పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
నారదుని పూర్వజన్మ వృత్తాంతము
వ. మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి దాసికిం బుట్టి పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థలనివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు. 103
క. ఓటమితో నెల్లప్పుడుఁ, బాటవమునఁ బనులు సేసి బాలురతో నే
యాటలకుఁ బోక యొక జం, జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా!
104
క. మంగళ మనుచును వారల, యెంగిలి భక్షింతు; వాన కెండకు నోడన్‌;
ముంగల నిలుతును నియతిని; వెంగలి క్రియఁ జనుదు నురువివేకము తోడన్‌.
105
వ. ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నాయందుఁ గృపసేసి రంత. 106
శా. వారల్‌ కృష్ణు చరిత్రముల్‌ చదువఁగా వర్ణింపఁగాఁ బాడఁగా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్‌ వీనులం
దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభదూరుండనై.
107
వ. ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూపకుండనయిన నాయందు స్థూల సూక్ష్మంబయిన యీ శరీరంబు నిజమాయాకల్పితంబని య మ్మహాత్ములగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణపరిహారిణి యయిన భక్తి సంభవించె; నంతఁ జాతుర్మాస్యంబు నిండిన న య్యోగిజనులు యాత్ర సేయువారలై; రివ్విధంబున. 108
మ. అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తియుక్తుండనై
చపలత్వంబును మాని నేఁగొలువఁగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్యసంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్‌.
109
వ. ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబుఁ దెలిసితి; నీశ్వరునియందు సమర్పితం బయిన కర్మంబు తాపత్రయంబు మానుప నౌషధంబగు; నే ద్రవ్యంబువలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుపనేరదు; ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్స మానుప నోపు; ఇ వ్విధంబునఁ గర్మంబులు సంసారహేతుకంబు లయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపియుండు; నీశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై నీశ్వరసంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు; నీశ్వరశిక్షంజేసి కర్మంబులు సేయువారలు కృష్ణగుణ నామవర్ణన స్మరణంబులు సేయుదురు; ప్రణవపూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్ష ణానిరుద్ధమూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు, మూర్తిశూన్యుండు నయిన యజ్ఞపురుషుం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుం డగు. 110
క. ఏ నవ్విధమునఁ జేయఁగ, దానవకులవైరి నాకుఁ దనయందలి వి
జ్ఞానము నిచ్చెను మదను, ష్ఠానము నతఁ డెఱుఁగు, నీవు సలుపుము దీనిన్‌.
111
క. మునికులములోన మిక్కిలి, వినుకులు గలవాఁడ వీవు; విభుకీర్తులు నీ
వనుదినముఁ బొగడ వినియెడి, జనములకున్‌ దుఃఖ మెల్ల శాంతిం బొందున్‌.
112
వ. ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియె. 113
మ. విను మా భిక్షులు నీకు నిట్లు కరుణన్‌ విజ్ఞానముం జెప్పి పో
యిన బాల్యంబున వృద్ధభావమున నీ కే రీతి సంచారముల్‌
సనె? నీ కిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ? ద
త్తనువుంబాసిన చంద మెట్లు? చెపుమా! దాసీసుతత్వంబుతోన్‌.
114
వ. అని యిట్లు వ్యాసుం డడిగిన నారదుం డిట్లనియె, దాసీ పుత్రుండ నయిన యేను భిక్షుల వలన హరి జ్ఞానంబు గలిగి యున్నంత. 115
సీ. మమ్ము నేలినవారి మందిరంబునఁ గల పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి
తన పరాధీనతఁ దలఁపదు; సొలసితి నలసితి నాకొంటి ననుచు వచ్చి
మాపును రేపును మా తల్లి మోహంబు సొంపార ముద్దాడు; చుంచు దువ్వు;
దేహంబు నివురు; మోదించుఁ; గౌఁగిటఁ జేర్చు; నర్మిలి న న్నిట్టు లరసి మనుప
 
ఆ. నేను విడిచి పోక యింట నుండితి నయ్య!, మోహిఁగాక, యెఱుక మోసపోక,
మాఱుచింత లేక మౌనినై యేనేండ్ల, వాఁడ నగుచుఁ గొన్ని వాసరములు.
116
క. సదనము వెలువడి తెరువునఁ, జెదరక మా తల్లి రాత్రిఁ జీఁకటివేళన్‌
మొదవుం బిదుకఁగ నొకఫణి, పదభాగముఁ గఱచెఁద్రొక్కఁబడి మునినాథా!
117
క. నీలాయతభోగఫణా, వ్యాళానలవిషమహోగ్రవహ్నిజ్వాలా
మాలావినిపాతితయై, వ్రాలెన్‌ ననుఁ గన్నతల్లి వసుమతి మీఁదన్‌.
118
ఉ. తల్లి ధరిత్రిపై నొఱఁగి తల్లడపాటునుఁ జెంది చిత్తముం
బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచినొందక సంగము వాసె మేలు రా
జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధి సేయుచున్‌.
119
వ. ఉత్తరాభిముఖుండనై యేను వెడలి జనపదంబులుఁ బురంబులును బట్టణంబులును గ్రామంబులుఁ బల్లెలు మందలు మహోద్యానంబులుఁ గిరాత పుళింద నివాసంబులును వనంబులుఁ జిత్రధాతువిచిత్రితంబు లయిన పర్వతంబులు సమద కరికర విదళిత శాఖలు గల శాఖులును, నివారిత పథిక జనశ్రమాతిరేకంబులైన తటాకంబులు బహువిధ విహంగ నినద మనోహరంబులై వికచారవింద మకరంద పాన పరవశ పరిభ్రమద్భ్రమర సుందరంబులైన సరోవరంబులు దాఁటి చనుచు క్షుత్పిపాసాసమేతుండనై యొక్క నదీహ్రదంబునఁ గ్రుంకులిడి శుచినై నీరు ద్రావి గతశ్రముండనై 120
క. సాలావృక కపిభల్లుక, కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ, వ్యాళాజగరాదిభయద వనమధ్యమునన్‌.
121
వ. దుస్తరంబు లైన నీలవేణు కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక్క రావిమ్రాని డగ్గఱఁ గూర్చుండి యే విన్న చందంబున నా హృదయగతుం బరమాత్మస్వరూపు హరిం జింతించితి. 122
శా. ఆనందాశ్రులు గన్నులన్‌ వెడల రోమాంచంబుతోఁ దత్పద
ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో న ద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగ లేనైతిన్‌ నను న్నీశ్వరున్‌
నానాశోకహమైన యత్తనువు గానన్‌ లేక య ట్లంతటన్‌.
123
వ. లేచి నిలుచుండి క్రమ్మఱ న ద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున నిలుపుకొని యాతురుండునుంబోలెఁ జూచియుం గానలేక నిర్మనుష్యంబైన వనంబునం జరియించుచున్న నన్ను నుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర మధురంబులైన వచనంబుల శోకం బుపశమింపం జేయు చందంబున నిట్లనియె. 124
ఉ. ఏల కుమార! శోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ
జాలవు నీవు; కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి గానఁగాఁ
జాలఁడు; నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తిఁ జూపితిన్‌.
125
క. నావలని కోర్కి యూరక, పోవదు; విడిపించు దోషపుంజములను; మ
త్సేవం బుట్టును వైళమ, భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.
126
క. నాయందుఁ గలుగ నీ మది, వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీఁదట, మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై.
127
మ. విను మీ సృష్టి లయంబు నొంది యుగముల్‌ వేయైన కాలంబు యా
మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁజూ మీఁదం బునఃసృష్టి యం
దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు; నిర్దోషుండవై నా కృపన్‌
ఘనతం జెందెదు శుద్ధసాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!
128
వ. అని యిట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి, సర్వనియామకంబైన మహాభూతంబు పలికి యూరకున్న నేనును మస్తకంబు వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించుచు మదంబు దిగనాడి, మచ్చరంబు విడిచి, కామంబు నిర్జించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబుల వెడల నడిచి, సిగ్గు విడిచి, యనంతనామంబులు పఠించుచుఁ, బరమభద్రంబు లయిన తచ్చరిత్రంబులం జింతించుచు, నిరంతర సంతుష్టుండనై కృష్ణుని బుద్ధి నిలిపి, నిర్మలాంతఃకరణంబుతోడ విషయ విరక్తుండనై కాలంబున కెదురు సూచుచు భూమిం దిరుగుచు నుండునంతం గొంతకాలంబునకు మెఱుంగు మెఱసిన తెఱంగున మృత్యువు దోఁచినం బంచభూతమయంబయి కర్మ స్వరూపంబైన పూర్వదేహంబు విడిచి హరికృపావశంబున శుద్ధ సత్త్వమయంబైన భాగవతదేహంబు సొచ్చితి; నంతం ద్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశిమధ్యంబున శయనించు నారాయణమూర్తి యందు నిదురవోవ నిచ్చగించు బ్రహ్మనిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితి; నంత సహస్రయుగ పరిమితంబయిన కాలంబు సనిన లేచి లోకంబులు సృజియింప నుద్యోగించు బ్రహ్మనిశ్వాంబు వలన మరీచి ముఖ్యులగు మునులును నేనును జన్మించితిమి; అందు నఖండిత బ్రహ్మచర్యుండనై యేను మూఁడు లోకంబుల బహిరంతరంబులందు మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబు లేక యీశ్వరదత్తయై బ్రహ్మాభివ్యంజకంబులైన సప్త స్వరంబులు దమయంతన మ్రోయుచున్న యీ వీణాలాపన రతింజేసి నారాయణ కథాగానంబు సేయుచుఁజరియించుచుందు. 129
ఆ. తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు, దన చరిత్ర నేను దవిలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి, ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు.
130
క. విను మీ సంసారం బను, వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే
దనఁ బొందెడు వానికి వి, ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా!
131
చ. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామ రో
షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ
గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్‌.
132
వ. అని యిట్లు భగవంతుం డగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని, వీణ వాయించుచు యదృచ్ఛామార్గంబునం జనియె నని సూతుం డిట్లనియె. 133
క. వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతముల జగములకుం
జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే.
134
వ. అని నారదుం గొనియాడిన సూతునిం జూచి నారదు మాటలు విన్న వెనుక భగవంతుండైన బాదరాయణుం డేమి సేసె నని శౌనకుం డడిగిన సూతుం డిట్లనియె; బ్రహ్మదైవత్య యైన సరస్వతి పడమటి తీరంబున ఋషులకు సత్త్ర కర్మవర్ధనంబై బదరీతరుషండమండితంబయి “శమ్యాప్రాసం” బనం బ్రసిద్ధంబగు నాశ్రమంబు గలదు. అందు జలంబులు వార్చి కూర్చుండి వ్యాసుండు దన మదిఁ దిరంబు సేసికొని భక్తియుక్తం బయిన చిత్తంబునం బరిపూర్ణుం డయిన యీశ్వరుం గాంచి యీశ్వరాధీనమాయావృతంబైన జీవుని సంసారంబుఁ గని జీవుండు మాయచేత మోహితుండయి గుణవ్యతిరిక్తుండయ్యు మాయాసంగతిం దాను ద్రిగుణాత్మకుండని యభిమానించుచుం ద్రిగుణత్వాభిమానంబునం గర్తయు భోక్తయు నను ననర్థంబు నొందు ననియు; న య్యనర్థంబునకు నారాయణభక్తి యోగంబు గాని యుపశమనంబు వేఱొకటి లేదనియు నిశ్చయించి, 135
మ. అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్‌ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తి విశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పఁగన్‌.
136
వ. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థియైన శుకునిచేఁ జదివించెనని చెప్పిన విని శౌనకుండు నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండును నైన శుకయోగి యేమిటికి భాగవతం బభ్యసించె? ననవుడు సూతుం డిట్లనియె. 137
క. ధీరులు నిరపేక్షులు నా, త్మారాములునైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు, నారాయణుఁ డట్టి వాఁడు నవ్యచరిత్రా!
138
క. హరిగుణవర్ణన రతుఁడై, హరితత్పరుఁడైన బాదరాయణి శుభ త
త్పరతం బఠించెఁ ద్రిజగ, ద్వరమంగళమైన భాగవత నిగమంబున్‌.
139
క. నిగమములు వేయుఁ జదివిన, సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్‌
సుగమంబు, భాగవతమను, నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!
140
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )