| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ఇల బుధునివలనఁ బురూరవుండను కుమారుం గనుట |
| చం. | ఇలుఁడిటులన్ నిజాకృతి వహించి, మహేశ్వరునాజ్ఞ బోటియై మెలఁగుట లచ్చటన్ బుధు రమించుట మాస మతిక్రమించుటల్ దెలియక, మున్ను వేఁట చనుదెంచుట లెంచుచు సేన నవ్వన స్థలి వెదకన్ దొడంగె గిరిజాసతి మాటకుఁ దప్పుగల్గునే? | 481 |
| కం. | వనమెల్ల వెదకి యచ్చటఁ దనసేనన్ గాన కతఁడు తహతహతోడన్ జనుదెంచి సరసి మధ్యం బున నుగ్రతపం బొనర్చు బుధుఁబొడగాంచెన్ | 482 |
| చం. | పొడగని యమ్మహామహుని పొంతకుఁబోయి నమస్కరించి యో యుడుపతిపుత్ర! బాహ్లియన నొప్పెడు ప్రోలునకేను రాజు ని య్యడవికి వేఁట వచ్చితి భటాదులుగూడుక వారలెల్ల నె క్కడఁజనిరో ననున్ విడిచి కాననన్ బుధుఁడిట్లనున్ గృపన్ | 483 |
| మ. | వసుధాధీశ్వర! నీ భటుల్ పటుశిలావర్షంబుచేఁగొందఱు గ్రసమీరోద్ధతిఁగొందఱున్ మడసి రింకన్ వారికై కుంది పా లసునింబోలకు, కందమూల ఫలముల్ భక్షించి యీ యాశ్రమం బు సమస్తార్తి హరంబు నిల్వుమిచటన్ మోదంబుతో నావుడున్ | 484 |
| శా. | ఆ బాహ్లీకుఁడు సమ్మతించి యనునయ్యా! మంత్రిసామంత నా నా బంధుప్రకరంబు లెల్ల వనిలోనం ద్రెళ్ళ నేకాకినై నేఁబోనొల్లఁ బురంబుఁజేర నిచటన్ నీ పాదముల్ గొల్చుచున్ మీ బోధల్ వినుచున్ గ్రమింతు దినముల్ మీరిప్పుడన్నట్టులన్ | 485 |
| కం. | విశదయశో-మృతనిధికిన్ శశి బిందువుగాఁగఁ జెలఁగు సత్సుతుఁడిపుడా శశిబిందుఁడు భూభరమస దృశగతి భరియించుఁగాన యిఁకనని పలుకన్ | 486 |
| కం. | అల రాజతనయుఁ డలరుచు నిలరాజ! యటైన మంచి దేడా దిచటన్ నిలువుము నీకు శుభంబులు గలిగెడి నని తెలుప నతఁడు గైకొని నిలిచెన్ | 487 |
| కం. | అన్నెల గడచినఁగ్రమ్మఱఁ గ్రొన్నెల కళనుదురు గలుగుకోమలి యయ్యెన్ వెన్నెల గీము కుమారుఁడు గన్నులలరఁజూఁచి దానిఁగలసి సుఖించెన్ | 488 |
| కం. | మగువయయి వలఁచియుండున్ మగవాఁడై కొలిచియుండు మదనుని బావన్ మగతనము మగువతనమును జగతీనాయకుఁడు దనకు సఫలతఁజెందన్ | 489 |
| తే.గీ. | మగువయైయున్న నెలయెల్ల మమతఁబూని చాల ననురక్తుఁడైయుండుఁ జంద్రజుండు మగతనము గన్న నెలయెల్ల మమతమాని తా నతివిరక్తుఁడై ఘోరతపముసేయు | 490 |
| కం. | విరహాగ్ని మాన్చుకొనఁ జను కరణిఁదరుణిఁ బాసినపుడు కాసారజలాం తరమగ్నుండగు నానం దరసాంబుధి మగ్నుఁడగు నతఁడు చెలిఁగన్నన్ | 491 |
| కం. | నెలపట్టి యిటుల నలరఁగ నిలయై యొక నెలయు మరల నిలుఁడై నెలయున్ మెలఁగుచుఁగ్రమమునఁదొమ్మిది నెలలు సనఁబురూరవుం గనియె నదియంతన్ | 492 |
| తే.గీ. | ఆ పురూరవుఁబోషింపుఁడనుచు నాత్మ గురున కొప్పించె బుధుఁడాతఁడురుసుధార సంబుఁద్రావించి పెంచె వాత్సల్యముంచి యంచితకళా ప్రపంచజ్ఞుఁడయ్యె శిశువు | 493 |
| ఉ. | అంతట నింతియౌటుడిగి యయ్యిలుఁడెప్పటిలీలఁగొల్వఁగా నెంతయుఁ గూర్మివుట్టి బుధుఁడీతని దుర్దశ నింక మాన్తునం చాంతరవైరిహంత లగు నత్రిభృగుచ్యవనాది మౌనులన్ శాంతులఁబిల్వఁగాఁబనిచి చారుసపర్య లొనర్చి యిట్లనున్ | 494 |