పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
అర్జునుండు పుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట
వ. అని పలికి రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మ కర్మ ముక్తులును, బాండవుల మహాప్రస్థానంబును, కృష్ణకథోదయంబును జెప్పెదం; గౌరవధృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులైన వారలు స్వర్గంబునకుం జనిన వెనుక భీము గదాఘాతంబున దుర్యోధనుండు దొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. 141
ఉ. బాలుర చావు కర్ణములఁ బడ్డఁ గలంగి యలంగి, యోరువం
జాలక బాష్పతోయకణజాలము చెక్కుల రాల నేడ్చి, పాం
చాలతనూజ నేలఁబడి జాలిఁ బడం గని, యెత్తి మంజు వా
చాలతఁ జూపుచుం జికురజాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనున్‌.
142
మ. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్‌ ధర్మంబె? యా ద్రౌణి ని
ష్కరుణుండై విదళించె బాలకుల; మద్గాండీవ నిర్ముక్త భీ
కర బాణంబుల నేఁడు వాని శిరమున్‌ ఖండించి నేఁ దెత్తుఁ; ద
చ్ఛిరముం ద్రొక్కి జలంబు లాడు మిచటన్‌ శీతాంశుబింబాననా!
143
వ. అని యిట్లొడంబఱచి తనకు మిత్త్రుండును సారథియునైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి గాండీవంబు ధరియించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబు దోలించిన. 144
శా. తన్నుం జంపెదనంచు వచ్చు విజయున్‌ దర్శించి తద్ద్రౌణి యా
పన్నుండై శిశుహంత గావున నిజ ప్రాణేచ్ఛఁబాఱెన్‌ వడిన్‌
మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్‌ మోహించి క్రీడింప నా
సన్నుండౌ హరుఁజూచి పాఱు పగిదిన్‌ సర్వేంద్రియభ్రాంతితోన్‌.
145
వ. ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁ జూచి రథతురగంబు లలయుటఁ దెలిసి నిలిచి ప్రాణరక్షణంబునకు నొండుపాయంబు లేమి నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై ప్రయోగంబ కాని యుపసంహారంబు నేరకయుఁ బ్రాణ సంరక్షణార్థంబు పార్థునిమీఁద బ్రహ్మశిరోనామకాస్త్రంబుం బ్రయోగించిన నది ప్రచండ తేజంబున దిగంతరాళంబులు నిండి ప్రాణి భయంకరంబై తోఁచిన హరికి నర్జునుం డిట్లనియె. 146
సీ. పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! వినుము సంసారాగ్ని వేఁగుచున్న
జనుల సంసారంబు సంహరింపఁగ నీవు దక్క నన్యులు లేరు దలఁచి చూడ
సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య
పురుషుండవగు నీవు బోధముచే మాయ నడఁతువు నిశ్శ్రేయసాత్మయందు
 
ఆ. మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప సేసి ధర్మముఖ్యచిహ్నమయిన
శుభముసేయు దీవు సుజనుల నవనిలోఁ గావఁ బుట్టుదువు జగన్నివాస!
147
క. ఇది యొక తేజము భూమియుఁ, జదలును దిక్కులును నిండి సర్వంకషమై
యెదురై వచ్చుచు నున్నది, విదితముగా నెఱుఁగఁ జెప్పవే దేవేశా!
148
వ. అనిన హరి యిట్లనియె. 149
శా. జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛమై
బ్రహ్మాస్త్రం బదె యేసె; వచ్చె నిదె తద్బాణాగ్ని బీభత్స! నీ
బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మరలింపన్‌ రాదు; సంహార మీ
బ్రహ్మాపత్య మెఱుంగఁ; డేయుము వడిన్‌ బ్రహ్మాస్త్రమున్‌ దీనిపై.
150
వ. అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షిణంబు వచ్చి, ద్రోణనందనుం డేసిన బ్రహ్మాస్త్రంబు మీఁదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన. 151
మ. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్‌
రవి వహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువనత్రాసంబు గావింపఁగా
వివశభ్రాంతి యుగాంతమో యని ప్రజల్‌ వీక్షింప నా వేళ మా
ధవు నాజ్ఞన్‌ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్‌.
152
వ. ఇట్లస్త్రద్వయంబు నుపసంహరించి, ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని, రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం జూచి హరి యిట్లనియె. 153
ఉ. మాఱుపడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం
దేఱని పిన్నపాపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై,
పాఱుఁడె వీఁడు పాతకుఁడు, ప్రాణభయంబున వెచ్చనూర్చుచుం
బాఱెడి వీనిఁ గావుము కృపామతి నర్జున! పాపవర్జనా!
154
చ. వెఱచిన వాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై
మఱచినవాని, సౌఖ్యమున మద్యము ద్రావిన వాని, భగ్నుఁడై
పఱచిన వాని, సాధు జడభావము వానిని, గావు మంచు వా
చఱచిన వానిఁ, గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా!
155
శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణాసంగంబు సాలించి య
న్య ప్రాణంబులచేత రక్షణము సేయన్‌ వాఁ డధోలోక దుః
ఖప్రాప్తుండగు రాజదండమున సత్కల్యాణుఁడౌ నైన నీ
విప్రుం దండితుఁ జేయ నేటికి మహావిభ్రాంతిచే నుండఁగన్‌.
156
వ. అని యివ్విధంబున గృష్ణుం డానతిచ్చినం బ్రాహ్మణుండు కృతాపరాధుండయ్యు వధ్యుండు గాఁడను ధర్మంబు దలంచి చంపక ద్రుపదరాజపుత్రికిం దన చేసిన ప్రతిజ్ఞం దలంచి, బద్ధుండైన గురు నందనుం దోడ్కొని, కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబుకడకు వచ్చి. 157
క. సురరాజసుతుఁడు చూపెను, దురవధిసుతశోకయుతకు ద్రుపదుని సుతకుం
బరిచలితాంగశ్రేణిం, బరుష మహాపాశ బద్ధపాణిన్‌ ద్రౌణిన్‌.
158
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )