| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఇలుఁడు సపరివారంబుగా వేఁటకుఁ బోవుట |
| మ. | మృగయాక్రీడన తత్పరత్వమున ధాత్రీనాయకుం డక్కిరా తగణంబున్ బహుమానరీతి ముదమందంజేసి యవ్వేఁట మా ట గరిష్ఠార్భటి రాణువెల్ల వినఁజాటంబంచి చాలించి యో లగ మభ్యంతరమొంది యర్హవిధు లెల్లందీర్చి శీఘ్రంబునన్ | 394 |
| సీ. | సగఁబాలు కపురవాసనలు మించు కురంగ - నాభిఁదీర్చిన గీఱునామ మమర విరిసరుల్ పైపైని మెఱయఁగట్టిన బురు - సారుమాల్ చెఱఁగు లంసమునఁబొదలఁ తావి కుంకుమపు గందపుఁబూఁత దగుపేరు - రంబున రత్నహారములు మెఱయ నునుపాలకాయ యొంటుల నంటు తెలిచాయ - లొలసి చెక్కులను వెన్నెలలు గాయఁ | |
| గీ. | జిలుఁగు చెంగావి దట్టిపైఁ జెక్కికొన్న వంకి దులకించఁ బసిడి దువ్వలువ వల్లె వాటు నెఱనీటు గులుకఁ బావాలు మెట్టి రాజదేవేంద్రుఁ డంతఃపురంబు వెడలె | 395 |
| వ. | అప్పుడు | 396 |
| సీ. | వినుకెంపు నడకింపు నునుకెంపు పల్లంబు - దీపించు పచ్చఱా దృష్టిదండ కళుకునీలంపు సింగంపుఁ దలాటంబు - దండి వైదూర్యంబు నిండు వాగె నిగరంపుఁ బగడంపు జిగిదొట్టు మొగముట్టు - రంగారు మదిరిణి సింగిణీలు గోమేధికంబులఁ గొమరొందు కళ్లెంబు - వజ్రాల మే లంకవన్నియలును | |
| తే.గీ. | గ్రొత్త ముత్తెంపుఁదెఱలఁ దళ్కొత్తుజాన మురుమరకతాళి మెఱుఁగొందు తరకసములుఁ బసిఁడి తఱటును గలిగి సొంపెసక మెసఁగు నుత్తమాశ్వంబు గొనితెచ్చె నొక్క సాది | 397 |
| కం. | తెచ్చిన తేజికి వలఁగొని వచ్చి తగన్‌మ్రొక్కి యెక్కి వాగెగొని “యహో! యెచ్చరిక సామి!” యను రవ మెచ్చఁగఁ గంచుకులు వెంట నేతేరంగన్ | 398 |
| కం. | జోడనలు నిబ్బరంబులు దౌడెంబులు మెఱయ రాజు వేడుకతోడన్ గోడా దుమికింపఁగ జతఁ గూడిరి దొరలెల్ల భటుల గుమి వెనుకొనియెన్ | 399 |
| ఉ. | మట్టుకుళాయులున్ బిగువు మాటలుఁ గుంకుమ తావి గందపుం బట్టెలుఁ జల్లడంబులును బంగరుకాసెల యోరఁజెక్కికొ న్నట్టి బెడంగు చాయ విడియంబులుఁ దళ్కుల దుప్పటుల్ దగన్ జుట్టపు రాకుమారకులు సొంపున నేఁగిరి రాజు ముందటన్ | 400 |
| ఉ. | గాటపు బోనులున్ జిగురుఁగండెలు సివ్వఁగి బండ్లు వాగురా కోటులుఁ జిక్కముల్ దెరలుఁగుంతములున్ దడవిండ్లుఁ దూపులున్ మీటలు దీమముల్ మణులు మేలిమి మూలిక లీఁటెలూని యా ఖేటకులా నృపాలకుని క్రేవలనేఁగిరి కేవలత్వరన్ | 401 |
| తే.గీ. | కణుఁజు సాళువమును జలకట్టె లగుడు జాలెడేగయు మొదలైన మేలి డేగ తెగలఁదగ నేర్పరించి యత్తెములనుంచి కదలె నృపువెంబడిన నూడిగముల గములు | 402 |
| ఉ. | చోరుల గుండెలన్ దిగు నసుల్, కిటికోటులపాలి మృత్యువుల్, గ్రూరమృగోత్తమాంగములఁ గూల్చెడి పెన్‌బిడుగుల్, గభీరభాం కారనినాదముల్, ప్రళయకాల సదృఙ్మృగయాప్రధానముల్, భైరవవాహముల్ భటుల పజ్జల నేఁగె మరుజ్జవోద్ధతిన్ | 403 |
| సీ. | ఎదిరించు సింగంబు బెదరించి వడిమించి - సటల నుయ్యెలలూఁగు భటుఁడ నేను గవినున్న పులిఁగన్నఁ గదిసి గద్దించి గొ - బ్బున నీడ్చి తేనోపు బంట నేను గరమూఁది పైఁజివుక్కన నెక్కి కరికుంభ - మగలించు పరమసాహసుఁడ నేను శరభంబు కాళ్లు కొంచక పట్టి నేలపైఁ - గొట్టఁజాలిన మహోగ్రుఁడను నేను | |
| గీ. | గడిఁది కిటికోటి పాలిటి పిడుగు నేను సకల మృగముల నడఁచు నంతకుఁడ నేను దేవ! యిఁక మమ్ముఁ దెలిసెద వీవె యనుచు వేఁటగాండ్రాడుమాటలు వేడ్క వినుచు | 404 |
| వ. | చని చని | 405 |
| మహాస్రగ్ధర | కనియెన్ భూపాలలోకాగ్రణి తనయెదురన్ గాఢవల్మీక నిర్భే దనమాద్యద్భల్ల హస్తస్థల గత ఫణరత్న స్ఫురత్పన్నగాలో కనజాతాలాత శంకాకలిత గమన భాగ్గంధ కుంభిచ్ఛటాధా వన భీత క్షుద్ర నానాధ్వగ మృగ నినదవ్యాకులంబైన కానన్ | 406 |
| మ. | కని, యక్కాననదేశమున్ సుభటసంఘాతంబుతోఁజొచ్చి య ల్లన నానా మృగసంఘముల్ మెలఁగు పట్లన్ బోగువాఱించి చు ట్టును ధానుష్కులు కుంతధారులగు బంటుల్ నిల్వ నేమించి శం ఖనినాదంబులు దుందుభిస్వనము ఢక్కానాదముల్ మించఁగన్ | 407 |
| తే.గీ. | కలయఁ జోపులు వెట్టింపఁ గరియుఁ గిరియుఁ గాసరముఁ గేసరియు దుప్పి కడిఁది యెలుఁగుఁ బులియు మొదలగు మెకములు కలఁకదొలుకఁ జెదరి నలుదిక్కులకుఁ బాఱె నదరి బెదరి | 408 |
| వ. | మఱియును | 409 |
| సీ. | అగ్నియంత్రములు పెల్లాకాశ మవియింప - భయమంది నెలవులఁ బాయునవియుఁ బటహశంఖధ్వనుల్ బ్రహ్మాండ మగలింప - నులికి నల్దిక్కుల కురుకునవియు భటుల కోలాహలార్భటు లన్నికడ లాన - బెదరి జంటలువాసి చెదరునవియు ధానుష్కశింజినీధ్వానముల్ చెవిఁబాఱ - నులికిపాటున నిద్రలుడుగునవియు | |
| గీ. | నగుచుఁ బఱచు మృగంబుల నాఁగిమూఁగి యడరి వెన్నాడి మున్నాడి యాక్రమించి విక్రమించిరి ముంచిరి విశిఖవృష్టి విభుఁడు గదియింపఁబెక్కండ్రు వేఁటకాండ్రు | 410 |
| చం. | విలయఘనాఘనంబు లటవీస్థలి డిగ్గెనొ? యంధకాసురుం డిల జనియించి క్రమ్మఱ ననేకశరీరము లెత్తెనో? విషా నలము మహేశ్వరుం డుమిసినన్ బలురూపులఁజెందెనో? యనన్ వెలసిన సూకరప్రతతి వెల్వడె దిక్కుల నిర్లు నిండఁగన్ | 411 |
| ఉ. | అప్పుడు చెంచులున్ సుభటు లడ్డమువోయి లకోరికోలలన్ గప్పఁగ నంతకంటె మునుగల్గఁ బయింబడె జాగిలంబులున్ జెప్పెడిదేమి కోలములు చేకొన కస్త్రచయంబు లీఁటెలుం గుప్పలుగాఁబడన్ విఱచుఁ గోఱలఁజిమ్ముచు జాగిలంబులన్ | 412 |
| ఉ. | సారెకుఁబాలచేర్లు బలుజాగిలముల్ గబళించి యీడ్వఁగా నీరసమొప్పఁదారసిలి యీఁటెల వీరభటాళినొంచఁగాఁ దారకకొప్పరించుచును దంష్ట్రల నిప్పుకలుప్పతిల్లఁగాఁ బోరు కడిందిపందినొక బోయ పిడెంబునఁగ్రుమ్మెఁగూలఁగన్ | 413 |
| చం. | ఇరవులు వాసి తారసిలు నిన్నిటి కిందఱమేగి యొక్కరొ క్కరమొక పందిఁజంపి యిదెకైకొనువారము సామి! చూడు మె చ్చరిక! యటంచుఁబల్కి పరుషధ్వని నొంటరికాండ్రనేక సూ కరముల దెప్పుగుప్పుమనఁగాఁ బడఁగ్రుమ్మిరి కుంతపంక్తులన్ | 414 |
| చం. | తెలివగు వెండి గుండ్లవలెఁదేజముమీరిన భైరవాశ్వపం క్తులు పదియైదు లొక్కమొగిఁ దూఱినఁగోఱలఁ జీల్చివైచుచున్ బెళపెళ బల్లెముల్ విఱిచి భిల్లులు తల్లడమంద నుద్ధతిన్ వలలను ద్రెంచి తేజిపయి వచ్చు కిరిన్ దొరనొంచెఁదూపునన్ | 415 |
| చం. | గిరిగుహనుండి యొక్కహరి క్రేవల రాజహయంబు మించినన్ “హరియనుపేర నేను జెలువందఁగ నీవును బూనినావె నా స్థిరమగుపే” రటన్న పగచేఁ బలెఁబై కరుదేర భర్తయున్ శరమొకఁడేయఁ ద్రెళ్ళక వెసన్ నిగుడన్ నఱికెన్ గటారునన్ | 416 |
| చం. | అలయక లేడి దూడగుమినాఁగెడు క్రోల్పులులన్ వధించు, దం తుల వెఱపించు సింగములఁద్రుంచుఁ దదార్తికరోగ్రశౌర్యముల్ గల శరభాళినొంచు గమకంబున వానిఁగలంచు జంటపెం దలల కడింది జంతువుల ధర్మరతిం బతి చించునొక్కటన్ | 417 |
| కం. | కిరి కరి హరి శరభాదుల హరియింపుచు సుభటు లలరనట్టి పనులకున్ జొరలేని పిరికియయ్యలు చరియింతురు శశకములకు జంబుకములకున్ | 418 |
| కం. | ఒక తూపున బలు మెకముల నొక మెకము ననేకసాయకోత్కరముల నొ క్కొకచో నడఁచుచు రాజ న్యకులాగ్రణి యపుడు వేఁటలాడె యథేచ్ఛన్ | 419 |
| కం. | కడువడిఁ బఱచెడు మెకమును జెడు మెకమున్ బడు మెకంబుఁజేడ్పడు మెకమున్ బడలు మెక మడలు మెకమును నెడయు మెకంబయ్యె నటవి నిలుని భటులచేన్ | 420 |
| ఉ. | కండలు గుండెలున్ మెదడు గాటపుఁబ్రేవులు నెత్తురేకమై నిండె నరణ్యమంత మృగనిర్హరణోద్ధతి మాని యుండియున్ వెండియు భూవరుండనుప వేఁటకు మీటగుడేగవేఁటయున్ గొండొకసేపు చూచి తగుకోరిక లిచ్చెఁ బుళిందకోటికిన్ | 421 |