| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరాముఁడగస్త్యుని వీడ్కొని యయోధ్యకు వచ్చుట |
| ఉ. | దృష్టిపథంబునం బడిన దేవవిరోధులనైనఁ బిమ్మటన్ శిష్టులు చేరు తావునను జేర్చు దయాబ్ధివి గాన నీవు నా యిష్టికి వచ్చి నేను ఘటియించు సపర్యలు మెచ్చినావు నీ తుష్టియ సర్వలోకముల తుష్టి రఘూద్వహ! పోయి రమ్మిఁకన్ | 348 |
| మ. | అని గంభీరవచోనిగుంభనల వింధ్యారాతి కీర్తించి పం చిన నచ్చోటి తపస్విచంద్రుల శుభాశీర్వాదముల్ గాంచి, వీ డ్కొని కౌబేరవిమానమెక్కి సచివుల్ గొల్వంగ మధ్యందినం బునకున్ రాముఁ డయోధ్యఁ జేరఁ జనియెన్ బూర్ణానురాగంబునన్ | 349 |
| తే.గీ. | చేరఁజని డిండిమధ్వనుల్ చెలఁగఁబెద్ద నగరి మొగసాలకడ విమానంబు డిగ్గి దాని వీడ్కొనునంతలోఁ దమ్ము లెఱిఁగి యేఁగుదెంచి పదంబుల కెఱఁగుటయును | 350 |
| చం. | ఇరువుర లేవనెత్తి ప్రియమేర్పడఁ గౌఁగిటఁజేర్చి రాఘవే శ్వరుఁడనుజన్ములార! మిమువంటి గుణాఢ్యులు గల్గఁగాఁజుఁడీ! మరణము మాని బ్రాహ్మణకుమారుఁడు ప్రాణములొందె నా వెతల్ దొరఁగె నటంచు వారలను దోడ్కొని లోపలికేఁగి యచ్చటన్ | 351 |
| చం. | జననులఁ గాంచి మ్రొక్కి యరుసంబున వార లొసంగు దీవెనల్ గొని సమయోచితం బగుటఁ గోరికమీఱఁగ మజ్జనంబు భో జనము నొనర్చి యొక్క మణి సౌధతలంబున విశ్రమించి య జ్జనపతి చెంతనున్న యనుజన్ముల నిర్వురఁజూచి యిట్లనున్ | 352 |
| చం. | వదలక మీ సహాయతఁ బ్రవర్తిలి బల్మి వహించి యజ్వన య్యెదనను వాంఛ పుట్టె నమరేంద్రుఁడు చంద్రుఁడు మున్ను కామిత ప్రదమని రాజసూయమఖరాజ మొనర్చిరి తన్మఖంబు సే యుదునొ! తదన్యమైన మఖమొక్కటి సేయుదునో? గణింపుఁడా! | 353 |
| కం. | మీ రెయ్యది దెలిపిన నది గౌరవమున నాచరింపఁగలవాఁడ హిత ప్రారంభులార! యను రఘు వీరునకున్ భరతుఁడనియె వినయంబెనయన్ | 354 |
| మ. | ధర యాధారము సర్వభూతములకున్ ధాత్రీశ! యా భూమి కా దరువైయుండెడివారు మీరు, సుసంతానంబు వాణీమనో హరుచే రక్షితమౌ గతిన్ జనసమూహంబెల్ల యుష్మత్కృపా స్ఫురణన్ వర్ధిల్లు నట్టి ప్రాణులు శుభంబుల్ వాయరేయందునన్ | 355 |
| సీ. | అమరనాథుడు తొల్లి యా యాగమెనరింప - నుగ్రదేవాసురయుద్ధమయ్యె మనహరిశ్చంద్రుఁడా మఖము మున్ను ఘటింప - రణములోఁ బొలిసిరి రాజు లెల్లఁ గలువల రాయఁ డాక్రతువు పూర్వమునందు - సవరింప నక్షత్రసమరమొదవె నబ్ధీంద్రుఁడాది నయ్యజ్ఞంబు గావింప - భూరియాదఃపాళి పోరిమడిసె | |
| గీ. | నాహవకరంబు గావున నాహవంబు తఱచుగాఁ జేయు రెవ్వరు ధరణినాథ! యింతయును మీ రెఱుంగరే? యిష్టగోష్ఠి కిపుడు మముఁజూచి యడిగితిరింతె కాక | 356 |
| ఉ. | అంచితధర్మత్తత్వముల కాస్పదమై చెలువొందు మిమ్ము బో ధించఁగనేర్తురేయొరులు? దేవర యానతి యిచ్చినట్లు గా వించనొకింత నేర్తు మను విన్నపమున్ విని, రాజసూయ మీ వెంచినయట్టిదౌ నని మహీపతి తమ్ముని మెచ్చి నెమ్మదిన్ | 357 |