ఇతిహాసములు ఉత్తరరామాయణము ఇలుఁ డశ్వమేధముజేసి శివుని యనుగ్రహమునఁ దన స్త్రీత్వంబుఁ దొలఁగించుకొనుట
ఇలుఁ డశ్వమేధముజేసి శివుని యనుగ్రహమునఁ దన స్త్రీత్వంబుఁ దొలఁగించుకొనుట
కం.ఈ యిలుని యంగనాత్వముఁ
బాయంగాఁ జేయుటకు నుపాయంబేమో?
మీ యందఱు నాలోచన
సేయందగు ననిన వారు చింతించునెడన్‌
495
చం.క్రతుపులహాదియుక్తుఁడయి కర్దముఁ డచ్చటికేఁగుదెంచి య
య్యతులను సౌమ్యుఁడున్‌ జరుపు నర్చనలన్‌ ముదమంది పుత్రు నా
నతుఁగని యాదరించి - కరుణానిధియౌ శివుఁగూర్చి విశ్వవ
ర్ణితమగు నశ్వమేధ మొనరింపక యిద్దురవస్థ తీఱునే?
496
కం.మటుమాయ యాఁడుతనమొ
క్కటియు నడచుపని యదెంతగల? దతని కతం
డెటువలె వలసిన నటువలె
ఘటియింపన్‌గలఁ డటంచుఁగర్దముఁడనినన్‌
497
తే.గీ.అందఱును సమ్మతించి శివార్పణముగ
నశ్వమేధంబు సేయించి రతనిచేత
యాగపరిపూర్ణకాలంబునందు మునుల
కిందుధరుఁడు ప్రసన్నుఁడై యిట్టులనియె
498
ఉ.మీ రొనరించినట్టి హయమేధము మెచ్చితి మౌనులార! మీ
కోరినయట్ల యియ్యిలునకున్‌ బురుషత్వము శాశ్వతంబుగాఁ
గూరిమి నిచ్చితిన్‌ మఱియుఁగోరికలున్నవె తెల్పుఁడన్న న
క్కారుణికాగ్రగణ్యునకుఁ గర్దమముఖ్యులు మ్రొక్కి వేడుకన్‌
499
కం.వేదాంతములకుఁదోఁపని
నీ దివ్యపదాంబుజములు మే మిప్పుడు స్వా
మీ! దర్శించితి మింతయ
కాదే మా మనసులందుఁగల కోరికయున్‌
500
కం.నారీత్వములే కెప్పటి
పౌరుషమున బ్రతుకు మనుచుఁ బలికితిరిగదా!
ఈ రాజు నదియయందఱి
కోరిక యని పొగడ శివుఁడగోచరుఁడయ్యెన్‌
501
కం.మునులరిగి, రంత నిలుఁడు బు
ధుని వీడ్కొనియతని పుత్రుఁదోడ్కొని జనకుం
డనుమతి సేయఁ బ్రతిష్ఠా
ననగరముననిలిచి భూజనంబులఁబ్రోచెన్‌
502
తే.గీ.అతని వెనుకఁ బురూరవుండప్పురమున
కధి విభుండయ్యె నటుగాన నశ్వమేధ
యాగ మఖిలార్థసాధకం బనుజులార!
యని రఘుస్వామి మఱియు నిట్లనుచుఁ బలికె
503
కం.భూనుతమైన యిలోపా
ఖ్యానం బిది వినిన జనుల కఘనాశనమౌ
నానర్థంబులుఁ జేకుఱు
మానితముగ నశ్వమేధమఖఫల మొదవున్‌
504
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju