| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| సీ. |
కౌండిన్యగోత్ర సంకలితుఁ డాపస్తంబ సూత్రుండు పుణ్యుండు సుభగుఁడైన భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ, కలకంఠి తద్భార్య గౌరమాంబ కమలాప్తు వరమునఁ గనిన సోమనమంత్రి వల్లభ మల్లమ, వారి తనయుఁ డెల్లన, యతనికి నిల్లాలు మాచమ వారిపుత్త్రుఁడు వంశవర్ధనుండు |
|
| ఆ. |
లలితమూర్తి బహుకళానిధి కేసన, దానమాననీతిధనుఁడు ఘనుఁడు దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ, మనియె శైవశాస్త్రమతముఁ గనియె. |
24 |
| క. |
నడవదు నిలయము వెలువడి, తడవదు పరపురుషు గుణముఁ దనపతి నుడువుం గడవదు, వితరణ కరుణలు, విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్. |
25 |
| ఉ. |
మానిను లీడుగారు, బహుమాన నివారిత దీనమానస గ్లానికి, దానధర్మమతిగౌరవమంజులతా గభీరతా స్థానికి, ముద్దసానికి, సదాశివపాదయుగార్చనానుకం పానయవాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్. |
26 |
| క. |
ఆ మానినికిం బుట్టితి, మే మిరువుర; మగ్రజాతుఁ డీశ్వరసేవా కాముఁడు తిప్పన; పోతన, నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్. |
27 |
| వ. | అయిన నేను నా చిత్తంబునఁ బెన్నిధానంబునుంబోని శ్రీరామచంద్రు సన్నిధానంబుఁ గల్పించుకొని | 28 |