| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | పార్వతీదేవి యిలునకు నొకమాసము మగతనము నొకమాసము మగువతనంబును గలుగునట్టు కరుణించుట |
| ఉ. | ఎన్ని దినంబు లింతితన మీవు వహించి చరించె దుర్విలో నన్ని దినంబు లుండుము నృపాకృతి నెక్కటి పౌరుషంబుతో నున్నపు డింతివౌ టెఱుఁగకుండుము, కామినివైన వేళ ము న్నున్న నృపత్వమున్ మఱచియుండుము, రెంటను సౌఖ్యమబ్బెడిన్ | 439 |
| చం. | వలదు విచారమన్నను భవానికి నయ్యిల మ్రొక్కి క్రమ్మఱన్ బలికె మహాప్రసాద మనపాయదయానిధి! నీ యనుజ్ఞచే నలయక యొక్క మాసము నృపాకృతిఁజెందుచు నొక్కమాసమి చ్చెలితన మొందుచున్ గ్రమణసేసెదఁగాలము పంపవే! యనన్ | 440 |
| కం. | మంచిది యటువలె నౌఁబొ మ్మంచును బొమ్మంచు మోవి హసనాంకురముల్ మించఁగ గిరిసుత పంచినఁ జంచలలోచనలు గొల్వఁ జనె నిల యనుచున్ | 441 |
| పంచచామరము | ఇలాసుతాధినాథుఁ డాన తిచ్చినన్ సవిస్మయా త్ములై సహోదరుల్ నరేంద్ర! తొంటి రూపు వాసి య య్యిలుండు కాంతయై మఱెక్కడెక్కడన్ మెలంగె? నే స్థలంబునన్ జెలంగెఁ? దద్విధంబు దెల్పవే యనన్ | 442 |
| ఉ. | తమ్ములఁజూచి రామవసుధాపతి యిట్లను నట్లు గౌరిచే సమ్మతిమై వరంబుగొని సర్వసుహృద్భటమంత్రిపుంగవుల్ గొమ్మలపోడుముల్ దొరసి కొల్వఁగ వాహనకోటి నొక్క పా ర్శ్వమ్మున డించి యయ్యిల ప్రసన్నమతిన్ విహరించెఁగానలన్ | 443 |
| సీ. | తిరుగు నొక్కొకచోటఁ జరణాబ్జములు సోఁకి - మహి యెల్ల మెట్టదామరలు గాఁగ బలుకునొక్కొకచోటఁబలుకు చెక్కరలకై - కలికి రా చిలుకల బలఁగ మొలయఁ జూచునొక్కొకచోటఁ జూపులు పొదలపై - నెనసి తేఁటుల దాటు లినుమడింప నవ్వునొక్కొకచోట నవ్వు వెన్నెలలచే - వనములో నెల్లఁ గ్రొన్ననలు మించఁ | |
| గీ. | జక్కముగఁబాటఁబాడు నొక్కొక్కచోట డగరుకోయిల లెల్లఁ జుట్టఱిక మరయ సొలసి యొక్కొకచో నిల్చు సొగసుమేని కమ్మతావులు దిశలెల్ల గమ్ముమనఁగ | 444 |
| వ. | ఇవ్విధంబునఁ బ్రథమమాసంబున నసమానవిలాసంబుల మించునమ్మించు బోఁడి త్రిలోకకామినీకామనీయకంబులకు నాస్పదం బై, సానుమత్సాను భాగంబుల సానఁదీరినమానికంబువలె డంబు గని, ఘనతరవనౌఘ మేఘమాలికలయంచలన్ దులకించుతొలుకరిమించుమించుల మించు వహించి, మహిత నికుంజపుంజమ్ములచేరువలన్ చారుమల్లికామతల్లి కాసముల్లాసంబు లెల్లఁ గొల్లలాడి, కలంకు లేనికొలంకులకెలంకులఁ బంకజభవుని వారువంబుగారవంబున సౌరువడసి, విడిసినచోట విడియక, నిలిచినచోట నిలువక, చూచినచోటఁజూడక, ఆడినచోట నాడక, పాడిన చోటఁ బాడక, కోడెప్రాయంబు గలతోడి చేడియలఁ గూడుకొని, వేడుకతోఁ బెక్కుజాడలఁ గ్రీడించుచు, నొక్కనాఁడు, చొక్కపుఁగొండకుఁ జక్కని దక్షిణంబునఁ జుక్కలరాజచక్కనికొడుకు తపంబుసేయువెక్కుతరుల తాదులం బెం వెక్కునొక్క యక్కజంపు వనంబు గనితఱియం జొచ్చి యచ్చట. | 445 |
| కం. | విహరించుచు విరిపూ దా వి హరించుచు గాడ్పు మెలఁగ విలసిల్లుచు న మ్మహిళామణి సహచరబహు మహికటులం గూడి గహనమధ్యమునందున్ | 446 |
| చం. | గగనముతోడ రాయు నొక గట్టుఁగనుంగొని హొన్ను చాయలన్ దగు నొక దివ్యచంపకవనంబునఁ గంకణపద్మరేఖలన్ దగి కమలాకరత్వము యథాతథభావమునం బొసంగి చె న్ను గులుకునొక్క దీర్ఘికఁగనుంగొని తజ్జలమధ్యమంబునన్ | 447 |