| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఇంద్రుడు వృత్రవధవలనఁ గలిగిన బ్రహ్మహత్య నశ్వమేధముచేఁ బాపికొన్న కథ |
| కం. | సౌమిత్రియపుడు రామ స్వామికి హస్తములు మొగిచి జనవర! సవన ప్రేమము జనించెనేనియు మీ మది నిడరాదె యశ్వమేధ మొనర్పన్ | 358 |
| మ. | సకలాభీష్టఫలైకసాధనము దుష్టబ్రహ్మహత్యాది పా తక విధ్వంసనకారణంబు హయమేధం బమ్మఖం బాచరిం చికదా! యింద్రుడు బ్రహ్మహత్యయెడబాసెన్ దొల్లి? తత్పూర్వపు ణ్య కథాసంశ్రవణంబు సేయఁదగు నంచా లక్ష్మణుండిట్లనున్ | 359 |
| ఉ. | వృత్రుఁడు భాస్కరోపమ సమిద్ధమహోద్ధత విద్విషన్మహా వృత్రుఁడు బ్రహ్మవర్చస పవిత్రుఁడు నాఁదగునొక్క దేవతా పుత్రుడు యోజనాయత సముద్ధతగాత్రుఁ డతండు మున్ బహి శ్శత్రులతోడ నాత్మగతశత్రులఁ గెల్చి జగంబులేలఁగన్ | 360 |
| చం. | పలుమఱు భూమి దున్నకయె పండు, నభస్థ్సలి భూజనావళుల్ వలసిన వస్తువుల్ గురియు, వారధి యూర్ములు రత్నమాలికా వళిఁగొని బైట వైచు నవవర్షకముల్ నెల మూఁడువానలున్ వెలయఁగ నెల్లచోఁదనరు వృత్రుని ధర్మము లెంచ శక్యమే? | 361 |
| ఉ. | లోకములెల్ల గెల్చి యతిలోకుఁడనంగ నతండు మించియున్ బాకవిరోధికిన్ భయము వాటిల శంబరుఁడన్కుమారునిన్ స్వీకృతరాజ్యలక్ష్మి కభిషిక్తునిఁజేసి, తపంబొనర్చె ర త్నాకరతీరధారుణి నుదంచితవైష్ణవభక్తి మీఱఁగన్ | 362 |
| ఉ. | వాని తపోవిజృంభణము వాసవముఖ్యులు జూచి భీతులై దానవవైరిఁ జేరఁజని తత్పదకంజము లాత్మమౌళిసం దానితరత్నదీధితులు దార్కొన వందనముల్ ఘటించి, యో దీనశరణ్య! వృత్రు వగఁదీర్చి జగంబుల వంతమాన్పవే. | 363 |
| చం. | తపమున ముజ్జగంబులకుఁదానె యధీశుఁడునై సుధాంధులం గృపణులఁజేసి దాసులుగ నేలెదనంచుఁ దలంచినాఁడు, త త్తపము ఫలించెనేని యరుదా యది? యట్టులఁగాక ముందఱన్ దపము భవన్మహాతపమునన్ హరియించి విరోధిఁ ద్రుంపవే! | 364 |
| ఉ. | నా విని పద్మనాభుఁడెల నవ్వున వేల్పులఁజూచి వల్కనో దేవతలారా! వృత్రుని వధింపఁగ నా కుచితంబుగాదు నే నే వరమిచ్చితిన్ దొలుత నింద్రశతార ధరిత్రులందు మ త్పావన తేజ ముంచెద విపక్షునిపైఁ జనుఁడంచుఁబంచినన్ | 365 |
| మ. | అమరుల్ జిష్ణునిఁగూడి శాత్రవుని డాయం బోవఁగా నంతలోఁ గమలానాథుని తేజమున్ గనెఁద్రిభాగస్ఫూర్తి నం దాద్యభా గము శక్రున్ నడిపాల్ పవిన్ గొదువభాగం బుర్విఁబ్రాఁపించినన్ నముచిధ్వంసి వధించె ధైర్యనిహతాంతశ్శత్రునిన్ వృత్రునిన్ | 366 |
| ఉ. | వృత్రునిఁ జంపినప్పుడె సురేంద్రుని మేకొనె బ్రహ్మహత్య త ద్గాత్రము కంపమొందె మది గాడ్పడియెన్ సురలార్తిచే బహి శ్చిత్రము లట్టులైరి వెతఁజెందిరి విప్రులు వర్షహీనతన్ ధాత్రి ప్రశస్త సస్యఫలధాత్రియనన్ దగదయ్యె నయ్యెడన్ | 367 |
| కం. | ఆ హత్యవలనఁ గలఁగి సు ధాహారస్వామి విగతయశుఁడై తొలఁగెన్ స్వాహాధిపముఖ దివిజులు హాహాకారములతోడ హరిఁజేరి వెసన్ | 368 |
| ఉ. | ఓ హరి! యో కృపాజలధి! యో పరమేశ్వర! మీరె పంపఁగా నా హరి వృత్రుఁజంపఁగనె హత్యఘటిల్లెఁ దొలంగె నాతఁడున్ గేహముఁబాసి లోకములు కిల్బిషవృత్తిఁ గలంగె నింకమా కే హిత మానతిచ్చెదొ కదే! యన నాయన పల్కె వారికిన్ | 369 |
| మ. | హయమేధంబు మదర్పణంబుగ సురాధ్యక్షుండు గావించెనే నియు నాశంబగు బ్రహ్మ హత్యయనినన్ నిష్ఖేదులై వేల్పు లా క్రియ దేవేంద్రునిఁ గానఁబోయి మధువైరివ్యాహృతుల్ దెల్ప ని శ్చయబుద్ధిన్ మునికోటిఁగూడి యతఁడా జన్నంబొనర్చెన్ రహిన్ | 370 |
| కం. | సవనంబు చేసి వాసవుఁ డవభృథ మొనరించునంత నల హత్యయు ఘో రవికారాకారముతో దివిజేంద్రుని తనువుఁ దొరఁగి దివిజుల కనియెన్ | 371 |
| తే.గీ. | ఈ బిడౌజుని తనువున నెప్పటివలె విశ్రమింపఁగఁ గూడదు వేల్పులార! యెందు వసియింతు నింక నా కిరవుఁజూపుఁ డనిన నాదిత్యు లా బ్రహ్మహత్యఁజూచి | 372 |
| కం. | పాపములకెల్ల బలుపగు పాపంబవు నీవు నిన్ను భరియింప నొకం డోపునె ? నాలుగు చోటులఁ బ్రాపింపు మటంచు వారు పనిచిరి దానిన్ | 373 |
| చం. | జలముల ఫేనరూపమున సాలములన్ బలు బంక చందమై చెలులయెడన్ రజోమహిమఁ జేకొని వర్తిలె హత్య, యారజ స్వలల రమించు దుష్టజనసంతతిఁ జెందుట కుర్వి నొక్కపాల్ నెలకొనియెన్ సురేంద్రుడును నెమ్మి దివంబునకేఁగి రంజిలెన్ | 374 |
| ఉ. | కావున నశ్వమేధ మధికంబు మఖంబులలో నవశ్యమున్ దేవర! యాచరింపుఁ డది దేవహితం బని లక్ష్మణుండనన్ భూవరుఁ డుత్సహించి గుణభూషణ! యీ యితిహాస మింపుగా నీవలనన్ వినంగలిగెనేఁడని ప్రస్తుతిఁజేసి వెండియున్ | 375 |