డగు దండు డిట్లు గురుఁడంపన్‌ వింధ్య శైలంబునన్‌
మధుమంతం బను పట్టణం బొకటి నిర్మాణంబు గావించి యం
దధికైశ్వర్య సమేధమానుఁ డయి శుక్రాచార్యు లాచార్య వృ
త్తి ధరింపన్‌ ధర యేలె వర్ష శతముల్‌ దేవాహితుల్‌ దోడుగన్‌
326
చం.అతఁడొక చైత్రమాసమున హర్షముతోఁ జని భార్గవాశ్రమ
క్షితి నొకచోఁ గనుంగొనియెఁ జిత్తజనూతన రాజ్యలక్ష్మికిన్‌
బ్రతియగుదాని లేఁ గొమరుఁ బ్రాయమునన్‌ జెలువొందుదాని నే
కతమున నున్నదాని నొక కామిని మత్తమరాళ గామినిన్‌
327
చం.కనుఁగొని, మావిలేఁ జిగురుఁ గైదువు జోదు పదైదుమాఱు లే
సిన నును వాఁడి తూపు లెదఁ జిక్కిన స్రుక్కి యతండుసేరి యో
వనితరొ! యొంటి యేటి కిటు వచ్చితి? వెవ్వరిదాన? వేమినీ
యనుపమనామ?మేను శరణాగతుఁడన్‌ వినిపింపవే యనన్‌
328
చం.కరము భయంబుఁ బొంది యల కన్నియ యిట్లను నోయిరాజ! నీ
గురుఁడన మించు శుక్రు తొలికూఁతుర నయ్యనఘుండు కూర్మి న
న్నరజ యటంచుఁ బిల్చు నతఁడంపఁగఁ దాపసనిష్ఠ నివ్వనాం
తరమున నున్నదానఁ దగు ధర్మము దప్పఁ దలంపనేటికిన్‌?
329
చం.అనవిని దండుఁ డిట్లనియె నంగన! భార్గవివైనేమి? నీ
ఘన కటి సీమ నీ యసదు కౌనును నీ బిగి చన్నుదోయి నీ
కనుఁగవ బెళ్కులున్‌ గనినఁ గాముఁడు తాళఁగ నీఁడు కౌఁగిలి
మ్మనుచుఁ బయంటఁ బట్టిన భయంపడి యమ్మదిరాక్షి క్రమ్మఱన్‌
330
ఉ.అక్కట! ధర్మమే గురుని యాత్మజఁ బట్టి రమింప? నెంచ నీ
కెక్కడఁ బుట్టె నీ మమత? యిప్పని శుక్రుఁడు విన్న సైఁచునే?
నిక్కము మోహమున్న నతనింగని వేఁడి పరిగ్రహింపు మీ
కక్కసపుం దలంపు కొఱగా దని సారెకు బుద్ధి చెప్పినన్‌
331
చం.వినక యతండు గిన్క నిఁక వెన్క భృగూద్వహుఁడేమి పల్కినన్‌
వినియెదఁ గాక యిప్పు డలివేణిరొ! మారునిబారికోర్వరా
దనుచు బలాత్కృతిన్‌ గదిసి యగ్గురుపుత్రినిఁ బట్టి కూడెనే
మని వినిపించువాఁడ? మదనార్తులు మీఁదటి హాని యెంతురే?
332
కం.ఆక్రోశింపఁగ నిటువలె
శుక్రాత్మజ బలిమిఁబట్టి సురతవిలాసో
పక్రమముఁ జూపి యాపా
పక్రీడాపరుఁడు సనియెఁ బట్టణమునకున్‌
333
చం.అరజయు నానతాస్య యయి యశ్రుజలావృతనేత్రయై కుచో
పరి పరిషిక్తఘర్మయయి పాణినిరుద్ధ కపోలయై నఖాం
కురమృదితాంగియై నిటలకుంచితకుంతలయై మనోవ్యధం
గరము దలంకు చున్నయెడఁ గావ్యుఁడు వచ్చి సవిస్మయాత్ముఁడై
334
ఉ.కూతుర! యేల యింత వెతఁ గుందెద? వెవ్వరు నిన్నుఁ దిట్టి? రీ
లేఁత శరీర మిట్లు బడలింపుదురే? యనఁ దండ్రి పాదముల్‌
నాతి నిజాశ్రులన్‌ గడిగి నా యభిమానము వీటిఁ బుచ్చి యీ
రోఁతలు సేసె దండుఁ డని రోదన మాతురయై యొనర్పఁగన్‌
335
చం.ఉడుగక యెల్ల లోకములు నొక్కట మ్రింగెడు రుద్రుపోలికన్‌
బడి బడిఁ గోప ముప్పతిల బండులు దీటుచు శుక్రుఁడుగ్రుఁడై
చిడిముడిపాటుతో నెదుట శిష్యులఁ గన్గొని వింటిరే భయం
పడక మదీయ పుత్రిఁ గని బల్మి రమించిన క్రించు చెయ్దముల్‌
336
ఉ.మంటకుఁ జేరికౌ మిడుత మాడ్కి నశింపక మత్కుమారి మే
నంటియు నింటికేఁగి చదలంటిన దుర్మతి సేనతోడఁ గ్రిం
దంటఁగ మంటివాన గురియంగలదేడు దినంబు లింక నే
మంటినొ యంచు నెంచవల దప్పుడె యిప్పురి నేల పాలగున్‌
337
ఉ.మామకశాపయుక్తి మధుమంతము నాలుగు దిక్కులందు నూ
ఱామడ దాఁక నున్న వన మంతయు నిర్జనమౌ నటంచు న
య్యామివరుండు వల్క నది యాదిగ నేడు దినంబు లింద్రుఁ డా
సీమను మంటివాన గురిసెన్‌ నశియించెను దండుఁ డంతటన్‌
338
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju