పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
షష్ఠ్యంతములు
ఉ. హారికి, నందగోకులవిహారికిఁ, జక్రసమీర దైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్‌.
29
ఉ. శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్త ని
ర్మూలికి, ఘోరనీరదవిముక్తశిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్‌, విపులచక్రనిరుద్ధమరీచిమాలికిన్‌.
30
ఉ. క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధఘోరవాహినీ
హంతకు, నింద్రనందననియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్‌.
31
ఉ. న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్స్థాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహమందిరయాయికి, శేషశాయికిన్‌.
32
వ. సమర్పితంబుఁగా నే నాంధ్రంబున రచియింపం బూనిన శ్రీమహాభాగవతపురాణంబునకుం గథాప్రారంభం బెట్టిదనిన. 33
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )