ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముఁడు తమ్ములకు నిలోపాఖ్యానముఁ జెప్పుట
శ్రీరాముఁడు తమ్ములకు నిలోపాఖ్యానముఁ జెప్పుట
చం.అనఘ! తురంగమేధ మఖిలాఘ వినాశన మిష్టసౌఖ్యదం
బనియిపు డీవు దెల్పితి యథార్థము తొల్లి యిలాభిధానుఁడౌ
జనవరుఁడమ్మఖంబు పురుషత్వముఁ గ్రమ్మఱఁ జెందుకాంక్షమై
నొనరిచి కామినీత్వ మఱి యుర్వరనేలె నటంచుఁబల్కినన్‌
376
కం.ఆ మాటకు వెఱఁగందుచు
రామునిఁగని తమ్ములనిరి రాజేంద్ర! యిలుం
డేమిటికి మగతనము చెడి
భామినియైయుండెఁ దెలియఁబల్కుడటన్నన్‌
377
కం.అంభోజబంధు కుల కల
శాంభోనిధిచంద్రుఁడా దయాంబుధి పలికెన్‌
శంభు జటోజ్జృంభిత సరి
త్సంభృత గంభీరఘోష సంగతఫణితిన్‌
378
కం.అనుజన్ములార! యిలుఁడను
జననాథుని కథ పురాణసంహితలందున్‌
వినఁబడు నత్తెఱఁగంతయు
వినిపించెద వినుఁడు చెవులు వేడుకఁబొరయన్‌
379
తే.గీ.కర్దముఁడు దివ్యతేజఃప్రఘట్టితాఘ
కర్దముఁడు నాఁగ మున్నొకఘనతపస్వి
వెలయు నతనికి బలజితానిలుఁడు వితర
ణైల బిలుఁడొప్పు నిలుఁడను నాత్మజుండు
380
కం.ఆ యిలుఁడఖిల కళాధౌ
రేయుండై చారురూపరేఖాజితరా
జేయుండై శత్రుజనా
జేయుండై భూమిలోఁబ్రసిద్ధి వహించెన్‌
381
వ.మఱియును382
సీ.పరమధర్మాసక్తిఁ బాటించుఁగావున - సకలమార్గణకోటి సంతరించి
సార్వభౌమస్ఫూర్తి నుర్వీభరముఁబూనుఁ - గావున ఘనదానకలనమించి
యంచితానంత విద్యాశాలి గావున - నాభోగభోగాప్తి నతిశయించి
జిష్ణువైభవలీలఁ జెలువొందుఁగావున - బరగోత్రసంపదల్‌ పరిహరించి
 
గీ.గరుఁడ గంధర్వ యక్షరాక్షసనరాధి
పతులు తన విక్రమమునకు భయమునొంది
యగతికులమంచు నశ్రాంత మాశ్రయింపఁ
బ్రాజ్యసామ్రాజ్య మేలె నప్పార్థివుండు
383
కం.ఈ లీల రాజ్యపాలన
లోలుండై వెలసి యయ్యిలుండొకప్రాతః
కాలమున నిత్యవిధులను
శీలంబునఁదీర్చి కొల్వుసింగారంబై
384
సీ.అరినేత్ర దరచిత్ర కర వేత్ర కరకోటి - బలిసి ముందర బరాబరులొనర్ప
శరదంబుధర కంబు శరభంబుల హసించు - జిగిమించు చామరల్‌ చెలులు వీవఁ
గరలోల నరపాల వరఫాలములఁగప్పు - రములీలఁ బదనఖప్రభలు నిగుడ
స్థిరగాంగఝరరంగ దురుభంగ రవభంగి - వెలయ మాగధపాళి వినుతిసేయ
 
గీ.అచ్చరల చెల్వు మెచ్చని మచ్చెకంటు
లచ్చెరవు హెచ్చ దండలాస్యములు సలుప
నవ్యగంధర్వయువతి గానములు వినుచు
నిండు కొలువుండె నిల ధరాఖండలుండు
385
వ.అప్పుడు386
మ.తడవిండ్లుం గఱిమేనులుం బికిలి పూదండల్‌ మిటారించు బె
న్బడెముల్‌ జేగుఱు నామముల్‌ బదనికల్‌ పెంపొందు లేఁదీఁగలున్‌
గడియంబుల్‌ పులితోలు చల్లడములున్‌ గాసెల్‌ పిసాళింపఁగాఁ
దుడుముల్‌గూడుక వచ్చి చెంచులు నరేంద్రున్‌ గాంచి హర్షంబునన్‌
387
చం.వెదురుల ముత్తెముల్‌ సెలసువిండ్లు జవాది పునుంగుఁ జట్టులున్‌
పెదపెద దంతముల్‌ పునుఁగుఁబిల్లులు జల్లులు జుంటితేనియల్‌
బదనిక చాలుఁగాఱెనుము పాలు ననంటులనంటు కప్రముల్‌
మొదలగు కానుకల్‌ నృపతి ముందట నుంచి జొహారొనర్చుచున్‌
388
తే.గీ.పలికి రో నేల యెకిమీల కొలము సామి!
సేదు కుత్తుకకల పెద్ద సెంచువాని
యింటి సెంచెత చెలి మించు గుంట కెలని
పొలము లోపల మెలఁగు చెంచులము మేము
389
సీ.తొలుపంది బలుసందములఁ జెందెనను ఢాకఁ - బెరయు పందుల లెక్కవెట్టరాదు
కడిఁది గౌరుల మూఁక కసిమసంగెడి వీఁక - నెసఁగు సింగపు జాతి నెంచరాదు
జంటనల్‌ హజ్జల దంట బల్‌ మెకముల - బలఁగంబు మితి యేఱుపఱుపరాదు
పొలములో లేడి దూడల నేల మననీని - పులుల సంకె లెఱింగి పలుకరాదు
 
గీ.కటికియేదుల నెలుఁగులఁ గాఱెనుములఁ
గత్తిపేరి మెకంబుల గణనసేయ
రాదు మాయన్న! కాననో రాజులయ్య!
సోద్దె మా సాయ వేఁటాడి సూడరాదె?
390
తే.గీ.వాన కందువ మలలపై వాలు మొగులు
సాలు నరికట్ట సాల్‌ చెంచు జవ్వనులకు
నిబ్బరపుఁదూపు తడవింటఁబ్రబ్బఁజేసి
మబ్బుపైఁబాఱు మెకములు గెబ్బుటెంత?
391
సీ.డాసి యేనుఁగుల తొండము మీఁదనుండి యు - య్యెలలూఁగు నీ సిన్ని యెఱుకవాఁడు
లేఁదీఁగఁ బులికిఁ గళ్లెముఁబెట్టి వయ్యాళి - దోలుఁ గాఱడవినీదుండగీఁడు
కరి సంపిపోవు సింగమువెంట సని గోళ్ల - ముత్తెముల్‌ దెచ్చునీ ముగుద సిసువు
గండ బేరుండంబు రెండు తలల్‌ రెండు - సేతుల సీల్చు నీ సిన్నివాఁడు
 
గీ.వేడుకల సేసి యఱకాల వీఁడు దన్ను
నడవిపందుల కోఱ లీ పడుసువాఁడు
తక్కు నెలుఁగుల గిలుఁగుల లెక్కసేయ
నేఁటి కిఁక నీవె సూసెదు వేఁటలందు
392
కం.తలఁకక మెలఁగెడి మెకముల
నలుఁగుల పాల్‌జేసి మృగయు లగునని పొగడన్‌
బులుఁగుల వేఁటలు గని యొ
ప్పులు గులుకఁగ మరలుఁడనుచు బోయలు దెలుపన్‌
393
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju