పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
క. పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ, బరుఁ డవ్యయుఁ డఖిలభూత బహిరంతర్భా
సురుఁడును లోకనియంతయుఁ, బరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!
186
వ. మఱియు జవనిక మఱువున నాట్యంబు సలువు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు వివృతరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండవయి పరిచ్ఛిన్నుండవు గాని నీవు మూఢదృక్కులు గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు? శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశ చరణ! హృషీకేశ! భక్తి యోగంబునం జేసి నమస్కరించెద. నవధరింపుము. 187
సీ. తనయులతోడ నే దహ్యమానం బగు జతుగృహంబందునుఁ జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల మారుతపుత్త్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ ద్రౌపదిమానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాదిఘనులచే నాబిడ్డ లని లోన నలఁగకుండ
 
తే. విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలుఁ ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను నిన్ను నేమని వర్ణింతు? నీరజాక్ష!
188
మత్తకోకిల. బల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ
తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
దల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ!
189
క. జననము నైశ్వర్యంబును, ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చనగోచరుఁడగు నిన్నున్‌, వినుతింపఁగ లేరు నిఖిలవిబుధస్తుత్యా!
190
వ. మఱియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, ఆత్మారాముండును, రాగాదిరహితుండును, గైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూతనిగ్రహానుగ్రహకరుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము. మనుష్యుల విడంబించు భవదీయవిలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు? నీకుం బ్రియాప్రియులు లేరు; జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను, మనుష్యులందు రామాది రూపంబులను, ఋషులయందు వామనాది రూపంబులను, జలచరంబులయందు మత్స్యాది రూపంబులను నవతరించుట లోక విడంబనార్థంబు గాని, జన్మకర్మ సహితుండ వగుటం గాదు. 191
ఉ. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజనబాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్‌.
192
క. మలయమునఁ జందనము క్రియ, వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలపై నభవుఁడు హరి యదు, కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా!
193
క. వసుదేవ దేవకులు తా, పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్త్రత నొందితి, వసురుల మృతి కంచుఁ, గొంద ఱండ్రు మహాత్మా!
194
క. జలరాశి నడుమ మునిఁగెడు, కలముక్రియన్‌ భూరిభారకర్శిత యగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ, గలిగితి వని కొంద ఱండ్రు గణనాతీతా!
195
తే. మఱచి యజ్ఞాన కామ్యకర్మములఁ దిరుగు, వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు, కొఱకు నుదయించి తండ్రు నిన్‌ గొంద ఱభవ!
196
శా. నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్‌ నీ దివ్యచారిత్రముల్‌
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్‌ విశ్వేశ! విశ్వంభరా!
197
వ. దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయ నేల? నీ కరుణావలోకనంబుల నిత్యంబును జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబు లయిన నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమఫల భరితంబులై యోషధి తరు లతా గుల్మ నద నదీ సమేతంబులై యుండు. 198
ఉ. యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహ వి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా!
199
శా. శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్‌ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్‌ నిత్యానుకంపానిధీ!
200
వ. అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతిమాటలకు నియ్యకొని, గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీ సుభద్రాదుల వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువు మని ప్రార్థితుండై నిలిచె నంత బంధువధశోకాతురుం డయిన ధర్మజుండు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబగు చిత్తంబున నిట్లనియె. 201
మ. తన దేహంబునకై యనేకమృగ సంతానంబుఁ జంపించు దు
ర్జనుభంగిం గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్‌ నాకు హా
యన లక్షావధి నైన ఘోరనరక వ్యాసంగముల్‌ మానునే?
202
వ. మఱియుఁ బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధియించినం బాపంబు లేదని శాస్త్ర వచనంబు గల, దయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధులయిన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పులేదు; గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబులచేతఁ బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి నిర్మలుండగు నని నిగమంబులు నిగమించుఁ; బంకంబునఁ బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబునకు శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాపబాహుళ్యంబ కాని పాప నిర్ముక్తిగాదని శంకించెద. 203
క. అని యిట్లు ధర్మసూనుఁడు, మొనసి నిరాహారభావమున దేవనదీ
తనయుఁడు గూలిన చోటికిఁ, జనియెఁ బ్రజాద్రోహ పాప చలితాత్ముండై.
204
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )