ఇతిహాసములు ఉత్తరరామాయణము అగస్త్యుఁడు రామునకు జనస్థానవృత్తాంతముఁ జెప్పుట
అగస్త్యుఁడు రామునకు జనస్థానవృత్తాంతముఁ జెప్పుట
తే.గీ.అప్పురంబు రజోవృష్టి నడఁగి యడవి
యగుట నది దండకారణ్యమనఁగఁబరఁగెఁ
గావ్యుని మహోగ్ర శాపంబుకతన నాఁటి
నుండియును బ్రాణిశూన్యమై యుండు నధిప!
339
ఉ.తాను గురూక్తి నయ్యరజ దారుణమైన తపంబొనర్చె న
క్కానన మధ్యసీమ మునుఁగల్గ రజోమయవృష్టి కోర్వ క
మ్మానినిఁజేరి రల్ల మధుమంతము పౌరులు దానిచే జన
స్థానమనంగ నన్నెలవు ధాత్రిఁ బ్రసిద్ధి వహించె రాఘవా!
340
మ.అరజాసంగత యోజనాయత సరః ప్రాంతంబుఁ బ్రాపించువా
రు రజోవృష్టికిఁ దప్పి పోదు రని శుక్రుం డాడుటన్‌ గొంద ఱా
సరసీతీరము కానలన్‌ బ్రదికి స్వేచ్ఛంబోయి రంచున్‌ ఖరా
సురవిధ్వంసి కగస్త్యమౌని దెలిపెన్‌ శ్రోత్రంబు లింపొందఁగన్‌
341
కం.తెలిపిన కథ విని రఘుపతి
కలశజునిం బెక్కు గతుల గణియించుచు సొం
పలరఁ దథావిధ భాషణ
ముల నా నిశి గడపె నంతఁ బ్రొద్దుదయించెన్‌
342
ఆ.వె.ప్రొద్దు వంగడమునఁ బుట్టిన పుడమిఱేఁ
డప్పు డాచరింప నర్హమైన
కృత్యమెల్లఁ దీర్చి యేతెంచి యమ్మహా
ఋషికి నతి యొనర్చి యిట్టు లనియె
343
చం.ధరఁగల తీర్థకోటులకుఁ దానకమై విలసిల్లు మీ పదాం
బురుహము లాశ్రయించితి మిముం గని కొల్చితి మాటలాడితిన్‌
బొరసితి మీ యనుగ్రహము పుణ్యుఁడనైతి ననుజ్ఞయిచ్చినన్‌
బురికిఁకఁ బోయివచ్చెదఁ దపోధనశేఖర! యంచుఁ బల్కినన్‌
344
మ.పరితోషించి యగస్త్యుఁడిట్లనియె నో భక్తాననాంభోజభా
స్కర! సాధారణధారుణీంద్రువలె నజ్ఞత్వంబుఁ బైఁబూని యి
క్కరణిన్‌ నన్ను నుతింపనేమిటికి? సాక్షాత్తారకంబైన య
క్షరతత్త్వంబవు నీవు నిన్నుఁ దెలియంగా శక్తులే మాదృశుల్‌?
345
సీ.మొదట నెవ్వని పాదమునఁబుట్టి నదులలో - ఘనకీర్తిఁ గాంచె గంగాస్రవంతి
మునిముఖ్యు లెవ్వాని మూర్తిఁ గానఁగ లేక - తపియింపుదురు మహాతపములూని
యెవ్వాని వాక్యంబు లీరేడు జగముల - శిక్షించు గౌరవశ్రీ వహించి
మహిమ నెవ్వని యనుగ్రహము కించిజ్ఞుల - సర్వజ్ఞులుగఁ జేసి సవదరించు
 
గీ.నట్టి హరివైన నీకు నర్ఘ్యం బొసంగి
కన్నులలరంగఁ జూచితిఁ గాంక్ష దీరఁ
బలుకులును వింటి మీ కృప బడయఁగంటి
‘నద్య ధన్యో-స్మి’ యనుకొంటి నాత్మయందు
346
సీ.నియతి ‘రామా’ యంచు నీ నామము జపించు - భాగ్యశాలికి వేదపాఠమేల?
నినునొక్కపరియైనఁ గనుఁగొన్న సుజ్ఞాన - నిధికి బ్రహ్మజ్ఞాననిష్ఠ లేల?
నీ భక్తి యొనరించు నిపుణుఁ జేరి భజించు - స్థిరబుద్ధికిఁ దపంబుసేయనేల?
నీ కటాక్షము దారి నిమిషమాత్రము చేరి - చెలఁగు మేటికిఁ దీర్థసేవలేల?
 
గీ.నీ వినుతి సేయువారికి నిక్కువముగఁ
జింతసేయంగ నణిమాదిసిద్ధులేల?
జానకీనాథ! మీ పాదజలముగ్రోలు
ఘనగుణాబ్ధికి దేవత్వకాంక్షయేల?
347
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju