| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఇలుండు కైలాసప్రాంతవనంబు సొచ్చి సపరివారుండై స్త్రీత్వము నొందుట |
| వ. | ఇవ్విధంబున మృగయా వినోదంబునన్ దనివిచెంది పంది కుందేలు కదళీమృగంబు మొదలగు మెకంబుల పలలంబు పంచికొనుటకున్ దమలోఁదమరు పలుచందంబుల సందడిం బొందు పుళింద బృందంబులం దిలకించి కించిద్దరహాస కందళితవదనారవిందుండై యన్నరేంద్రసంక్రంద నుండు కొండొక విశ్రమించు తలంపున నపరిమితచమూ సమూహసమన్వి తంబుగా నక్కాఱడవి గడచి యక్కడకుఁ జక్కని యుత్తరపు దిక్కునఁ బెక్కు నిండుచందురుల పండువెన్నెల లొక్కట మెండుకొన్న చెన్నునఁ గన్నుల పండువైయుండు వెండికొండ దండకుంబోయి కొండలఁ జెండు మన్నీని చేతి చికిలి ఖండా-చాయలఁగ్రేణిసేయు శరవణంబు విలోకించి త్రిలోకమోహనంబగు నవ్వనంబు దరియంజొచ్చి యచ్చట - | 422 |
| సీ. | తన కీర్తి విలసనత్వము లే నగవులందుఁ - దన చంద్రసామ్య మాననమునందుఁ దన ఖడ్గవిభవమంతయుఁ గీలు జడయందుఁ - దనప్రతాపము సుధాధరమునందుఁ దన కువలయ హితత్వము నేత్రములయందుఁ - దన గబ్బితనమురస్ స్థలమునందుఁ దన ధర్మసురుచిరత్వము కన్నుబొమలయందుఁ - దన కాంచనసమృద్ధి తనువునందుఁ | |
| గీ. | దన గభీరత నాభి హ్రదంబునందుఁ దన మనోవిస్తృతి నితంబతలమునందు వెలయ నిలుఁడంతలోఁదుంటవిల్తు చెలువ భంగిఁ దులకించు నొక మోహనాంగియయ్యె | 423 |
| వ. | ఇత్తెఱంగున | 424 |
| ఉ. | కోడె మిటారి గబ్బి చనుగుబ్బల నుబ్బెడు నిండు ప్రాయపుం జేడియయై యతం డరుదుఁజెంది యమాత్యసుహృద్భటాదులం జూడఁగ నందఱున్ దనకు జోడుగఁగైకొని రాడుపోడుముల్ గోడిగ చందమొందె నల ఘోటకరత్నముఁ దత్‌క్షణంబునన్ | 425 |
| కం. | అన్నుతనంబు వహించిన తన్నున్ దనవారిఁజూచి తద్దయు వగతో నున్నంత నటకుఁ గొందఱు కన్నియ లేతెంచి కరము కనికరమలరన్ | 426 |
| తే.గీ. | పలికి రో వెఱ్ఱి! యిఁకనేల పరితపింప గిరిజతోఁగూడి శివుఁడీడఁ గ్రీడ సేయ వచ్చినాఁడింత నిందులోఁ జొచ్చు పురుషుఁ డింతియౌఁగాక యని శాపమిచ్చినాఁడు | 427 |
| చం. | నగజకుఁబ్రీతిగా నిజగణంబులతోఁ దరుణేందుమౌళియున్ మగువతనంబుఁ బూనుకొనినాఁ డటుగావునఁజూడు మివ్వనిన్ ఖగమృగపన్నగంబులు నగంబులు మున్నుగ స్త్రీలవైఖరిన్ దగినవి ఈశ్వరాజ్ఞ జవదాఁటఁగ నెవ్వరికైన శక్యమే? | 428 |
| శా. | ఏ సర్వేశ్వరునాజ్ఞ యౌదలల బ్రహ్మేంద్రాదికుల్ పూని కొం డ్రా సర్వేశ్వరుఁడా కుమారగురుఁడా యర్ధేందు కోటీరుఁడు ల్లాసం బొప్ప వసించినాఁడదిగొ! బాలాపాణిభృచ్చామర వ్యాసంగానిలలోల కుంతలచయుండై పొమ్ము ప్రార్థింపగన్ | 429 |
| కం. | అని రుద్రకన్య లెఱిఁగిం చినఁబడతుకయైన రాజశేఖరుఁడెలమిన్ దనవారుఁ దాను గ్రక్కునఁ జని గిరిజాసహితుఁడైన శంభునిఁ గాంచెన్ | 430 |
| తే.గీ. | కాంచి బిగిచన్ను లిలమ్రోవఁగాంచనాద్రి ధన్వు పాదాబ్జములకు వందన మొనర్చి యంజలి ఘటించి యభినుతు లాచరించి వినయ మెనయంగ నిట్లని విన్నవించె | 431 |
| చం. | పరమదయానిధాన! శివ! పశ్యలలాట! సహస్రకోటి భా స్కరనిభ తేజ! మీ రిడిన శాపమెఱుంగక వచ్చి యీవనాం తరమున సేనతోడ వనితాత్వముఁజెందితి నివ్వికారమున్ భరణము సేయఁజాల నిఁకఁ బౌరుషముం గృపసేయవే యనన్ | 432 |
| చం. | కలకల నవ్వి శంభుఁడనుఁ గర్దమనందన! యాఁడుచందముం దలఁగఁగఁ జేయుటొక్కటియు ద్రక్క మఱొక్క వరం బొసంగెదన్ వలసినదేమి దెల్పు మనినన్ బరమేశ్వర! యన్యకాంక్షయున్ వలయునె? యంచు నయ్యిల శివాసతి చెంగటికేఁగి దీనతన్ | 433 |
| చం. | కళుకు మెఱుంగుఁజెక్కులను గాటుక కన్నుల నీరు జాఱఁగా నలఁత జనించు నూర్పు సెగలాని ముఖాబ్జము వాడుదేఱఁగా వలుఁద పిఱుందు భారమున వారని త్రొక్కట పాటు మీఱఁగా నిలపయిఁ జాఁగి మ్రొక్కియిల యీశ్వరి నిట్లని యెంచె ధీరతన్ | 434 |
| దండకము | శ్రీమద్రమా భద్రమాతంగయానామణీ ముఖ్య నానామరగ్రామణీ కామినీ కల్పితానల్ప కల్పప్రసూనాది పూజాతిరాజత్పదాంభోజ దీవ్యన్నఖశ్రేణికా సాంద్ర చంద్రాతపశ్రీ సముత్ఫుల్ల భక్త ప్రియశ్రేణి నేత్రోత్పలా! ఖండితాశ్వద్విషద్దానవోద్యద్బలా! యుత్పలామిత్ర మిత్రాగ్ని హోత్రాఖ్యనేత్రత్రయాలోక లోకైక నిర్మాతృత స్థాతృతా జేతృతారీణ చాతుర్యపారీణ ఖేలావతీ! చారులావణ్యలీలావతీ! దేవతిర్యఙ్మనుష్యాదిక ప్రాణిబాహ్యాంతరవ్యాప్తసుప్తాద్యవస్థాతిగజ్ఞప్తి రూపానురూపక్రియా కారణాకార రేఖావిలోకాతిలోక ప్రమోదాబ్ధినిర్మగ్నఫాలేక్షణా! పద్మగర్భాండ కోట్యర్బు దాయత్త సంరక్షణా!! సూక్ష్మవీక్షాతితిక్షా పరాక్షీణ హృద్ గ్రంథినిర్గంధనాత్మానుసంధాన సంబంధభృన్మూలబంధానుభూతి ప్రభూత ప్రభూతాత్మ సౌఖ్యాత్మక శ్లాఘ్యనిష్ఠైక సంధాయినీ! బంధురాష్టాంగ యోగాంచితధ్యాయినీ!! కాయజా ఖర్వగర్వాపహార వ్రతాచార చంచత్తపః కర్మసంచారిణీ! బాలచంద్రైక రేఖాసముద్ధారిణీ!! ధారుణీతోయ తేజోమరుద్వ్యోమ తన్మాత్ర తత్తాదృశ ప్రాణనాదేంద్రియస్థాన షట్చక్ర నాడీవిశేషాకృతీ! హృద్యవీణానువాద్యాదివిద్యాకృతీ!! ప్రాకృతుల్ నిన్ను సర్వేశ్వరిన్ మూలశక్తిన్ బరంజ్యోతి నాద్యంతశూన్యన్ ద్రయీరూపిణిన్ గాంచి, భావించఁగా లేక, దాక్షాయణీదేవి వంచున్ హిమక్షోణిభృత్పుత్త్రి వంచున్ విలోకింతు, రస్మాదృశాజ్ఞత్వ మాత్మన్ క్షమింపంగ ఖేదంబు మాన్పంగ నీకే తగున్, దండ్రి కంటెన్ బ్రజాకోటిపైఁ దల్లికిన్ గూర్మి బాహుళ్య, మోతల్లి! యేఁదొల్లి యేస్నాన మేదాన మేయోగ మేయాగ మెచ్చోటఁ గావించినానో, నినుం జూడఁగాఁ గల్గె, బ్రహ్మామరేంద్రాది బృందారకేంద్ర స్ఫురద్భర్మ కోటీర కోటీతటీరత్న విభ్రాజమాన ప్రభారాజినీరాజితంబైన నీ యంఘ్రియుగ్మంబు సేవించితిన్, ద్రుంచితిన్ బూర్వజన్మార్జితాశేషదోషంబు, నీసత్కటాక్షంబునన్ నిన్ను వీక్షించి, తింకేమి కాంక్షింపఁగానేమున్న, దైనన్, మనశ్చంచలత్వంబునన్ వేఁడెదన్, వ్రీడకుం దోడునీ డైన యీయాఁడురూపంబుఁ బ్రాపించి, యుష్మత్కృపాప్లావిత ప్రాజ్యసామ్రాజ్యముం బాసి, గాసిల్లఁగా నోప, నా పూర్వపాపంబు మన్నించి, నన్నున్ భవత్కింకర శ్రేణితోఁ గూర్చి రక్షింపు, మోనాతి! యేరీతిఁజింతించినన్ విశ్వలోక ప్రపంచంబు నీచేతి, దీచేతనాచేతన శ్రేణి నేలాగు గావించ నూహించి తాలా గగున్, నీ కసాధ్యంబు లే మున్న వోపన్నగవ్యూహ సమ్రాడ్తులాకోటిభృద్గేహినీ! విశ్వసంమోహినీ!! సౌధపాథోధిరాడంతరానంత రత్నాంతరీపస్థిరామధ్యమాద్యత్కదం బాటవీ వాట ఘోటద్ద్రుమూలస్థలీ దివ్యచింతామణీభద్రపీఠాగ్రసంవాహినీ! వాసవాద్యష్టదిక్పాలకాదిత్యగంధర్వ రుద్రానిలవ్యాళవస్వప్సరస్సిద్ధ సాధ్యాది దివ్యస్తవాకర్ణనారోధ కర్ణోత్పలామోదలోభ భ్రమ ద్భంభరోజ్జృంభిత శ్రీసఖత్పార్శ్వ భాస్వద్వయ స్యామణీచామరవ్రాతజాతానిలాధూత నీలాలకస్నిగ్ధముగ్ధేందునీలాలసత్ఫాల కస్తూరి కాచిత్ర కోద్భాసినీ! సంతతోల్లాసినీ!! గౌరి మాహేశ్వరీ! శాశ్వతైశ్వర్యలక్ష్మీకరీ! శాంకరీ! కాళి కంకాళనాళీకధారావళీ భీత భర్గాశ్రిత స్వీయ వక్షోరుహక్షోణిభృద్దుర్గ! దుర్గా! మహాదేవి! దేవీమతల్లీ! శ్రితార్తిచ్ఛటాభల్లభిల్లీ! ననున్ గన్న తల్లీ! నమత్కల్పవల్లీ! నమస్తే నమస్తే నమః | 435 |
| కం. | అని కొనియాడిన గిరిజా వనజానన సంతసించి వల్లభుమదిలో నెనరొలయఁదెలిసి యయ్యిలఁ గనుఁగొని యిట్లనియెఁ గరుణ కడలుకొనంగన్ | 436 |
| కం. | సగపాలు శంకరుండును సగపా లే నగుట నీకు సగ మియ్యఁదగున్ మగువవయి కొన్ని నాళ్లున్ మగతనమునఁ గొన్ని నాళ్లు మనుమిఁకమీఁదన్ | 437 |
| వ. | అని పలికి య ప్పరమేశ్వరి యిట్లనియె | 438 |