| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఇలను బుధుఁడు వరించిన కథ |
| కం. | మరునిన్ వేలుపు రాచకొ మరునిన్ నగు సొగసు మించ మహిమ రహించన్ దురుసు తపమూని తగు చం దురు సుతు బుధుఁజూచి యిల మనోజాతురమై | 448 |
| చం. | “ఎగు బుజముల్ వెడందయుర మిందుని గిందుని మించనీని నె మ్మెగమపరంజిడాల్ తలిరుమోవియుఁ జేరలమీఱు కన్నులున్ జిగి గల పెందొడల్ గలిగి చెల్వువహించిన యీతఁడీడ బె ట్టుగ తప మూనినాఁడు చెలులార! కనుంగొనుఁ” డంచుఁదెల్పుచున్ | 449 |
| కం. | వికచారవిందబృంద ప్రకటతరామోదభరితపాటీర మరు న్నికర చలాచల నీలా లకలు సకులు గొల్వ నక్కొలఁకు సేరి వెసన్ | 450 |
| తే.గీ. | కలికి రాయంచవలె సోయగంపు నడలు గులుక నక్కల్కి చెంగావి కోక వదలి చలువ పావడతోఁజొచ్చెఁ గొలఁకు నెలకు మారుపై మారుఁడనుచుఁ గటారిఁ బోలె | 451 |
| వ. | అప్పుడు | 452 |
| చం. | హళకళి సేయుచున్ జలరుహంబులు గోయుచు మీఁద వేయుచున్ నిలుమని హెచ్చరించుచును నీళ్లను ముంచుచు నుత్సహించుచున్ బులుగులఁదోలుచున్ గలువపువ్వుల వ్రాలుచుఁ దావిఁగ్రోలుచున్ వెలఁదుక లొండొరుల్ గొలన వేడుకఁగూడుక క్రీడసేయఁగన్ | 453 |
| శా. | తత్కాంతా కుచశైల ఘట్టన సముద్యత్తుంగ భంగైక రం గత్కంజాత సమంజస భ్రమరఝంకారానుకారి స్ఫుర త్ఫూత్కారాన్విత వారివారణ కరాధూతాళి కోయష్టికా ద్యుత్కంఠార్భటి వీనులన్ బడిన నెంతో సౌమ్యుఁడుద్భ్రాంతుఁడై | 454 |
| తే.గీ. | తపము సాలించి వారిలోఁ దళుకు వాలు గన్నులను వాలుగన్నుల చెన్నువెలయు నన్నెలఁత చిన్న ప్రాయంపుఁ జిన్నె లెల్లఁ జోద్యపడి ఱెప్పవేయక చూచెనంత | 455 |
| తే.గీ. | మోదమున నైదు తూపుల పాదుషాహి తమ్మి దోదుమ్మిఁగొంది డెందమ్ము గ్రుమ్మి క్రమ్ముకొని దొమ్మిసేసిన సొమ్మసిల్లి యమ్మహామహుఁ డిట్లను నెమ్మనమున | 456 |
| ఉ. | ఎక్కడినుండి వచ్చెనొకొ యిచ్చెలి! యెవ్వని ముద్దుగుమ్మయో ! యెక్కడి సోయగం బిది! సురేంద్రుని కొల్వుమెఱుంగుబోండ్ల కీ చక్కఁదనంబు లున్నవె! బిసప్రసవప్రభవుండు వింతగా నిక్కలకంఠ కంఠి సృజియింపఁగ నెట్టి తపం బొనర్చెనో! | 457 |
| మ. | చిగురాకుం జిగినేలుఁ గేలుగవడాల్ చెందమ్మి చందంబునన్ సొగసొందున్ మొగ మిందుకాంతరుచి మించు చెక్కుల్ జగా పగడంబున్ బగడంబునన్ బెదవి మేల్ పాలిండ్లు హొంగిండ్లనన్ దగురా! యీ మృగరాజమధ్య సరిచానన్ గాననేనెక్కడన్! | 458 |
| చం. | పలుమఱుఁగప్పు పెన్నెఱులు బారలఁగల్వఁగవచ్చు నచ్చపున్ దెలి జిగి చెక్కుటద్దముల నీడలు సూడఁగవచ్చుఁగాంచనా చలయుగి గల్గినన్ గలికి చన్గవతో సరితూఁచవచ్చు ని చ్చెలి నడుమే యలంతి యని సింగము గెల్వఁగవచ్చు బాపురే! | 459 |
| ఉ. | కొంకక గుబ్బచన్నులను గుంకుమ పంకమలంది చెక్కులన్ సంకుమదంబుఁబూసి నెఱజాణతనంబున జాతికస్తురిన్ బొంకముమీఱఁగా నుదుట బొట్టిడి పువ్వుల శయ్యఁజేర్చి మీ నాంకుని కేళినేలి జవరాలికి బాళిఘటింతు నెన్నఁడో! | 460 |
| ఉ. | ఏల తపంబులున్ వ్రతము లీ లలితాంగినిగూడియుండినన్ జాలదె! యంచు నక్కొలఁకుఁ జయ్యన వెల్వడి పర్ణశాలకున్ బాళి దలిర్పనేఁగి ముని బాలురచే బుధుఁ డయ్యిలాఖ్యనీ లాలక యాళులన్ నలుగురైదుగురిన్ బిలిపించి యిట్లనున్ | 461 |
| చం. | అలికులవేణులార! యిపు డబ్జవనంబునఁ దమ్మితూపులన్ వెలఁదిని వ్రేయుచున్ వలచెవిన్ ధరియించిన నల్లగల్వపై నొలసిన తేఁటిఝంకృతుల కుల్కుచుఁగుల్కుచుఁగేళిసల్పు నా నళినదళాక్షి కెవ్వఁడధినాథుఁ డదెవ్వతె దెల్పరే? యనన్ | 462 |
| కం. | నెల తనయుని పదముల క న్నెలఁతలు నతులాచరించి నిలిచి “యనఘ” య చ్చెలి మాకెల్ల నధీశ్వరి యళి చేరని పువ్వు వంటి దని తెల్పుటయున్ | 463 |
| కం. | తన యోగదృష్టిఁ గర్దమ తనయోదంతంబు తుద మొదలునేర్పడఁగ న్గొని నేర్పడరన్ బుధుఁడ వ్వనితల వీక్షించి పలికె వారని కరుణన్ | 464 |
| చం. | సరసిజనేత్రలారా! శివశప్తవనంబున మీరు స్త్రీత్వమున్ బొరసితి రింక మీ జననముల్ ఫలియింపఁగ నా యనుజ్ఞఁ గిం పురుషుల భార్యలై సుఖముఁబొందుఁడు వారలనే సృజించి యి ద్ధర మును నిల్పినాఁడనని తత్‌క్షణ మందఱ వీడుకొల్పినన్ | 465 |
| కం. | ఇల యొక్కతె దక్కఁగ నిల చెలు లందఱు నతని యాజ్ఞతోఁ గింపురుషా వళిఁగలిసి వెలసి రొంటిగ నిలిచిన యిలఁజేరి బుధుఁడనియె ననురక్తిన్ | 466 |
| చం. | సరసమరాళసంగతిఁ బొసంగని పద్మినిఁబోలి కోకిల స్ఫురణములేని మామిడినిఁబోలి మదభ్రమరాభియోగమున్ బొరయని పుష్పమంజరిని బోలి వృథా వసియింపనేల? నన్ వరునిగ నింకఁజేకొని భవంబు ఫలింప సుఖింపవే చెలీ! | 467 |
| ఉ. | ఎవ్వఁడొవీఁడటంచు నను నిచ్చఁదలంపకు మిందుపుత్రుఁడన్ జవ్వని! నే బుధుండ నినుఁజక్కఁగనుంగొనినంతనుండియున్ బువ్విలుకాఁడు నా హృదయమున్ నొగిలింపుచునున్నవాఁడు నీ నవ్వు మొగంబు నా మొగమునన్ గదియింపవే! యాదరింపవే! | 468 |
| చం. | ఇగురులవంటి నీ యడుగు లిక్కడి కర్కశభూమి సోఁకినన్ నొగిలెనొ? యంచు నా మనసు నొప్పి వహించిన దింత మక్కువన్ దగిలిన నన్నుఁ బాసి చన ధర్మువుగా దిఁక లెస్స చూడవే మగువ! యటంచు నాతఁడనుమాటకు మో మఱవంచి సిగ్గునన్ | 469 |
| చం. | ఎలనగ వంకురింప నల యిందునిభానన పల్కె - స్వామి! నీ పలుకొనరించుటెంతయును భాగ్యముగాదె సుఖింపుఁ డిచ్చకున్ వలసినయట్టు లేమిటికి నన్నుడుగన్ బతివీవు భార్యనే నెలమి నొనర్చె మన్మథుఁడె యిద్దఱకున్ దగులాట మియ్యెడన్ | 470 |
| కం. | అను మాటలు చెవి నాటిన ననుమానము మాని సౌమ్యుఁ డలరుచునపు డ య్యనుమాన మధ్యఁజేకొని యెను మానసభవుని పంత మీడేరంగన్ | 471 |
| వ. | ఈ విధంబున నల భావజుని హావభావంబు లలర నయ్యలరుబోఁడిం బరిగ్రహించి మించు పూవుతావుల గుబాళించు తన పర్ణశాలఁప్రవేశించెనప్పుడు | 472 |
| తే.గీ. | అయ్యలరుబోఁడి సిగ్గరియయ్యు నిచ్చఁ బచ్చవింటి దునేదారి హెచ్చరింపఁ బతికి విడె మిచ్చి యడుగులు బత్తినొత్త బాళి గనుపించఁ దమి హెచ్చి పలికె బుధుఁడు | 473 |
| సీ. | కలికి! కప్పురపు బాగా లొసంగిన యట్ల - వేడుకతో ముచ్చటాడితేని మగువ! యీ తెలియాకు మడుపు లిచ్చిన యట్ల - యెలమిఁ జెక్కిలిఁ జీఱనిచ్చితేని చెలి! పాదములఁ గేలుఁజిగురులుంచినయట్ల - చిగురువాతెఱ దయసేసితేని కొమ్మ! వీజనము సేకొని విసరినయట్ల - కమ్మయూ ర్పొలయఁబైఁగ్రమ్మితేని | |
| గీ. | వెలఁది! తగుసేవ నీవు గావించినటులఁ గోర్కి మీఱంగ నన్నేలు కొంటివేని నేల యాలస్య మీవేళఁ దాళనీఁడు విరులవిల్కాఁడు కౌఁగిలీవే లతాంగి! | 474 |
| చం. | అని మృదులోరులం దిడి నిజాంఘ్రి సరోజము లొత్తుచున్న చ క్కని చెలి మీఁదికిం దిగిచి గ్రక్కున నక్కున నుంచినంతఁ బ్ర క్కనఁ దనయంత వీడె సతికంచుక మిర్వుర గాత్రసీమలన్ మునుకొనియెన్ మరుం డిడిన ముల్కులొ నాఁబులకాంకురావళుల్ | 475 |
| చం. | చనుఁగవపేరి హేమకలశద్వయి డాసినచో వడంకుచున్ మినుకుఁగడాని చెక్కులను మీటఁగఁబూనెడుచోఁ జెమర్చుచున్ మొనసి కటీసువర్ణధర ముట్టినచోఁబులకల్ వహింపుచున్ వనజదళాక్షిఁ గూడునెడ వల్లభుకేల్ దగెఁదస్కరాకృతిన్ | 476 |
| ఉ. | అంటినఁ గందునో యనక యంగము నిర్దయవృత్తిమీఱఁ గౌఁ గింటికిఁదార్చి, నుజ్జగునొ కెంజిగురట్టిదినాక మోవిఁబ ల్గంటు లొనర్చి, చన్గవ నలంగునొ నాక నఖాళిఁ జేర్చి, వా ల్గంటి రమించె నాథుఁడు- స్వకార్యపరుల్ మగవార లెంచఁగన్ | 477 |
| సీ. | నునుఁజెమ్మటలఁగరంగిన యంగరాగకుం - కుమరక్తి యెఱమట్టి కొమరుగాఁగ నిర్దయాశ్లేష సన్నిహితాంగములఁజెలం - గుట భుజాభుజిఁబెనంగుటలు గాఁగ నన్యోన్య దంతాంచలాక్రాంతరవముఖో - ద్ధతు లౌడుగఱచు చందములు గాఁగ గల్లస్థల చపేట గాఢవక్షోఘట్ట - నాదులు ముష్టిప్రహతులు గాఁగ | |
| గీ. | జంకెనలు వాడిచూపులు బింకములు గ ళాతిరవములు బైకొను నలవు లుల్ల సములు నగవులుఁ దెగువలు సమముగాఁగ మల్లయుద్ధంబుఁబోలె దంపతుల రతము | 478 |
| చం. | ఇటువలె నయ్యిలం గలసి యిందుకుమారుఁడు చంద్రకాంతసం ఘటితలసద్వితర్దికల గ్రావగుహాకుహరంబులన్ సర స్తటములఁ జల్వ చప్పరపుఁజాయల మవ్వపుఁబువ్వుఁదోఁటలన్ బటుతర మంజుకుంజ గృహభాగములన్ విహరింపుచున్నెడన్ | 479 |
| కం. | కళలు గలవాని కొడుకున్ గలసిన యయ్యిలకు నొక్క కళయై చనె న న్నెల యతఁడు గళవళింపఁగఁ బొలఁతి తనము మాని యంతఁ బురుషుండయ్యెన్ | 480 |